బిజినెస్

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జిఎస్‌టి ఆమోదం పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టాలను ఎందుకు ఆమోదించాలో.. వివరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది జూలై 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తీసుకురావాలని మోదీ సర్కారు భావిస్తున్నది తెలిసిందే. అయితే అలాకాని పక్షంలో సెప్టెంబర్ 15 తర్వాత పరోక్ష పన్నుల వసూళ్ల హక్కును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోవాల్సి వస్తుందని గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో తెలిపారు. ఇదే జరిగితే ఖజానాకు భారీ నష్టమేనన్న ఆయన జిఎస్‌టి అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని పునరుద్ఘాటించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జిఎస్‌టి అమలు కావాల్సి ఉందని నొక్కిచెప్పారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ జిఎస్‌టి రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతుగా నాలుగు బిల్లులను తెచ్చామని, వీటిని సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. ఇవి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్ 2017, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్ 2017, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్ 2017, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (రాష్ట్రాలకు నష్టపరిహారం) బిల్ 2017. మొత్తం తొమ్మిదింటిలో ఈ నాలుగింటికి ఆమోదం లభించిందన్న ఆయన మరో ఐదింటికి కూడా ఈ నెల 31లోగా ఆమోదం లభించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 12న ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిపోతుండగా, లోక్‌సభలోనూ త్వరలో ప్రవేశపెడతామని జైట్లీ చెప్పారు. ఇదిలావుంటే పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కాహాల్‌పై మాట్లాడుతూ రాష్ట్రాలు, జిఎస్‌టి మండలి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఇవి కూడా జిఎస్‌టి పరిధిలోకి వస్తాయన్నారు. అప్పటిదాకా వీటిపై కేంద్రం పన్నును విధించడం కుదరదన్నారు.
కాగా, జిఎస్‌టి అమలుతో ఆయా వస్తువుల ధరలు తగ్గి చౌకవుతాయన్న జైట్లీ.. పన్ను ఎగవేతదారులకు కళ్లెం వేసినట్లు కూడా అవుతుందని అన్నారు. మరోవైపు దేశంలో పన్ను ఎగవేతదారులు పెద్ద ఎత్తున ఉన్నారని, వారికి అడ్డుకట్ట వేయడానికి పాత పెద్ద నోట్ల రద్దు దోహదపడిందన్నారు. పాత పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీల నిర్మూలన కూడా జరుగుతోందని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలతో దేశ జిడిపి వృద్ధిరేటు 7-8 శాతానికి చేరుకుంటోందని చెప్పారు.
మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై జైట్లీ ధ్వజమెత్తారు. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)కి సంబంధించి ఇటీవల కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) విడుదల చేసిన గణాంకాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలను వ్యక్తం చేయడంపట్ల మండిపడ్డారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ తరహా తీరును కనబరచడం శోచనీయమన్నారు. ‘దేశంలో తొలిసారి వృద్ధిరేటు గణాంకాలను వివాదాస్పదం చేస్తున్నారు. అదికూడా 50 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ కావడం విస్మయానికి గురిచేస్తోంది.’ అన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జిడిపి వృద్ధిరేటు 2 శాతానికి పడిపోతుందని కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా, కొందరు ఆర్థికవేత్తలు కూడా జిడిపి నెగెటివ్ జోన్‌లోకి వెళ్లిపోయిందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికమైన నిరుడు అక్టోబర్-డిసెంబర్ వ్యవధిలో దేశ జిడిపి 7.1 శాతంగా నమోదైందని సిఎస్‌ఒ గణాంకాలు చెప్పడం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేసింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను తీసుకురాగా, రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, అంతే విలువైన కొత్త నోట్లను పొందాలని ప్రజలకు మోదీ సూచించారు. అయితే 2,000 రూపాయల నోట్లు మాత్రమే రావడంతో వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. ద్రవ్యవ్యవస్థలో 86 శాతానికి సమానమైన పాత పెద్ద నోట్లను ఒక్కసారిగా రద్దు చేయడంతో చలామణిలో 100 రూపాయలు అంతకంటే తక్కువ విలువైన నోట్లే ఉండటం, అవికూడా స్వల్పంగా ఉండటం చిల్లర సమస్యలకు దారితీసింది.
2,000 రూపాయల నోటు మార్పిడి గగనమైపోగా, కొత్త 500 రూపాయల నోట్ల సరఫరా లేకపోవడంతో అన్ని రంగాల్లో కొనుగోళ్లు పడిపోయాయి. ఫలితంగా దేశ జిడిపి వృద్ధిలో కీలకమైన ఉత్పాదక రంగం కుదేలైపోయింది. ఈ పరిస్థితుల్లో సహజంగానే అక్టోబర్-డిసెంబర్ జిడిపి గణాంకాలు తక్కువగా నమోదవుతాయన్న అంచనాలు విస్తృతంగా వచ్చాయి. కానీ అందుకు విరుద్ధంగా సిఎస్‌ఒ గణాంకాలుండటంతో అంతటా వీటిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీన్ని కేంద్రం తప్పుబడుతోంది. గోరంతను కొండంతలా చేసి చూపుతున్నారంటూ ప్రతిపక్షాలు, పలువురు ఆర్థికవేత్తల అభిప్రాయాలను కొట్టిపారేస్తోంది. వాస్తవాలను మరుగున పడేయాల్సిన అవసరం తమకు లేదంటోంది.
కాగా, జిడిపి గణాంకాలను తాము అనుమానించడం లేదని, సిఎస్‌ఒ విశ్వసనీయతను కూడా ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ అన్నారు. అయితే తుది గణాంకాలు జూన్‌లో వెలువడతాయని, పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశ జిడిపిపై ఎంత మేరకు ఉందన్న విషయం అప్పుడు తేలుతుందని ముఖ్య గణాంకవేత్త టిసిఎ అనంత్ అన్నారు. ఇదిలావుంటే ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ)పై జైట్లీ స్పందిస్తూ కేవలం 20-30 భారీ ఖాతాదారులతోనే ఈ సమస్య పెద్దదిగా కనిపిస్తోందని, లక్షలాది సంస్థల ఖాతాలతో ఏ సమస్య లేదన్నారు. అయినప్పటికీ మొండి బకాయిల నివారణకు తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిరుడు ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో కొత్తగా లక్ష కోట్ల రూపాయలకుపైగా మొండి బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పేరుకుపోయాయి. 2016 మార్చి ముగింపు నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల మొత్తం మొండి బకాయిల విలువ 5 లక్షల కోట్ల రూపాయలకుపైగా ఉంది.