బిజినెస్

ఐదేళ్లలో ‘సాగరమాల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సాగరమాల’ ప్రాజెక్టు గడువును సగానికి కుదించుకోవాలని నిర్ణయించింది. నౌకాశ్రయాలతో పాటు అనుబంధ రంగాల్లో వౌలిక వసతుల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసి కోటి మంది భారతీయులకు ఉపాధి అవకాశాలనను కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వెల్లడించారు. ‘సాగరమాల’ ప్రాజెక్టును పదేళ్లలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు నిశ్చయించుకున్న విషయం విదితమే. అయితే ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవడంతో ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ఐదేళ్లలో దీనిని పూర్తి చేయాలని, తద్వారా కోటి మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గురువారం ముంబయిలో ప్రారంభమైన ‘మారిటైమ్ ఇండియా’ శిఖరాగ్ర సదస్సులో గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు వలన దేశ వాణిజ్య ఎగుమతులు 110 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో చేపట్టిన ‘సాగరమాల’ ప్రాజెక్టును ప్రధాన మంత్రి గురువారం ఇక్కడ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, భారత్‌కు గల 7,500 కిలోమీటర్ల తీరరేఖను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘సాగరమాల’ ప్రాజెక్టు కింద దేశంలోని రేవులతో పాటు అనుబంధ రంగాల్లో వౌలిక వసతులను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో కొత్తగా కోటి ఉద్యోగాలను సృష్టించడంతో పాటు మరో 40 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించేందుకు, అలాగే ఏటా 35 వేల కోట్ల రూపాయల రవాణా వ్యయాన్ని పొదుపు చేసుకునేందుకు వీలు కలుగుతుందని గడ్కరీ వివరించారు.
నాలుగు కీలకమైన అంశాలతో ‘సాగరమాల’ ప్రాజెక్టు ప్రణాళికను రూపొందించడం జరిగిందని, దేశీయంగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించుకునే విధంగా మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను తీర్చిదిద్దుకోవడం, సరుకుల ఎగుమతులు, దిగుమతుల ఖర్చును, సమయాన్ని తగ్గించుకోవడం, భారీ పరిశ్రమలను తీరప్రాంతాలకు సమీపంగా తరలించి ఖర్చులను తగ్గించడం, రేవులకు సమీపంలో మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటుచేసి ఎగుమతుల విషయంలో పోటీ తత్వాన్ని పెంపొందించుకోవడం ‘సాగరమాల’ ప్రణాళికలో అంతర్భాగంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
రేవుల ఆధునీకరణ, అనుసంధానత, రేవు ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ, తీరప్రాంతాల్లోని ప్రజల అభ్యున్నతి తదితర వివిధ కేటగిరీలకు చెందిన దాదాపు 150 ప్రాజెక్టులను కలగలిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సాగరమాల’ ప్రాజెక్టుకు వివిధ పథకాల కింద 12 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
దేశంలోని రేవుల్లో సరుకు రవాణ సామర్ధ్యాన్ని ఏటా 1000 మిలియన్ టన్నుల మేరకు పెంచాలన్న లక్ష్యంతో రేవుల ఆధునీకరణ కార్యక్రమం కింద ప్రభుత్వం 53 ప్రాజెక్టులను చేపడుతుందని భావిస్తున్నారు. వీటిలో ఆరు కొత్త మెగా పోర్టు ప్రాజెక్టులు కూడా ఉంటాయి. ఈ ఉప కేటగిరీలోని ప్రాజెక్టులకు 1,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని భావిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే అనుసంధానత (కనెక్టివిటీ)కు సంబంధించిన ఉప కేటగిరీలో కొత్తగా ఏడు డ్రై పోర్టులతో పాటు 10 వేల కిలోమీటర్ల పరిధిలో కొత్తగా వౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 3 వేల కోట్ల డాలర్లు, రేవు ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ జరిపి 27 ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు 1,500 కట్లో డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని భావిస్తున్నట్లు గడ్కరీ వివరించారు.

చిత్రం ముంబయలో గురువారం ప్రారంభమైన ‘మారిటైమ్ ఇండియా’ శిఖరాగ్ర సదస్సులో ‘సాగరమాల’ ప్రాజెక్టు ప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేస్తున్న ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ,
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, దక్షిణ కొరియా మంత్రి కిమ్ యంగ్ సుక్