బిజినెస్

కర్నూలు సిగలో కలికితురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 27: ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్కు పనులు కర్నూలు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు పనులు జరుగుతున్న తీరుపై రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లోని శకునాల, గని గ్రామాల పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్న సోలార్ పార్కు ప్రపంచంలోనే అతి పెద్దదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి పనులు ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడానికి అంగీకరించారని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ఈ పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. రెండు మండలాల్లోని 5,400 ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ పార్క్ ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో 750 మెగావాట్ల సౌర విద్యుత్‌ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ, 250 మెగావాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేయనుంది. సోలార్ పార్కు నిర్మాణం పనులను జాన్ హడ్సన్ కంపెనీ సుమారు రూ.33 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టింది. సోలార్ పార్కు నిర్మాణం పనులకు స్థానికంగా ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించడంలో కొంత జాప్యం జరిగినా ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు సంతృప్తికరంగా ఉందని సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. పనుల పరిశీలనకు ఎన్‌టిపిసి, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. సోలార్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తయి సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైతే దక్షిణాది రాష్ట్రాలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా పలు రాష్ట్రాలకు అవసరమైన విద్యుత్‌ను ఇక్కడి నుంచి సరఫరా చేయడానికి వీలవుతుంది. ఇక్కడి సోలార్ పార్కు ప్రపంచంలోనే అతి పెద్దది కావడంతో ఈ ప్రాంతానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు భారీ ఎత్తున తరలివస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోని ఓర్వకల్లు రాక్‌గార్డెన్, కేతవరం గ్రామ శివార్లలోని ప్రాచీన మానవులు సంచరించిన ప్రాంతాలను కలుపుతూ పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఆ శాఖ అధికారులు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారికి 10, 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గని, శకునాల గ్రామాల్లో సోలార్ పార్కు, అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని కేతవరం గ్రామ శివార్లలోని ప్రాచీన మానవులు సంచరించిన గుహలు, వారు చిత్రీకరించిన పురాతన చిత్రాల సందర్శనకు అవసరమైన రహదారుల నిర్మాణానికి పర్యాటకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశముందని స్పష్టమవుతోంది. జాతీయ రహదారి నుంచి సోలార్ పార్కు వరకు మూడు వరుసల రహదారి, అక్కడి నుంచి కేతవరం, ఓర్వకల్లు మార్గంలో రెండు వరుసల రహదారిని నిర్మించే అవకాశముందని అధికారుల ద్వారా తెలుస్తోంది. సోలార్ పార్కును ప్రధాని ప్రారంభించిన అనంతరం ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చే అధికారులు, పర్యాటకులతో ఈ ప్రాంతం ప్రపంచ గుర్తింపు పొందడం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు.

చిత్రం..కర్నూలు జిల్లాలో సిద్ధమవుతున్న అతిపెద్ద సోలార్ పార్కు