బిజినెస్

సంపన్నుల సాగరం.. ముంబయి నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ముంబయి నగరం దేశ ఆర్థిక రాజధానే కాదు.. దేశంలోనే సంపన్న నగరం కూడా. ముంబయిలో 46 వేల మంది మిలియనీర్లతోపాటు 28 బిలియనీర్లు సైతం కాపురమున్నారు మరి. వీరి వద్దనున్న సంపద విలువ 820 బిలియన్ డాలర్లు. న్యూ వరల్డ్ వెల్త్ తాజా నివేదిక ప్రకారం భారత్‌లోని సంపన్న నగరాల్లో ముంబయి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరులుండగా, ఢిల్లీలో 23 వేల మంది మిలియనీర్లు, 18 బిలియనీర్లున్నారు. వీరి సంపద విలువ 450 బిలియన్ డాలర్లు. అలాగే బెంగళూరులో 7,700 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లుంటున్నారు. వీరి సంపద 320 బిలియన్ డాలర్లు. ఇక ఈ జాబితాలో హైదరాబాద్ నగరం కూడా ఉండగా, ఇక్కడ 9 వేల మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లు నివాసముంటున్నారు. వీరి సంపద విలువ 310 బిలియన్ డాలర్లు. కోల్‌కతాలోని సంపన్నుల వద్ద 290 బిలియన్ డాలర్ల సొమ్ముండగా, వీరిలో 9,600 మంది మిలియనీర్లు, నలుగురు బిలియనీర్లున్నారు. పుణెలో కూడా 4,500 మంది మిలియనీర్లు, ఐదుగురు బిలియనీర్లున్నారు. వీరి సంపద విలువ 180 బిలియన్ డాలర్లు. చెన్నైలో 150 బిలియన్ డాలర్ల సంపదతో 6,600 మంది మిలియనీర్లు, నలుగురు బిలియనీర్లున్నారు. గుర్గావ్‌లో సైతం 110 బిలియన్ డాలర్ల సంపదతో 4 వేల మంది మిలియనీర్లు, ఇద్దరు బిలియనీర్లున్నారు. సూరత్, అహ్మదాబాద్, విశాఖపట్నం, గోవా, చండీగఢ్, జైపూర్, వడోదర తదితర నగరాల్లోనూ సంపన్నులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నారని న్యూ వరల్డ్ వెల్త్ తెలిపింది. ఇకపోతే నిరుడు డిసెంబర్ నాటికి దేశంలోని మొత్తం సంపద విలువ 6.2 ట్రిలియన్ డాలర్లు. 2,64,000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లున్నారు. ‘స్థానిక ఆర్థిక సేవలు, ఐటి, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్, మీడియా రంగాల్లోని బలమైన వృద్ధితో రానున్న దశాబ్ద కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనాలే కలుగనున్నాయి. ముఖ్యంగా స్థానిక హాస్పిటల్ సర్వీసెస్, ఆరోగ్య బీమా రంగాల్లో వృద్ధిరేటు చాలా బాగుంటుంది. మొత్తంగా చూస్తే సంపద వృద్ధిలో హైదరాబాద్, పుణె, బెంగళూరు నగరాలు మున్ముందు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి.’ అని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక అభిప్రాయపడింది. ఇదిలావుంటే ముంబయిలోని బాంద్రా, జుహు, గోరేగావ్, పరెల్, వర్లి, పామ్ బీచ్ రోడ్డు ప్రాంతాలు సంపన్నులు నివసించే ప్రాంతాలుగా తాజా నివేదిక చెప్పింది. అలాగే ఢిల్లీలో వెస్టెండ్ గ్రీన్స్, డెరా మండి, గ్రేటర్ కైలాష్, లూటియెన్స్ ప్రాంతాలు, కోల్‌కతాలో బల్లిగుంజ్, అలీపూర్, చెన్నైలో బోట్ క్లబ్ రోడ్డు, పోయెస్ గార్డెన్ ప్రాంతాల్లో సంపన్నులు అధికంగా ఉంటున్నారు.