బిజినెస్

సంక్షోభంలో మత్స్య పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: మత్స్య పరిశ్రమ సంక్షోభంలో పడింది. మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. మత్స్య పరిశ్రమను కుదేలు చేసింది. తరచూ పెరుగుతున్న డీజిల్ ధరలూ మత్స్య పరిశ్రమను దెబ్బతీస్తున్నాయ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులను ఏ విధంగానూ ఆదుకోకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. మత్స్య పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగులుతున్నా.. మత్స్యకార కుటుంబాలు రోడ్డుపడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆర్థిక కష్టాలు వచ్చిపడ్డాయ. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనార్థం నిరుడు నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. రాత్రికిరాత్రే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అప్పటిదాకా చలామణిలో ఉన్న 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు నిర్ణయంచడం తెలిసిందే.
దీంతో అన్ని వ్యాపార, పరిశ్రమలతోపాటు మత్స్య పరిశ్రమలోనూ ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. స్థానిక మార్కెట్‌తోపాటు విదేశాలకు చేపల ఎగుమతీ నిలిచిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌కు చేరాల్సిన రొయ్యలకు, చైనా, జపాన్ తదితర దేశాలకు ఎగుమతయ్యే ట్యూనా చేపలకు పెద్దగా ఆదరణ లేకుండాపోయింది. వీటితోపాటు మరికొన్ని ఖరీదైన చేపలకు డిమాండ్ ఉన్నా.. నోట్ల రద్దు ప్రభావంతో ఎగుమతులకు గట్టి దెబ్బ తగిలింది. నిజానికి దేశ, విదేశాలకు ఎగుమతయ్యే పలు రకాల చేపల వల్ల ఇక్కడ నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం సాగేది. అలాగే పన్ను రూపంలో ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వచ్చేది. అటువంటిది పాత పెద్ద నోట్ల రద్దు కారణంగా నిరుడు నవంబర్ నుంచి చేపల మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఏమీ చేయాలో తెలియని ఆయోమయంలో మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. మరోవైపు సముద్రంలో చేపల వేట తప్పితే మరే పనులు చేతగాని మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి.. అనేకసార్లు పెరిగిన డీజిల్ ధరలతో కోలుకోలేకుండా తయారైంది. గడిచిన రెండు మాసాల్లోనే రెండుసార్లు ధరలు పెరిగాయి. తొలిసారి లీటర్ డీజిల్‌కు 1.19 రూపాయలు పెరిగితే, రెండవసారి మరో 1.25 రూపాయల వరకు పెరిగింది. ఈ విధంగా అదనపు భారం పడుతూనే ఉంది. మరో రెండేళ్లు డీజిల్ ధరలు ఈ విధంగానే పెరుగుతూపోతే మత్స్య పరిశ్రమ వైపే ఇక చూడనక్కర్లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో బోటుకి నెలకు దాదాపు 500 లీటర్ల వరకు డీజిల్ వాడకం ఉంటుంది. ఈ విధంగా పది మాసాలకు 2.79 లక్షల రూపాయల మేర డీజిల్ వినియోగిస్తుంటారు. ప్రతిరోజు 700 నుంచి 800 వరకు బోట్లు చేపల వేటకు వెళ్తుంటాయి. అయితే డీజిల్ ధరలు తరచూ పెరుగుతుండటం, మరోపక్క పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో చేపల వేట నిర్వహించే బోట్ల సంఖ్య సగానికి పడిపోయిందని, దీనివల్ల లావాదేవీలు జరగడం లేదని మత్స్యకార కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయ. మరోపక్క చేపల వేటకు వెళ్ళాల్సిన మరికొన్ని బోట్లు తీరంలోనే నిలిచిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల వలనే నిరుడు బ్రౌన్ రొయ్య ఎగుమతులు గణనీయంగా క్షీణించాయి. గతంలో కిలో బ్రౌన్ రొయ్య 500 రూపాయలకు పైగానే ఉండగా, ఇపుడు ఇది 350 రూపాయలకి పడిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు తరచూ పెరుగుతున్నా.. మత్స్యకారులకు వచ్చే ఆయిల్ సబ్సిడీని మాత్రం కేంద్రం పెంచడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మత్స్యకార సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా 35 శాతానికిపైగానే బోట్లు తీరాన్ని దాటని పరిస్థితులు నెలకొన్నాయని, ఇటువంటి పరిస్థితులను గుర్తించైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులను ఆదుకునే చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వాల చిన్నచూపుతో మత్స్యకార కుటుంబాలు రోడ్డుపడుతున్నాయని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
పక్కా ఇళ్ళు, రుణ సదుపాయాలు కల్పించకపోవడం కూడా మత్స్యకారులను ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నాయని అంటున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్ అంతా అంధకారమేనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.