బిజినెస్

టెలికామ్ రంగంలో జోరుగా విలీనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిలయన్స్ జియో రాకతో భారతీయ టెలికామ్ రంగంలో నిత్యం సంచలనాలు చోటుచేసుకుంటున్నది తెలిసిందే. అప్పటిదాకా కొనసాగిన భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా ఆధిపత్యానికి బ్రేకులు పడగా, ఉచిత డేటా-కాల్స్‌తో జియో దూసుకెళ్తోంది. దీంతో మిగతా సంస్థలూ తమ ఇంటర్నెట్ డేటా, కాల్స్ ధరలను భారీగా తగ్గిస్తుండగా, వాటి ఆదాయంపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా విదేశీ సంస్థలు భారతీయ టెలికామ్ రంగం నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయ. కేంద్ర ప్రభుత్వంతో నెలకొన్న పన్నుల వివాదాలు కూడా దీనికి దోహదం చేస్తుండగా, సహచర సంస్థలతో విలీనాలకు సిద్ధమవుతున్నాయ.
*
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశీయ టెలికామ్ రంగం నుంచి విదేశీ సంస్థలు వైదొలుగుతున్నాయా? ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాల్సి వస్తోంది. ఇటీవలికాలంలో భారతీయ టెలికామ్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇలాగే ఉన్నాయిమరి. దేశీయ టెలికామ్ రంగాన్ని జియో పూర్వం.. జియో శకంగా చెప్పుకోవడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంచలన 4జి సంస్థ భారతీయ టెలికామ్ రంగాన్ని అంతలా ప్రభావితం చేసింది. దేశీయ టెలికామ్ రంగాన్ని ఏలేస్తున్న దిగ్గజాలన్నీ కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రాకతో కుదేలయ్యాయి. ఉచిత 4జి సేవలను జియో ప్రవేశపెట్టడంతో దీనికి మొబైల్ వినియోగదారులు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రధాన సంస్థల ఆదాయం గణనీయంగా పడిపోయింది. నిరుడు అక్టోబర్-డిసెంబర్‌లో ఐడియా సెల్యులార్ నష్టాల్లోకి జారుకుంది. ప్రభుత్వరంగ సంస్థలైన బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రైవేట్‌రంగ సంస్థల పోటీకి ఎప్పుడో నష్టాలబారినపడ్డాయ. అయతే ఇప్పుడిప్పుడు డేటా ఆఫర్లతో బిఎస్‌ఎన్‌ఎల్ దూకుడును ప్రదర్శిస్తుండగా, ల్యాండ్‌లైన్ కస్టమర్లు ఈ సంస్థకు పెద్ద బలంగా చెప్పుకోవచ్చు. అయనప్పటికీ నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయ. ఈ క్రమంలో అప్పటిదాకా సహచర సంస్థలు, ప్రభుత్వ విధానాలతో అసంతృప్తిగా ఉన్న విదేశీ టెలికామ్ సంస్థలు.. భారతీయ టెలికామ్ రంగం నుంచి నిష్క్రమించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చేశాయి. జియో దూకుడును తట్టుకోలేమని భావించిన వారంతా కూడా ఇతర సంస్థల్లో విలీనానికి సిద్ధపడుతున్నాయి.
నిన్న ఐడియాలో వొడాఫోన్ విలీన చర్చలైనా, నేడు ఎయిర్‌టెల్‌తో టెలినార్ ఒప్పందమైనా ఇందుకు నిదర్శనమే. ఇక అంతకుముందు నుంచే అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో కలిసిపోయేందుకు మలేషియాకు చెందిన ఎయిర్‌సెల్, రష్యాకు చెందిన సిస్టెమా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. టాటా కమ్యూనికేషన్స్‌తో జపాన్‌కు చెందిన డొకొమో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కూడా ప్రస్తుతం సవ్యంగా సాగడం లేదన్నది తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టుల్లో ఉన్నందున డొకొమో.. దేశీయ టెలికామ్ రంగం నుంచి ఇప్పటికిప్పుడు బయటకురాని పరిస్థితి. బలవంతంగానే టాటాతో డొకొమో కాపురం సాగుతోంది. మరోవైపు బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ సైతం ప్రభుత్వంతో ఉన్న పన్ను వివాదంతో విసిగిపోతోంది. ఈ క్రమంలో జియో ఉచిత 4జి సేవలు విదేశీ టెలికామ్ సంస్థలకు తలనొప్పిగా మారగా, ఇతర సంస్థలకు భారతీయ వ్యాపారాన్ని అమ్మేసి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వస్తున్నాయి. స్పెక్ట్రమ్ ధరలు కూడా భారంగా మారిపోతున్నాయ. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని టెలికామ్ ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల క్రమంలోనే బ్రిటన్ టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్.. భారత్‌లోని తమ వ్యాపారాన్ని ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్‌లో విలీనం చేయాలని చూస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు వొడాఫోన్ గ్రూప్ ధ్రువీకరించింది కూడా. మొత్తం షేర్ లావాదేవీల్లో జరిగే ఈ డీల్‌తో దేశంలోనే అతిపెద్ద టెలికామ్ సంస్థగా వొడాఫోన్, ఐడియా విలీనానంతర సంస్థ అవతరించనుంది. భారతీ ఎయిర్‌టెల్ రెండో స్థానానికి పరిమితమయ్యే వీలుండగా, జియో ఇన్ఫోకామ్‌కూ గట్టి పోటీనిచ్చినట్లు అవుతుందని కూడా భావిస్తున్నాయి వొడాఫోన్, ఐడియా.
