బిజినెస్

మిరప ఎగుమతికి దన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 28: పురుగు మందుల వాడకం తగ్గించి మిరపకాయల నాణ్యత, ఉత్పత్తిని పెంచి ఎగుమతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎగుమతులు పెరిగితే విదేశీ మారకద్రవ్యంతోపాటు, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉన్నందున ఆ కోణంలో మిరప ఉత్పత్తి, నాణ్యత పెంచడానికి గుంటూరు జిల్లాలోని ఉద్యానవన శాఖ తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఈ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం (2015-16) 64 వేల హెక్టార్లలో మిరప పండించగా, ఈ ఏడాది 83 వేల హెక్టార్లలో పండిస్తున్నారు. మిరప సాగుచేసే 60 శాతం ప్రాంతంలో హైబ్రీడ్ రకాలనే పండించేవారు. తేజశ్విని, ఇండామ్ 5, యుఎస్ 341, బిఐజెఓ 273, అగ్నిరేఖ, వండర్ హాట్, బాడిగి వంటి రకాలను నాటేవారు. అయితే ఇవి హెక్టారుకు సరాసరి 6.25 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇచ్చేవి. మిగిలిన 40 శాతం మిరప సాగు చేసే భూములలో ఎల్సీఎ 334, ఎల్సీఎ 625, సరపూడి, సూపర్ 10, సూపర్ 20 వంటి రకాలను పండిస్తారు. ఈ రకాలు హెక్టారుకు సరాసరి 5 మెట్రిక్ టన్నుల దిగుబడిని మాత్రమే ఇచ్చేవి. దీనిని దృష్టిలో పెట్టుకొని మిరప ఉత్పత్తితోపాటు నాణ్యత కూడా పెంచడానికి ఉద్యానవన శాఖ గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా పది వేల ఎకరాలను ఎంపిక చేసింది. ఈ భూమిలో మిరప సాగుచేసే రైతులకు అధికారులు, శాస్తవ్రేత్తలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే మిరప కాయలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న విషయం తెలిసిందే. ఇక్కడి రేగడి నేలల్లో పండే మిరపకు ఘాటుతోపాటు రుచి కూడా ఎక్కువే. అందువల్ల ఈ పంటకు డిమాండ్ ఎక్కువ. ఈ ప్రాంతంలో పండే మిరపలో దాదాపు 40 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఎగుమతి చేసిన ఎండు మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని అనేకసార్లు తిప్పి పంపారు. దాంతో ప్రభుత్వం మిరప నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఉత్పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టి మిరపకాయలను యూరప్, అమెరికాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. దీనికి కావల్సిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉద్యానవన శాఖను ఆదేశించింది. ఫలితంగా ఆ శాఖ మిరప పంటలో పురుగుల మందుల వాడకాన్ని తగ్గించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఎండు మిర్చిలో పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరిస్తోంది. కాగా, గుంటూరు జిల్లాలోని పది క్లస్టర్లలోగల 22 మండలాల్లోని 76 గ్రామాలను ఎంపిక చేసి, ఆ గ్రామాల్లో పది వేల ఎకరాల్లో నాణ్యత గల మిరప పంట పండించడానికి ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది ఉద్యానవన శాఖ. దాదాపు ఏడు వేల మంది రైతులు ఈ భూమిని సాగు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్‌ను ఒక ఉద్యానవన శాఖాధికారి, ఒక వ్యవసాయ మల్టిపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పర్యవేక్షిస్తుంటారు. సస్యరక్షణతో మిరప సాగు చేయడంలో మిరప శాస్తవ్రేత్తలు, ఉద్యానవన శాఖ అధికారులకు, రైతులకు శిక్షణ ఇచ్చారు. అధికారుల పర్యవేక్షణలోనే తేజా, ఎండామ్5, ఎల్సీఎ 334, విఎస్ 341, బాడిగ వంటి హైబ్రీడ్ రకాలను సాగు చేస్తున్నారు. అంతేగాకుండా వారు తరచూ పంట పొలాలను సందర్శిస్తూ రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వేపతో తయారుచేసిన మందులనే వాడే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. రైతులు సస్యరక్షణ చర్యలను అమలు చేయడంతో పురుగు మందుల వినియోగం 50 శాతం వరకు తగ్గింది. అంతేగాకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మిరప పంటను సాగు చేయడంలో కూడా రైతులను ప్రోత్సహించారు. దాంతో పండు మిరపలో పురుగుల మందు అవశేషాలు తగ్గడంతో పాటు ఉత్పత్తి వ్యయం కూడా తగ్గింది. దీనివల్ల మిరప ఎగుమతిదారులు పొలాల్లోనే రైతుల నుంచి మిరపను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. తద్వారా రైతులు ఒక మెట్రిక్ టన్నుకు 15 వేల రూపాయల వరకు అదనంగా లాభం పొందే అవకాశం కలిగింది. 10 వేల హెక్టార్లలో సస్యరక్షణ చర్యల ద్వారా పండించిన పంట దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా రైతులకు 50 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఎగుమతిదారులు కూడా నాణ్యమైన మిరపను యూరప్, అమెరికాలకు ఎగుమతి చేసి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. దీంతో స్థూల ఉత్పత్తి కూడా పెరిగి ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.