బిజినెస్

కింగ్‌ఫిషర్ బాటలో ఎయిర్ కోస్టా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: ఆర్థిక సమస్యలతో సమతమతమవుతున్న ఎయిర్ కోస్టా విమానయాన సంస్థను ఇప్పుడు సిబ్బంది వలస మరింత కుంగదీస్తోంది. సిబ్బందికి వేతనాలు సరిగా చెల్లించలేకపోతుండటంతో గత కొద్ది వారాల్లో 40 మంది పైలెట్లు సహా పలువురు ఉద్యోగులు ఈ సంస్థకు గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే మే నెల వరకు టికెట్ల బుకింగ్స్‌ను రద్దు చేసిన ఈ సంస్థ నిధుల సమీకరణ కోసం పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ఎటువంటి పురోగతి సాధించినట్లు కనిపించడంలేదు. ఎయిర్ కోస్టా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుండటంతో ఆ సంస్థకు చెందిన దాదాపు 450 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దీంతో 2012లో మూతబడిన కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ మాదిరిగానే ఎయిర్ కోస్టా కూడా మూతబడి వందలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయని విమానయాన రంగానికి చెందిన ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడను కేంద్రంగా చేసుకుని పని చేస్తున్న ఎయిర్ కోస్టాను తీవ్రమైన నగదు కొరతతో పాటు విమానాల లీజుదారైన జిఇ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్‌తో తలెత్తిన ఆర్థిక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. దీంతో ఈ సంస్థ గత నెల 28వ తేదీ నుంచి విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎయిర్ కోస్టా తమ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల వేతనాలను చెల్లించలేదని, సంస్థలోని మొత్తం సిబ్బందిలో సగం కంటే ఎక్కువ మందికి జనవరి నెల నుంచి వేతనాలు అందలేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
జిఇ క్యాపిటల్ నుంచి మూడు ఎంబ్రాయర్ విమానాలను లీజుకు తీసుకున్న ఎయిర్ కోస్టా గత ఏడాది ఆగస్టులో తొలిసారి కార్యకలాపాలను నిలిపివేసిన విషయం విదితమే. లీజు బకాయిలను చెల్లించడంలో విఫలమైనందున ఎయిర్ కోస్టా నుంచి ఒక విమానాన్ని జిఇ క్యాపిటల్ వెనక్కి తీసేసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అప్పటికి ఎయిర్ కోస్టాలో 600 మందికి పైగా ఉద్యోగులు ఉండగా, ఆ తర్వాత 14 మంది కమాండర్లు, మరో 30 మంది ఫస్ట్ ఆఫీసర్లు సహా దాదాపు 150 మంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలిగారని, ప్రస్తుతం మిగిలివున్న దాదపు 450 మంది సిబ్బందికి కూడా ఎయిర్ కోస్టా వేతనాలను చెల్లించడం లేదని ఆ అధికారి వివరించారు. మే నెల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ కోస్టా ప్రమోటర్లు చేసిన ప్రకటనను చూస్తుంటే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరిగా ఈ సంస్థ కూడా మూతబడటం ఖాయమన్న విషయం స్పష్టమవుతోందని ఆ అధికారి చెప్పారు.
ఇదిలావుంటే, జనవరి, ఫిబ్రవరి మాసాలకు సంబంధించి ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతన బకాయిలను ఈ నెల 15వ తేదీలోగా చెల్లిస్టామని చెప్పిన ఎయిర్ కోస్టా ప్రమోటర్లు తమ మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని మరో అధికారి తెలిపారు. సిబ్బందికి వేతనాల రూపంలో నెలకు దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లిస్తున్న ఈ సంస్థ మళ్లీ తన విమాన సేవలను పునరుద్ధరించేందుకు దాదాపు 200 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయితే ఈ నిధుల సమీకరణ కోసం ఎయిర్ కోస్టా చర్చలు జరుపుతున్న పెట్టుబడిదారులకు అంత స్తోమత లేదని, ఈ చర్చల్లో పురోగతి లేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఆ అధికారి చెప్పారు. ఈ విషయమై ఎయిర్ కోస్టా అధికార ప్రతినిధి కె.చౌరాసియాను సంప్రదించగా, నిధులను సమీకరించి సాధ్యమైనంత త్వరలో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు సంస్థ అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు.