బిజినెస్

విశాఖ-కొలంబో విమాన సర్వీసు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 8: భారత్-శ్రీలంక దేశాల మధ్య పర్యాటక సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతి రాజు అన్నారు. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఆధ్వర్యంలో కొలంబో నుంచి విశాఖ విమాన సర్వీసును విశాఖ విమానాశ్రయంలో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకాభివృద్ధిలో విమానయాన సంస్థలు కీలక భూమిక పోషిస్తాయన్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి సాధించాలంటే అందుకు విస్తృత రవాణా సదుపాయాలే కొలమానమన్నారు. ముఖ్యంగా పర్యాటక రంగం అభివృద్ధిలో విమానయాన రంగం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో పర్యాటకాభివృద్ధి నూతన ఒరవడి సంతరించుకుందని, శ్రీలంక నుంచి విశాఖకు విమాన సర్వీసుతో ఉత్తరాంధ్ర పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంద న్నారు. పర్యాటక రంగం అభివృద్ధి సాధిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడం ద్వారా సందర్శకులను ఆకర్షించేందుకు వీలవుతుందన్నారు. శ్రీలంక, విశాఖల్లోని బౌద్ధారామాలను సందర్శించే పర్యాటకులకు ఈ సర్వీసు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. శ్రీలంక అమరావతిల మధ్య పర్యాటక ప్యాకేజీకి అవగాహన కుదిరిందని, త్వరలోనే ఇది ప్రారంభం కానుందన్నారు. విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ విదేశీ విమాన సౌకర్యం ఎంతగా అందుబాటులోకి వస్తే, ఆయా ప్రాంతాలు అంత అభివృద్ధి సాధిస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.
కొలంబో నుంచి వచ్చిన విమానానికి మంత్రి అశోక్ గజపతిరాజు స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో కొలంబో వెళ్లే విమానంలో రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుకు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు బోర్డింగ్ పాస్ అందజేశారు. మంత్రితోపాటు ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి విష్ణుకుమార్ రాజు కొలంబో విమానంలో ప్రయాణించారు.
పర్యాటక ప్రయాణికులే లక్ష్యం
పర్యాటక ప్రయాణికులే లక్ష్యంగా శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ భారత్‌లో విమాన సర్వీసులను విస్తృతం చేస్తోందని సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శివరామచంద్రన్ అన్నారు. విశాఖ- కొలంబో మధ్య నూతన విమాన సర్వీసును శనివారం ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శివరామచంద్రన్ మాట్లాడారు.
ప్రస్తుతం భారత్ నుంచి 24 ప్రధాన నగరాలకు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నడుపుతోందన్నారు. చెన్నై, తిరుచ్చి, త్రివేండ్రం, ముంబై, ఢిల్లీ, గయ, వారణాసి, కొచ్చి, బెంగళూరు, కోల్‌కతా నగరాలతోపాటు తాజాగా విశాఖ నుంచి సంస్థ విమానాలు నడుపుతోందన్నారు. ఈ నెల 12 నుంచి హైదరాబాద్, 16 నుంచి కోయంబత్తూర్ పట్టణాలకు విమాన సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం విశాఖ నుంచి కొలంబోకు వారానికి నాలుగుసార్లు విమాన సర్వీసులు నడుపుతున్నామన్నారు. భవిష్యత్‌లో ఈ సర్వీసును రెగ్యులర్ చేస్తామన్నారు.
శ్రీలంక, భారత్ దేశాల మధ్య పర్యాటక సంబంధాలు బాగున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో కూడా ఇదే సత్సంబంధాలు కొనసాగుతాయని, దక్షిణాసియాకు విశాఖ నుంచి విమాన కనెక్టివిటీ కోసం కొలంబో సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా బ్యాంకాక్, మలేషియా, థాయ్‌లాండ్, మాల్దీవ్స్, ఫిలిప్పీన్స్ ప్రాంతాలకు కొలంబో నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.
హైదరాబాద్, విశాఖల్లో ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులో ఉండాలన్నారు. పర్యాటకులు, సాధారణ ప్రయాణీకులతోపాటు సరుకు రవాణాకూ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం 1.5 టన్నుల కార్గో రవాణా జరుగుతుందన్న శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ సిసిఒ శివరామచంద్రన్.. విశాఖ విమానాశ్రయంలో సదుపాయాలపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

చిత్రం.. కొలంబో విమానంలో తొలి బోర్డింగ్ పాస్‌ను అయ్యన్న పాత్రుడికి అందిస్తున్న అశోక్ గజపతి రాజు