బిజినెస్

ఇక వ్యాపారులపై వేధింపులుండవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 7: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వలన వ్యాపారులకు అధికారుల వేధింపులు ఇక ఉండబోవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అలాగే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన అన్నారు. టాక్స్ అసెస్‌మెంట్‌లో లోపాలను అధికారులు ఒకవేళ కనుగొంటే వాటిని ఆన్‌లైన్ ద్వారానే వ్యాపారులకు తెలియచేస్తారని స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన జిఎస్‌టిపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏవైనా సంస్కరణలు చేపడితే, అవి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల ప్రయోజనం కోసం కాదని వ్యాఖ్యానించారు.
దేశ ప్రగతి కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం, సగటు మనిషి ప్రయోజనాల కోసమే చేపడుతుంటారని యనమల చెప్పారు. జిఎస్‌టి వలన ఇబ్బందులు స్వల్పకాలమేనని, దీర్ఘకాల ప్రయోజనాలు అధికంగా ఉంటాయని ఆయన తెలియచేశారు. వివిధ దేశాల్లో ఉన్న మంచి విధానాలను అన్వయించుకోవడంలో తప్పులేదన్న ఆయన జిఎస్‌టి ఎంపవర్‌మెంట్ కమిటీ, జిఎస్‌టి కౌన్సిల్ ఏకాభిప్రాయంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు.
జిఎస్‌టి అమలును మరికొంత కాలం వాయిదా వేయాలని కొంతమంది కోరినప్పటికీ, ఎప్పటికైనా అమలు చేయాల్సిన జిఎస్‌టిని వెంటనే ఆచరణలోకి తీసుకురావాలన్న మోదీ ఆలోచనతో అన్ని రాష్ట్రాల శాసనసభలు ఏకీభవించాయని యనమల చెప్పారు. 1,211 వస్తువులు జిఎస్‌టి పరిధిలోకి వచ్చాయని, ఇందులో 165 వస్తువుల ధరలు తగ్గాయని, 64 వస్తువుల ధరలు పెరిగాయని, 180 వస్తువుల ధరలు అటు, ఇటుగా ఉన్నాయని యనమల వివరించారు. కాగా, దేశవ్యాప్తంగా చాలా వస్తువులపై పన్నులు ఒకేలా ఉన్నాయని, పెట్రోల్, లిక్కర్ ధరల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిఎస్‌టి వలన ధనికులపైనే భారం పడుతుందని, వారి నుంచి వసూలు చేసిన పన్నును పేదల ప్రయోజనాలకు ఉపయోగిస్తామని మంత్రి యనమల పేర్కొన్నారు. జిఎస్‌టి వలన దేశం 1.5 నుంచి రెండు శాతం ఆర్థిక పురోగతి సాధిస్తుందని ఆయన తెలియచేశారు. అయతే ఎక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలు కొంత మేర తమ ఆదాయాన్ని నష్టపోవలసి వస్తుందని, ఇందులో గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ముందున్నాయని చెప్పారు. తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలు మాత్రం లబ్ది పొందుతాయని ఆయన తెలియచేశారు. ఈ క్రమంలో జిఎస్‌టి వలన నవ్యాంధ్రకు 2,900 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని ప్రాథమిక లెక్కల్లో వెల్లడైందని ఆయన తెలిపారు. జిఎస్‌టి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని 21 చెక్‌పోస్ట్‌లను తొలగించామని, ఇది మన రాష్ట్రంలోనే తొలిసారిగా అమలైందని యనమల పేర్కొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్కరణలు చేపట్టినప్పుడు సానుకూల, ప్రతికూల అభిప్రాయాలు ఉంటాయన్నారు. జిఎస్‌టిపై ఎవరేమన్నా నిబద్ధత కలిగిన మోదీ.. దీనిని అమలు చేశారని కొనియాడారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జిఎస్‌టిపై చార్టెడ్ అకౌంటెంట్స్‌కి అవగాహన కల్పించాలని కోరారు.
సమగ్ర ఆర్థిక వ్యవస్థకు మోదీ శ్రీకారం: సుజనా చౌదరి
దేశంలో సమగ్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 1991-96 మధ్య అప్పటి ప్రధాని పివి నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెడితే, నేటి ప్రధాని మోదీ సమగ్ర ఆర్థిక విధానాన్ని తీసుకువచ్చారన్నారు. సుమారు 15 సంవత్సరాల నుంచి జిఎస్‌టి అమలు చేయడానికి వివిధ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా.. సాధ్యం కాలేదని, ఏకగ్రీవ ఆమోదంతో జిఎస్‌టిని అమలు చేసిన ఘనత మోదీకే దక్కిందని అభినందించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు జిఎస్‌టి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అనేక దేశాలు జిఎస్‌టిని అమలు చేస్తున్నాయని, అందులోని లోటుపాట్లను సవరించి మన దేశంలో జిఎస్‌టిని అమల్లోకి తీసుకువచ్చామని సుజన చెప్పారు.
అయతే జిఎస్‌టి వలన గ్రానైట్ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ విషయాన్ని జిఎస్‌టి కౌన్సిల్ దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సదస్సులో ఎంపిలు హరిబాబు, అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్‌లు పాల్గొన్నారు.

చిత్రం.. జిఎస్‌టిపై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి యనమల రామకృష్ణుడు