బిజినెస్

టిసిఎస్ లాభాలు అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 18: దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. జనవరి-మార్చి వ్యవధిలో 72.7 శాతం వృద్ధితో 6,413 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 3,713 కోట్ల రూపాయలుగానే ఉంది. ఆదాయం 17.5 శాతం వృద్ధితో ఈసారి 28,449 కోట్ల రూపాయలుగా, పోయినసారి 24,220 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సోమవారం సంస్థ స్పష్టం చేసింది. ‘బిఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్, ఉత్పాదక రంగాల్లో మంచి వృద్ధిని సాధించాం. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారీ లాభాలను అందుకున్నాం. తద్వారా నూతన ఆర్థిక సంవత్సరంలోకి నూతనోత్సాహంతో ప్రవేశిస్తున్నాం.’ అని టిసిఎస్ సిఇఒ, ఎండి ఎన్ చంద్రశేఖర్ అన్నారు. ఇదిలావుంటే మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం 22.4 శాతం వృద్ధి చెంది 24,292 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 14.8 శాతం పెరిగి 1,08,646 కోట్ల రూపాయలుగా ఉంది. అంతేగాక 2015-16 నియామకాలతో టిసిఎస్ ఉద్యోగుల సంఖ్య 3,53,843కు చేరుకుంది. ఇక అంతర్జాతీయంగా ఈ జనవరి-మార్చిలో ఉత్తర అమెరికా మార్కెట్‌లో 10.8 శాతం, ఐరోపా మార్కెట్‌లో 12.9 శాతం, బ్రిటన్ మార్కెట్‌లో 8.3 శాతం చొప్పున వ్యాపారం వృద్ధి చెందినట్లు టిసిఎస్ తెలిపింది. ఇక ఈ ఏడాది ఉద్యోగులకు వేతనాలను 8-12 శాతం మేర పెంచినట్లు కూడా చెప్పింది. కాగా, 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌లో టిసిఎస్ వాటా 60 శాతానికిపైనే.