బిజినెస్

పొగాకు రైతుకు జిఎస్‌టి పోటు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 19: పొగాకు రైతుకు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) గుదిబండగా మారింది. పొగాకు ముడి సరుకుపై జిఎస్‌టి విధించడంపై పొగాకు రైతులు మండిపడుతున్నారు.. అసలే గిట్టుబాటు ధర లేక వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న తమపై జిఎస్‌టి విధించడం ఎంతవరకు న్యాయమనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. కేంద్ర పొగాకు బోర్డు ఆధ్వర్యంలోని రాజమహేంద్రవరం సమీపంలోగల తొర్రేడు పొగాకు వేలం కేంద్రంలో రెండు రోజులపాటు రైతులు జిఎస్‌టికి నిరసనగా అమ్మకాలను నిలిపివేశారు. కొనుగోళ్లనూ ఒక రోజు ఆపేశారు. దీంతో కోట్లాది రూపాయల లావాదేవీలు స్తంభించాయి. పొగాకు ముడి సరుకుపై ఐదు శాతం జిఎస్‌టి విధించినది తెలిసిందే. రైతుల అమ్మకం తర్వాత వ్యాపారులపై ప్రభుత్వం ఈ ఐదు శాతం జిఎస్‌టి వేస్తోంది. దీనివల్ల ఆ వ్యాపారి ఐదు శాతం పన్నును రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసే సమయంలో ధర తగ్గించి రాబట్టుకుంటున్నాడు.
ఇప్పటికే గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే జిఎస్‌టి గుదిబండ కావడంతో ఇక వచ్చే ఏడాది నుంచి పొగాకు పండించే రైతులు తమ విస్తీర్ణాన్ని క్రమేణా తగ్గించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సిగరెట్లపై 28 శాతం జిఎస్‌టి విధించారు. దీంతో ఈ భారం కూడా వినియో గదారులపైనే పడుతుంది. ఫలితంగా పొగాకు వ్యాపారులు రైతులకిచ్చే మద్దతు ధర తగ్గించేస్తున్నారు. తొర్రేడు పొగాకు వేలం కేంద్రం పరిధిలో 3,705 ఎకరాల్లో ఈ ఏడాది పొగాకు సాగయ్యింది. 1,150 మంది పొగాకు రైతులు వేలం కేంద్రంలో పొగాకు పండించే రైతులుగా నమోదై ఉన్నారు. ఈ ఏడాది 40 లక్షల కిలోల దిగుబడి లక్ష్యమవగా, ఎకరానికి 867 కిలోల దిగుబడి మేరకు 32 లక్షల 12 వేల 235 కిలోల దిగుబడి సాధించారు. ఇప్పటికే ఏటికేడాది పొగాకు రైతులు ధర లేక విస్తీర్ణాన్ని తగ్గించేస్తున్నారు. పొగాకు పండించేందుకు నమోదు చేసుకుంటున్నప్పటికీ పొగాకు సాగు విరమించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో జిఎస్‌టి తోడవడంతో వచ్చే ఏడాది నుంచి సాగు విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఏడాది సరాసరిగా కేజీకి 169 రూపాయలు అత్యధిక ధర లభించింది. 14 కంపెనీలు వచ్చి పొగాకు కొనుగోలు చేస్తున్నాయ. జూలై మొదటి తేదీ నుంచి అమల్లోకి వచ్చే జిఎస్‌టి వల్ల ఐదు శాతం పన్ను భారం రైతులపై పడనుండటంతో ఇక సాగు సాధ్యం కాదని రైతుల్లో కలకలం చెలరేగింది. పొగాకు ముడిసరుకు కొనుగోళ్లపై ముందుగానే వ్యాపారులు వేలంలో కొనుగోలు చేసిన సరుకుకు తక్షణమే జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది. జిఎస్‌టి చెల్లించిన తర్వాత ఆ చెల్లించిన ఐదు శాతం జిఎస్‌టి రైతుల నుంచి తగ్గించుకునేందుకు ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఎక్కడైనా చిన్న పొరపాటు వచ్చినా అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది. సక్రమంగా అన్ని లెక్కలూ చూపిస్తూ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించిన పొగాకు వ్యాపారులకు రేటింగ్ ఉంటుంది. ఈ రేటింగ్ ప్రకారమే రుణాల పెట్టుబడులు లభించే అవకాశం ఉంది. ముడి సరుకు కొనుగోలు చేసేందుకు మూల పెట్టుబడి పొగాకు వ్యాపారులకు లభించాలంటే జిఎస్‌టి రేటింగ్ ఉంటేనే సాధ్యపడుతుంది. ఇదంతా తలపోటు ఎందుకని వ్యాపారి భావిస్తే పొగాకు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి వ్యాపారులు కూడా కొనుగోళ్లు చేసేందుకు గతంలో మాదిరిగా ముందుకు రాలేని పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు కొనుగోలుదారులు మందగిస్తారు. అటు సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో జిఎస్‌టి బహుముఖంగా ప్రభావితమవుతోంది. జిఎస్‌టి విధానంలో ప్రతీ క్రయ, విక్రయాలను వెనువెంటనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి కంప్యూటర్, ఇంటర్నెట్, ఇన్వర్టర్, స్కానర్, ప్రింటర్ తదితరాలన్నీ పొగాకు వ్యాపారులకు వేలం కేంద్రంలోనే సమకూర్చుకోవాలి. పెద్దపెద్ద పొగాకు కంపెనీలే తప్ప చిన్నచిన్న బయ్యర్లంతా ఈ విధానానికి తట్టుకోలేక కొనుగోళ్లు నిలిపివేసే ప్రమాదం కనిపిస్తోంది. అప్పుడు కొన్ని పెద్దపెద్ద కంపెనీలకే పరిమితమైన నేపథ్యంలో ఆయా కంపెనీల గుత్త్ధాపత్యంలోనే పొగాకు కొనుగోళ్లు జరుగుతాయి. దాంతో చెప్పిన రేటుకు అమ్మాల్సిన పరిస్థితే. ఈ విధంగా జిఎస్‌టి ప్రభావం పొగాకు రైతుకు గుదిబండగా మారనుందని తెలుస్తోంది.

చిత్రం.. పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోలుదారులు