బిజినెస్

ద్రవ్య వ్యవస్థలోకి రూ. 12 లక్షల కోట్ల కొత్త నోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: దేశంలో ప్రస్తుతం 12 లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువైన కొత్త కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నిరుడు నవంబర్ 8న అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినప్పటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఒక పద్ధతి ప్రకారం కొత్త 500, 2 వేల రూపాయల నోట్లను మార్కెట్లోకి తీసుకువస్తోందని శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా జైట్లీ చెప్పారు. కొత్త నోట్ల చెలామణికి సంబంధించి ఆర్‌బిఐ చివరిసారిగా గత ఫిబ్రవరి 24న గణాంకాలను విడుదల చేసిందని, అప్పటికి చెలామణిలో ఉన్న కరెన్సీ 11,64,110 కోట్లని ఆయన చెప్పారు. ఆ తర్వాత రెండు వారాలు గడిచిపోయినందున చెలామణిలో ఉన్న మొత్తం 12 లక్షల కోట్లను దాటి ఉంటుందని జైట్లీ తెలిపారు. కాగా, రద్దు చేసిన వెయ్యి, 500 రూపాయల నోట్ల డిపాజిట్లకు సంబంధించి కచ్చితమైన లెక్కలు చెప్పడం కష్టమని అనుబంధ ప్రశ్నలకు సమాధానంగా జైట్లీ తెలిపారు. ప్రతి కరెన్సీ నోటును అసలైనదా, నకిలీదా అని జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతోందని, ఇది చాలా పెద్ద ప్రక్రియ అని, అందువల్ల ఇప్పుడే లెక్కలు చెప్పడం కష్టమని ఆయన అంటూ, ఆర్‌బిఐ ఈ ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత సభకు తెలియజేస్తామని తెలిపారు. కాగా, నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చు సంబంధిత మెటీరియల్, సైజులను బట్టి మారుతుంటుందని జైట్లీ చెప్తూ, ప్రస్తుతం ఒక 500 రూపాయల నోటును ముద్రించడానికి రూ. 2.87 నుంచి రూ. 3.09 ఖర్చు అవుతుండగా, వెయ్యి, 2 వేల రూపాయల నోటు ముద్రణకు రూ. 3.34-రూ. 3.77 వరకు ఖర్చవుతోందని చెప్పారు.
మరోవైపు శుక్రవారం న్యూఢిల్లీలో ఆర్‌బిఐ, ఆర్థిక సేవల శాఖ అధికారుల తో జైట్లీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ రంగ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న నిరర్థక ఆస్తుల సమస్య పరిష్కార చర్యలపై ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో అరుణ్ జైట్లీ చర్చించారు.

చిత్రం..ఆర్‌బిఐ, ఆర్థిక సేవల శాఖ అధికారులతో సమావేశమైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