బిజినెస్

నగదు లావాదేవీల పన్నుపై నిర్ణయించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉన్నతాధికార ముఖ్యమంత్రుల కమిటీ సూచించిన విధంగా దేశంలో రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలపై బ్యాంకింగ్ నగదు లావాదేవీల పన్ను (బిసిటిటి) విధించాలన్న విషయంపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో గురువారం అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు 7 శాతం కంటే ఎక్కువగా ఉండగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్నులను రాత్రికి రాత్రే తగ్గించడం సాధ్యం కాదని, ఆర్థిక పరమైన ప్రతిబంధకాలే ఇందుకు కారణమని, కనుక ఈ పన్నులను దశల వారీగానే తగ్గించడం జరుగుతుందని తెలిపారు. ‘నగదు లావాదేవీలపై పన్ను విధించాలని కొన్ని సూచనలు వచ్చినప్పటికీ దీనిపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై ముఖ్యమంత్రుల కమిటీ సమర్పించిన నివేదికను కేంద్రం క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది’ అని దాస్ చెప్పారు. దేశంలో భౌతికంగా నగదు వినియోగాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలపై పన్ను విధించడంతో పాటు అన్ని రకాల పెద్ద లావాదేవీలపై పరిమితి విధించాలని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రుల కమిటీ గత నెల కేంద్రానికి సమర్పించిన నివేదికలో సిఫారసు చేసిన నేపథ్యంలో శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే కార్పొరేట్ పన్నులు తగ్గిస్తామని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రెండేళ్ల క్రితం ప్రకటించినప్పటికీ ఈ విషయంలో ప్రభుత్వానికి ఆర్థిక పరంగా కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని, ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉన్నందున రాత్రికి రాత్రే కార్పొరేట్ పన్నులను 25 శాతం తగ్గించడం సాధ్యం కాదని, అలా చేస్తే ఆర్థిక వ్యవస్థలోని అనేక ఇతర రంగాలకు ప్రభుత్వం న్యాయం చేయలేదని దాస్ తెలిపారు. వౌలిక వసతుల్లాంటి పలు కీలక రంగాల్లో చేయాల్సిన ఖర్చుల విషయంలో రాజీ పడకుండా ప్రభుత్వానికి ఆర్థికంగా ఉండే సాధ్యాసాధ్యాలపైనే కార్పొరేట్ పన్నుల తగ్గింపు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
వృద్ధిరేటు 7 శాతం పైనే..
ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 7 శాతం కంటే ఎక్కువగా నమోదవుతుందని ఆశిస్తున్నాట్లు ఆయన తెలిపారు. ‘ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ వచ్చే ఏడాది మన జిడిపి వృద్ధి రేటు విషయమై ప్రస్తుతానికి ఎంతో సానుకూల ధోరణి కనిపిస్తోంది. కనుక వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి రేటు 7 శాతానికి పైగా నమోదవుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని శక్తికాంత దాస్ వివరించారు.