బిజినెస్

రొయ్యల సాగు.. మరో లక్ష ఎకరాల్లో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 25: గోదావరి జిల్లాల్లో మళ్లీ రొయ్యల సాగు ఊపందుకుంటోంది. ఎగుమతులకు ఎక్కువ అవకాశాలున్న ఆక్వాకల్చర్‌ను మరింత అభివృద్ధిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండటంతో ఇటీవలి కాలంలో చెరువుల తవ్వకానికి అనుమతులు సులువుగానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్టదాయకంగా మారిన వరి సాగును వదిలేసి, ఆక్వావైపు రైతులు అడుగులు వేస్తున్నారు. ఈ సీజనులో గోదావరి జిల్లాల్లో కొత్తగా మరో లక్ష ఎకరాల్లో రొయ్యల సాగు ప్రారంభమవుతోందని అంచనా. ఇది ఇప్పటికే జరుగుతున్న సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు అదనం.
సముద్ర తీరప్రాంతం ఉన్న గోదావరి జిల్లాల్లో మూడు దశాబ్దాల కిందటే రొయ్యల సాగు ప్రారంభమయ్యింది. తొలుత ఉప్పునీటి ఆధారిత సాగు జరిగేది. రాన్రానూ అది మంచినీటికీ పాకింది. వేల టన్నుల రొయ్యలు ఉత్పత్తి జరుగుతుండటంతో దానికి అనుగుణంగా ప్రాసెసింగ్ ప్లాంట్లు పెరిగాయి. ఎగుమతులు ఊపందుకున్నాయి. అయితే ఇదంతా అనధికారిక సాగే కావడంతో ప్రభుత్వ పర్యవేక్షణ లేక, విచ్చలవిడితనం పెరిగి, కొన్ని సంవత్సరాలకే వైరస్ బారిన పడి సాగు అతలాకుతలమయ్యింది. నష్టాలు పెరగడంతో రొయ్యల సాగుకు చాలామంది దూరమయ్యారు. అయితే వనామీ రొయ్య రాకతో మళ్లీ లాభాలసాగు మొదలయ్యింది. దీనితో మళ్లీ సాగువైపు రైతులు ఆకర్షితులయ్యారు.
ఇలా పడుతూ లేస్తూ సాగుతున్న రొయ్యల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి, రైతులకు అండగా నిలిస్తే, ఉత్పత్తులు మరింతగా పెరుగుతాయని గుర్తించింది. దీనితో రొయ్యల సాగును వ్యవస్థీకృతం చేయాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కొత్తగా చెరువుల తవ్వకాలకు జోరుగా అనుమతులు మంజూరు ప్రారంభించింది. అలాగే ఇప్పటికే సాగుచేస్తున్న చెరువుల రిజిస్ట్రేషన్ కూడా జరుపుతోంది. చెరువులకు అవసరమైన నీటి సరఫరా, రాయితీపై ఏరియేటర్ల సరఫరా వంటి చర్యలు ప్రభుత్వం చేపడుతోంది.
అధికారికంగానే సాగుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుండటంతో మెల్లమెల్లగా సాంప్రదాయంగా వరి సాగుచేసే రైతుల్లో సైతం రొయ్యల సాగుపై ఆసక్తి పెరుగుతోంది. గోదావరి జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు లక్ష ఎకరాల్లో రొయ్యల సాగుకు సన్నాహాలు జరుగుతున్నాయని అంచనా. వేసవి ముగిసి తొలకరి జల్లులు కురిసిన నాటి నుంచి చెరువుల తవ్వకాలు జోరందుకున్నాయి. కాలువల ద్వారా ముందుగానే గోదావరి జలాలు విడుదల చెయ్యడంతో నీరు సమృద్ధిగా అందుబాటులో ఉంటుందని భావించిన రైతాంగం ఆదాయం లేక బీడులుగా మారిపోతున్న వ్యవసాయ భూములను రొయ్యల చెరువులుగా మార్చేసుకుంటున్నారు. భూమి వివరాలతో మీ సేవ ద్వార దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం వెంటనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షణ చేసి వెంటనే అనుమతులు కూడా జారీచేస్తోంది. నిబంధనలను అనుసరించి చెరువులు తవ్వడంతో సాగుకు ఆర్థిక సహకారం కూడా సులువుగా లభిస్తోంది.
కాగా సాగు పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా అవసరమైన రొయ్య పిల్లలను సరఫరాచేసే ప్రైవేటు హేచరీల సంఖ్య కూడా పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన సీడ్‌ను ఎక్కువగా చెరువులు తవ్వుతున్న ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హ్యాచరీల్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు. కాగా కొత్తగా తవ్వకాలు చేస్తున్న చెరువుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో మాదిరిగాకాకుండ ముందు నుంచి రొయ్యల సాగు చేసే వారికి సలహాలు, సూచనలు అందిస్తోంది. ముఖ్యంగా సాగులో నిషేధిత యాంటీబయోటిక్స్ వాడకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడకంవల్ల వాటి అవశేషాలు రొయ్యల్లో పెరిగిపోయి ఎగుమతులకు ఆటకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రైతులను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తం మీద ఈ సీజను నుండి గోదావరి జిల్లాల నుండి మరింత ఇబ్బడిముబ్బడిగా రొయ్యల దిగుబడి లభించనుంది.