బిజినెస్

ఆక్వా రంగంపై ప్రభుత్వం దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం సిరులు కురిపించనుంది. అనంతమైన అభివృద్ధికి అవకాశమున్న ఈ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. చేపలు, రొయ్యల సాగు అభివృద్ధితోపాటు పీతల సాగుకూ ప్రత్యేక స్థానం కల్పించనున్నారు. అలాగే నాణ్యమైన రొయ్యల ఉత్పత్తికి అవసరమైన తల్లి రొయ్యల ఉత్పత్తిపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా తీరం వెంబడి ఆక్వా ఉత్పత్తులు, దానికి అనుగుణంగా ఎగుమతులు ఇబ్బడిముబ్బడిగా పెరగనున్నాయి. ఫలితంగా 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం గల నవ్యాంధ్ర రాష్ట్రంలో ఎగుమతులకు ఎక్కువ అవకాశమున్న సముద్ర ఉత్పత్తుల పెంపునకు సమ్రగ ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోంది.
ముఖ్యంగా తీరాన్ని ఆనుకుని ఉన్న జిల్లాలన్నీ రొయ్య, చేప, పీతల పెంపకం దిశగా నడుస్తున్నాయ. నిజానికి ఇక్కడ 1995 నుంచి చేపలు, రొయ్యలు, పీతల కోసం ప్రత్యేకంగా చెరువులను తవ్వుకుని సాగు చేస్తున్నారు. స్థానిక వినియోగం నుండి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతులు మొదలయ్యాయి. విదేశీ మార్కెట్‌లో ఆంధ్రా రొయ్య, చేప, పీతలకు డిమాండ్ పెరగడంతో వీటిపైన రైతాంగం దృష్టి సారించింది. వరిని వీడి ఆక్వా రంగంపై మొగ్గు చూపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దేశం నుంచి ఏటా జరిగే 32 వేల కోట్ల రూపాయల విలువైన ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తుల్లో 70 శాతం ఈ ప్రాంతానికి చెందినవే. దీంతో ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని తల్లి, పిల్ల రొయ్యలు, పీతల ఉత్పత్తి అభివృద్ధికి 105 కోట్ల రూపాయలతో వసతులను కల్పించనున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా బాదంపూడిలోని ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు. ఇక పీతల హేచరీని గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంకలో ఏర్పాటుచేయనున్నారు. సుమారు 14 కోట్ల రూపాయల వ్యయంతో ఈ హేచరీ ఏర్పాటుకానుంది. ఇదే ప్రాంతంలో 23 కోట్ల రూపాయల వ్యయంతో పండుగప్ప నర్సరీని కూడా ఏర్పాటు చేయనున్నారు.
అలాగే విశాఖ జిల్లాలోని నక్కపల్లి మండలం బంగారమ్మ పేటలో వ్యాధులు సోకని నాణ్యమైన రొయ్య పిల్లల ఉత్పత్తికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఏడాదికి 1.5 లక్షల రొయ్య పిల్లలను ఉత్పత్తి చేయనున్నారు. దీనికి 20.38 కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. ఇక్కడే తల్లి రొయ్యలను కూడ ఉత్పత్తి చేస్తారు.
బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి
ఆక్వా రంగ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందుతున్న తీరులోనే బడ్జెట్‌లో కేటాయింపులూ పెరగాల్సి ఉంది. అయతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం 282 కోట్ల రూపాయల కేటాయింపులతో ప్రభుత్వం చేతులు దులుపుకుంది. నిజానికి నిరుడు 330 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయనప్పటికీ బడ్జెట్‌లో ఏటికాయేడు అంచనాలు పెరగాలిగాని మత్య్సశాఖ విషయంలో మాత్రం తగ్గుతున్నాయి. దీంతో మరిన్ని కేటాయింపులు చేస్తే మత్య్స సంపద మరింత అభివృద్ధి చెందడానికి అవకాశముంటుందని ఆక్వా రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

చిత్రాలు..నవ్యాంధ్రలో సాగైన వనామీ రొయ్యలు, చేపలు