కాగా, ప్రస్తుతం వొడాఫోన్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికామ్ సంస్థగా ఉంది. ఐడియా సెల్యులార్ భారత్‌లో మూడో అతిపెద్ద సంస్థగా ఉంది. ఈ రెండు సంస్థలు ఏకమైతే ఏర్పడే సంస్థ వినియోగదారుల సంఖ్య 387 మిలియన్లకు చేరుతుంది. అంతేగాక ప్రపంచంలోని అతిపెద్ద నెట్‌వర్క్, వినియోగదారులున్న సంస్థల్లో ఒకటిగా కూడా ఉండనుంది. 2007లో భారతీయ మార్కెట్‌లోకి వొడాఫోన్ ప్రవేశించగా, దేశీయ టెలికామ్ రంగంలో ఎయిర్‌టెల్ తర్వాత రెండో అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది. అయినప్పటికీ హచిసన్ కొనుగోలులో 2 బిలియన్ డాలర్ల పన్ను వివాదంతో వొడాఫోన్ ఇబ్బందుల్లో పడింది. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ వొడాఫోన్ పోరాడుతూనే ఉండగా, ఈ వ్యవహారంపై ఎప్పట్నుంచో అసంతృప్తిగా ఉన్న సంస్థ.. ఈ తాజా విలీనానికి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉచిత కాల్స్, డేటాతో మార్కెట్‌లో దూసుకెళ్తున్న జియో కూడా కారణమేనని, జియో వినియోగదారుల సంఖ్య నానాటికి పెరుగుతుండటం, ఇప్పుడది 74 మిలియన్లకు చేరడంతో భవిష్యత్‌పై వొడాఫోన్ ఆశాజనకంగా లేకపోవడం వ్యాపార విక్రయానికి కారణమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. టెలికామ్ రంగంలో ఇప్పటికే 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ జియో.. మరో 4.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఇక ఐడియా సెల్యులార్‌లో ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు 42.2 శాతం వాటా ఉంది. అలాగే మలేషియాకు చెందిన అక్సియాట గ్రూప్ బహ్ద్‌కు 19.8 శాతం వాటా ఉంది. వొడాఫోన్ ఇండియా మాత్రం పూర్తిగా వొడాఫోన్ గ్రూప్‌దే. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన టెలికామ్ ఆపరేటర్లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తన ఏడు సర్కిళ్లలో టెలినార్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి టెలినార్ సౌత్ ఏషియా ఇనె్వస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ గురువారం వెల్లడించినది తెలిసిందే. అయితే ఈ కొనుగోలు ఒప్పందం విలువ ఎంతన్నదీ ఇటు ఎయిర్‌టెల్ గానీ, అటు టెలినార్ సంస్థ గానీ వెల్లడించలేదు. నిజానికి దేశీయంగా టెలినార్ భారీ నష్టాల్లో నడుస్తోంది.
ఇప్పటికే ఈ సంస్థ తాము భారతీయ టెలికామ్ రంగం నుంచి వైదొలగనున్నామన్న సంకేతాలను ఇచ్చింది. ఈ క్రమంలో టెలినార్‌ను ఎయిర్‌టెల్ హస్తగతం చేసుకుంటుండగా, వొడాఫోన్-ఐడియా విలీనం ఫలప్రదమైతే తన ఆధిపత్యానికి జరిగే నష్టాన్ని కూడా టెలినార్ కొనుగోలుతో తగ్గించుకోవచ్చని భారతీ గ్రూప్ భావిస్తోంది. వాయస్ కాల్స్‌పరంగా టెలినార్ కస్టమర్లకు తక్కువ ధరలకే సేవలందిస్తుండగా, డేటాపరంగా ఎయిర్‌టెల్ స్వల్ప ధరలకే అంది స్తోంది. దీంతో ఈ రెండు సంస్థలు కలిస్తే పెరిగే నెట్‌వర్క్‌తో జియోకు చెక్ పెట్టవచ్చనే అభిప్రా యాలు వినిపిస్తున్నాయ. టెలినార్‌కు ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ (తూర్పు), ఉత్తరప్రదేశ్ (పడమర), అస్సోం సర్కిళ్లలో 44 మిలియన్ల కస్టమర్లున్నారు. మరోవైపు రోజుకొకటి చొప్పున వస్తున్న ప్రమోషనల్ ఆఫర్లపై, ఆరోగ్యకరంగా లేని పోటీయుత ధరల విధానంపై టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ దృష్టి సారిస్తోంది. రిలయన్స్ జియో రాకతో టెలికామ్ రంగంలో నిత్యం సంచలనాలు చోటుచేసుకుంటున్నది తెలిసిందే. అప్పటిదాకా కొనసాగిన భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా