బిజినెస్

పరిశోధనలతోనే పారిశ్రామిక ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 28: నాల్గవ పారిశ్రామిక విప్లవం సత్ఫలితాలివ్వాలంటే పౌర ఆధారిత పరిశోధనలు విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వైఎస్ చౌదరి అభిప్రాయపడ్డారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో శనివారం జరిగిన ‘డిజిటల్ ఆధారిత నాల్గవ పారిశ్రామిక విప్లవం’ అనే అంశంపై జరిగిన ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులను ఆహ్వానించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి పారిశ్రామిక విప్లవం దోహదం చేస్తుందని, అయతే ఇదే తరుణంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఎటువంటి దుష్ప్రభావాలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే యువతలో వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని, దీనికి పౌర ఆధారిత పరిశోధనలు విస్తృత పరచాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పౌర ఆధారిత పరిశోధనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వృత్తి నైపుణ్య శిక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవచ్చో సమగ్రమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతోనే నాల్గవ పారిశ్రామిక విప్లవం విజయవంతం అవుతుందన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్ మాట్లాడుతూ డిజిటలైజేషన్ ద్వారా నాల్గవ పారిశ్రామిక విప్లవం సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందుకు తగిన విధంగా పర్యావరణాన్ని, మానవ వనరులను అభివృద్ధి పరిచడంపై దృష్టి సారించామని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అన్ని విధాలా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలు సరళీకృతం చేశామని వివరించారు. యుఎస్‌ఎ గ్లోబల్ ఇన్నోవేషన్స్ ఇండెక్స్ బిజినెస్ కళాశాల పరిశోధకుడు రాఫెల్ ఎస్కలోనా రైనోసో మాట్లాడుతూ పలు రంగాల్లో వినూత్న విధానాలు అమలు చేయడంలో చైనా తరువాత భారత్ నిలిచిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ డిజిటలైజేన్ విధానాన్ని అనుసరించడం ప్రశంసనీయమని కొనియాడారు. టాటా కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ముకుందన్ మాట్లాడుతూ పరిశ్రమల డిజిటలైజేషన్‌కు అనువైన పర్యావరణాన్ని అభివృద్ధి పరచినప్పుడే నాల్గవ పారిశ్రామిక విప్లవం విజయవంతమవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో కూడా ఇటువంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీమెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునిల్ మాథుర్ మాట్లాడుతూ సమాజంలో వస్తున్న పరిణామాలకు అనుగుణంగా దశలవారీగా మనమూ మారాల్సి ఉందన్నారు. సమావేశంలో సిఐఐ (ఎస్‌ఆర్) చైర్మన్ డి రమేష్ నిస్సాల్, ఎలియన్స్ ఉపాధ్యక్షుడు కీర్తి ప్రకాష్, ఏషియన్ పెయింట్స్ అధ్యక్షుడు జలజ్ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ప్లీనరీలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి