బిజినెస్

సంక్షోభంలో జీడిపప్పు పరిశ్రమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 21: విదేశీ జీడిపప్పు స్వదేశీ మార్కెట్‌ను ముంచెత్తుతోంది. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో స్వదేశీ అవసరాలకు విదేశాల నుండి పెద్దయెత్తున జీడిపప్పు దిగుమతి అవుతోంది. విదేశీ జీడిపప్పుతో అవసరాలు తీరుతున్నా స్వయం సమృద్ధికి మాత్రం విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో జీడిమామిడి తోటలు అంతరించిపోతున్నాయి. పంట భూములు కోస్తా జిల్లాల్లో రియల్ ఎస్టేట్లుగా రూపాంతరం చెందుతున్నాయి. నష్టాల కారణంగా రైతులు చెట్లను నరికివేస్తున్నారు. ఫలితంగా జీడిపప్పు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. విదేశాల నుండి జీడిగింజల దిగుమతి గత అయిదేళ్లుగా బాగా పెరిగింది కూడా. ఇందుకు ప్రధాన కారణం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సరైన ప్రోత్సాహం లేకపోవడం, నిరాదరణవల్ల పరిస్థితులు అనుకూలించకపోవడంతో రైతులు సాగుబడికి ఆసక్తి కనబరచకపోవడమే. మరోవైపు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో దిగుమతులు అనివార్యమయ్యాయి. దేశవ్యాప్తంగా 15 వేల కోట్ల రూపాయల విలువైన జీడిపప్పునకు డిమాండు ఉంది. ఇందులో దేశీయంగా 7,500 కోట్ల రూపాయల విలువైన సరకు మాత్రమే లభ్యమవుతోంది. దీంతో విదేశాలపై ఆధారపడటం తప్పట్లేదు. ఈ దిగుమతి విధానంలో ముందుగానే డబ్బు చెల్లించి, దిగుమతి చేయించుకోవాల్సి ఉంది. వారు ఎటువంటి సరకు పంపిస్తే అది తీసుకోవాల్సిందే. విదేశాల నుంచి సరకు కోసం అక్కడి ట్రేడర్లకు డబ్బు చెల్లించిన తరువాత షిప్పుల్లో ఖాళీ కంటైనర్లు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు. నాసిరకం సరకు పంపించినా భరించాల్సిందే. మన ట్రేడర్లకు అవసరమైన సహకారం కూడా ప్రభుత్వపరంగా అందని పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో విదేశీ నాసిరకం సరకు కూడా మన మార్కెట్‌ను ఆక్రమిస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతుల్లో అవగాహన పెంపొందించి, చైతన్యం తీసుకురావాల్సి ఉంది. జీడిమామిడి తోటలను పెంచడానికి అనువైన వాతావరణాన్ని కల్పించి, ప్రోత్సాహకాలను అందిస్తే తప్ప మార్కెట్ కొరతను అధిగమించే అవకాశాలు కనిపించడం లేదని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బస్తా జీడి గింజల ధర 8 వేల రూపాయలు పలుకుతోంది. సరాసరిగా మార్కెట్‌లో 7,500 రూపాయలకు తగ్గే అవకాశం లేదు. ఒక ఎకరానికి కనీస స్థాయిలో ఆరు బస్తాలకు తగ్గకుండా పంట చేతికొస్తుంది. అంటే ఎకరానికి 50 వేల రూపాయల ఆదాయం లభిస్తుంది. దిగుమతులు పెరిగి, ఉత్పత్తి తగ్గడం వల్ల ఇటీవల బడ్జెట్‌లో ప్రభుత్వం 9.45 శాతం దిగుమతి సుంకం విధించింది. దీంతో ఈ వ్యాపారానికి ఇంకా ఇబ్బందికరమైన పరిణామం దాపురించింది. ఇప్పటికే గిట్టుబాటు కాకుండా ఉంటే ఇప్పుడు దిగుమతి సుంకం కూడా పెరగడం వల్ల వ్యాపారం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని వ్యాపారుల నుండి ఆందోళన వ్యక్తమవుతోంది. జీడిపప్పు ఉత్పత్తిలో మనకు ప్రధాన పోటీదారు వియత్నాం. ఉత్పత్తి వ్యయం బాగా తక్కువగా ఉండటంతో వియత్నాం నుంచే ఎగుమతులు బాగా విస్తరించాయి.
అంతర్జాతీయంగా పరిస్థితులు ఈవిధంగా ఉంటే మన దేశంలో సరకును ఒకచోట నుండి మరోచోటకు రవాణా చేసుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. రైతు తన సరకును ఒకచోట నుండి మరోచోటకు రవాణా చేయాలంటే కంప్యూటర్ వేబిల్లు కచ్ఛితంగా తీసుకోవాల్సిందే. స్థానికంగానే ఒకే ఊరులో మరోచోటికి రవాణా చేయాలన్నా కంప్యూటర్ వేబిల్లు ఉండాల్సిందే. లేదంటే భారీస్థాయి జరిమానా చెల్లించాల్సిందే. దీంతో వాణిజ్య శాఖ తాజా నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రైతులకు ముందుగా పెట్టుబడి పెడితే తప్ప వ్యాపారాలు చేయలేని పరిస్థితి ఉందని, రవాణాకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే బావుంటుందని వ్యాపారులు కోరుతున్నారు.
ఇక తోటల పెంపకం వల్ల ఒక బస్తా జీడిపప్పు తయారీకి ఆరు నుండి ఏడుగురు అవసరమవుతారు. 50 బస్తాల జీడిపప్పు తయారు చేసే ఫ్యాక్టరీలో 300 నుండి 400 మంది వరకు ఉపాధి లభిస్తోంది. ఉపాధికి విపరీతమైన డిమాండ్ కలిగిన వ్యవసాయం కాబట్టి ప్రభుత్వం తోటల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. కనీసం వృథా భూముల్లోనైనా ఈ పంట విస్తీర్ణంపై దృష్టిపెడితే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. కేరళ రాష్ట్రంలో అయితే ప్రతి ఇంటికి ఒకటి రెండు చెట్లు పెంచుకుంటూంటారు. అలా మన రాష్ట్రంలో కూడా ఇంటి పెరట్లో చెట్లు పెంపకం జరిగితే కూడా ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మాత్రం ఈ వ్యాపారం బాగుంటుందని, ఎంతోమందికి కుటీర పరిశ్రమగా ఉపాధి లభిస్తుందని అంటున్నారు. పంటలో స్వయం సమృద్ధి సాధిస్తే విస్తృత ఉపాధి మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని కోరుతున్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు విపరీతమైన దిగుమతి సాధించే ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇప్పుడు 50 శాతం ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. జీడిపప్పు పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకోవడంతో గిట్టుబాటుగాక ఈ వ్యాపారాన్ని ట్రేడర్లు కూడా వదిలేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుండి రోజుకు 5,6 వేల బస్తాల ఉత్పత్తి జరుగుతోంది. దీనిని బట్టి 42 వేల మందికి ఉపాధి లభిస్తోంది. జీడిపప్పు వ్యాపారానికి సవాలక్ష లైసెన్సులు విధించారు. అయతే విదేశాలతో వ్యాపారం చేస్తున్న మన ట్రేడర్లకు ప్రభుత్వపరంగా సహకారాన్ని అందించాలని కోరుతున్నారు. విదేశీ జీడి గింజలు దిగుమతి చేసుకునే క్రమంలో నష్టపోకుండా మన జీడి గింజల వ్యాపారులను కాపాడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ దేశంలో నిత్యం వాడుకకు 80 శాతం జీడిగింజలు ఆఫ్రికా దేశాల నుండి దిగుమతి అవుతున్నాయి. జీడి గింజల ఉత్పత్తి ఆధారంగా దేశంలో నాలుగు వేల పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులు జీవిస్తున్నారు. ఇందులో 80 శాతం మంది మహిళలే పనిచేస్తున్నారు. కాగా, నూతన ఎక్సైజ్ విధానం కారణంగా 90 శాతం పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ విధానాన్ని రద్దుచేసి, ఈ పరిశ్రమను కుటీర పరిశ్రమలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎం తైనా ఉందని నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.

*దేశీయ జీడిపప్పు మార్కెట్ విలువ 15 వేల కోట్లు
*దిగుమతులపైనే సగానికిపైగా డిమాండ్ ఆధారం
*ఆఫ్రికా దేశాల నుండే అధిక దిగుమతులు
*దేశంలో నాలుగు వేల జీడిపప్పు పరిశ్రమలు
*ఎక్కువమంది మహిళా కార్మికులే
*పలాసలో మూతబడిన 50 శాతం కర్మాగారాలు
*40-50 వేల మందికి ఉపాధి దూరం
*నూతన ఎక్సైజ్ విధానం ప్రతికూలం
*90 శాతం పరిశ్రమలపై ప్రభావం
*వ్యాపారులకు భారంగా దిగుమతి సుంకం