ఆధిపత్యానికి బ్రేకులు పడగా, ఉచిత డేటా-కాల్స్‌తో జియో దూసుకెళ్తోంది. దీంతో మిగతా సంస్థలూ తమ ఇంటర్నెట్ డేటా, కాల్స్ ధరలను భారీగా తగ్గిస్తుండగా, వాటి ఆదాయంపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జియో తీరుపై ఎయిర్‌టెల్, ఐడియా న్యాయపోరాటం కూడా చేస్తుండగా, జియో ప్రమోషనల్ ఆఫర్ల గడువు పెంపునకు ట్రాయ్ ఇస్తున్న మద్దతుపైనా అసంతృప్తితో ఉంటున్నాయి. దీనిపైనా టిడిశాట్‌కు ఫిర్యాదు చేయగా, ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఓ అభిప్రాయానికి రావడం కోసం ఇప్పుడు ట్రాయ్.. ‘రెగ్యులేటరీ ప్రిన్సిపుల్స్ ఆఫ్ టారీఫ్ అసెస్‌మెంట్’పై ఓ కన్సల్టేషన్ పేపర్‌లో భాగంగా చర్చకు శ్రీకారం చుట్టింది. పారదర్శకత, వ్యాపార ప్రోత్సాహకాలు, ధరల తీరు, డేటా, కాల్స్ ప్యాకేజీల ప్రకటన తదితర అన్నింటిపైనా కన్సల్టేషన్ పేపర్ ద్వారా ట్రాయ్ సమీక్షించనుంది. ఈ క్రమంలో పరిశ్రమ, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను సేకరించనుంది. వచ్చే నెల మార్చి 17లోగా వీటిపై లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను సమర్పించాలని కోరింది. టిడిశాట్ సైతం జియో ఆఫర్లపై ట్రాయ్‌ని వివరణ కోరింది. అయతే జియో ఉచిత ఆఫర్లపై టారీఫ్ ప్లాన్లను ముకేశ్ అంబానీ తాజాగా ప్రకటించడం టెలికామ్ సంస్థల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రోజుకు 10 రూపాయల చొప్పున నెలకు 303 రూపాయల చార్జితో ఉచిత డేటా ప్రయోజనాలను జియో ప్రస్తుత కస్టమర్లు పొందవచ్చని, 99 రూపాయల వన్‌టైమ్ ఫీజునూ చెల్లించాల్సి ఉంటుందని ముకేశ్ చెప్పినది తెలిసిందే. కాగా, వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ డేటాకు సంబంధించి ఉచిత ఆఫర్లతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్న ముకేశ్ అంబానీ.. లోకల్, ఎస్‌టిడి వాయస్ కాల్స్, రోమింగ్ ఉచితమని ప్రకటించారు.
మార్కెట్‌లో పోటీయుత ఆఫర్లనిస్తామని, ప్రత్యర్థి సంస్థల కంటే 20 శాతం తక్కువకే సేవలందిస్తామని స్పష్టం చేశారు. అయనప్పటికీ జియో తాజా ప్రకటనతో టెలికామ్ పరిశ్రమలో ఇతర సంస్థలకు కొంత ఉపశమనం లభించిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సిఒఎఐ) వ్యాఖ్యానించింది. ఆరు నెలల క్రిందట 4జి సేవలతో దేశీయ టెలికామ్ రంగంలోకి అడుగిడిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. ఇప్పటివరకు ఉచితంగానే సేవలు అందిస్తున్నది తెలిసిందే. వచ్చే నెల 31దాకా ఈ ఉచిత సేవలు కొనసాగనున్నాయి. అయితే ఆ తర్వాతి నుంచి స్వల్పంగా చార్జీలు వసూలు చేస్తామని తాజాగా సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ చెప్పారు. నిజానికి నిరుడు డిసెంబర్ 31 వరకే తొలుత ఉచిత సేవలని ప్రకటించిన జియో.. న్యూ ఇయర్ ఆఫర్ పేరిట ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. దీనిపై భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ టిడిశాట్‌లో ఫిర్యాదు కూడా చేయగా, టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ తీరుపైనా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏప్రిల్ 1 నుంచి ఇక జియో ఉచిత సేవలు ఆగిపోతాయని, ఎంతోకొంత చార్జీలు వసూలు చేస్తున్నందున కొంత నయమని, దీనివల్ల ప్రత్యర్థి సంస్థల వ్యాపారం పెరగవచ్చని సిఒఎఐ అంటోంది. కాగా, జియో ప్రకటనలు, ఇతర సంస్థల విలీనాలతో టెలికామ్ సంస్థల షేర్లూ లాభాల్లో పరుగులు పెడుతుండగా, మొత్తానికి భారతీయ టెలికామ్ రంగంలో సంస్థల సంఖ్య 10-15 నుంచి 5-6కు పడిపోతోంది.