బిజినెస్

దేశ ప్రగతికే ఆర్థిక సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 15: దేశంలోని పేదరికాన్ని రూపుమాపి, ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ అన్నారు. మోదీ తన మూడేళ్ల పాలనలో ఒక్కరోజు సెలవు తీసుకోకుండా నిర్విరామంగా శ్రమిస్తూ దేశాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్‌టి దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణ అని...దేశ అర్థికాభివృద్ధికి పెద్దఎత్తున దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివమ్స్ గార్డెన్‌లో గురువారం జరిగిన సబ్‌కా సాథ్..సబ్‌కా వికాస్ సమ్మేళన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ మూడేళ్ల్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు అమలుతీరును కేంద్ర మంత్రులు, పదాధికారులు 600 జిల్లాల్లో పర్యటిస్తు సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందుతున్నాయో లేదో క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు సబ్‌కా సాథ్..సబ్‌కా వికాస్ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ముద్ర పథకం దేశవ్యాప్తంగా కోట్లాది వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 7.44 కోట్ల మందికి ముద్ర పథకం క్రింద 3.84 లక్షల కోట్లు రుణాలను మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో చిరు వ్యాపారులకు బ్యాంకుల్లో రుణాలు లభించేవి కావని, అధికారులు గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చేవారు కాదన్నారు. కాగా, 2022 నాటికి దేశంలోని అర్హులైన వారందరికి పక్కా ఇళ్లు నిర్మించేందుకు ముందుకుకెళ్తున్నామని, సిద్దిపేట జిల్లా కేంద్రంలో 1,200 ఇళ్ల్లు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మిస్తున్నారన్నారు. ఉజ్వల యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మోదీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా కోటి మంది గ్యాస్ సబ్సిడి వద్దని స్వచ్ఛందంగా వదులుకున్నారన్నారు. దేశంలో 5 కోట్ల మంది గ్యాస్ పొయ్యి లేని వారిని గుర్తించామని, 2 కోట్ల మందికి గ్యాస్ పొయ్యి, సిలిండర్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వాసులకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ కోసం 320 కోట్ల రూపాయలను విడుదల చేసి కొత్త రైల్వే లైన్ మంజూరు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణానికి అమృత్ పథకం క్రింద 120 కోట్ల రూపాయలు విడుదల చేశామని, పట్టణాల వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లాకు హార్టికల్చర్ యూనివర్సిటీ మంజూరు చేసిందని, రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. బీడీ కార్మికులపై జిఎస్‌టి పన్నుపై ఎత్తివేసే విషయంపై కేంద్రం యోచిస్తుందన్నారు. దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే మోదీ సర్కార్ కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. అనంతరం బీడీ కార్మికులు జిఎస్‌టిలో తమను మినహాయించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, పవర్‌గ్రిడ్ జిఎం రమణ, కేంద్ర కార్మిక సలహా మండలి సభ్యుడు కలాల్ శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దూది శ్రీకాంత్‌రెడ్డి, బాసంగారి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సిద్దిపేటలో సబ్‌కాసాథ్, సబ్‌కా వికాస్ సమ్మేళన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర సహాయ మంత్రి మేఘ్వాల్