బిజినెస్

భాగ్యనగర్’ గ్యాస్ బంపర్ ఆఫర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 8: పైపులైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ (సిఎన్‌జి)ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం గతంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ప్రజలను ఆకర్షించేందుకు భారీ నజరానాలు ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ ప్రధాన కేంద్రంగా కొనే్నళ్లుగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ఇంటింటికీ పైపులైన్ల ద్వారా వంట గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. అయితే ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల సాధనకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్‌జి) పట్ల ప్రజలకు పూర్తి భరోసా కల్పించి, అధిక కనెక్షన్లు సాధించేందుకుగాను సరికొత్త పంథాలో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం ప్రారంభించింది. వినియోగదారులు కనెక్షన్ కోసం ముందుకువచ్చిన పక్షంలో సెక్యూరిటీ డిపాజిట్ అవసరం లేదని, 3 నెలల పాటు ఉచితంగా వంట గ్యాస్‌ను పొందవచ్చని తాజాగా ఆ సంస్థ స్పష్టం చేసింది. అలాగే కనెక్షన్ అడిగిన వెంటనే మంజూరు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు కాకినాడలో శనివారం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో సంస్థ ఎండి ఎకె దాస్ మాట్లాడుతూ పైపులైన్ గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకుంటే తొలి 10 వేల మంది వినియోగదారులకు సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. దీనిపై ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు తొలి నాలుగు నెలలు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎకె దాస్ స్పందించి తొలి మూడు మాసాలు గ్యాస్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించారు. గతంలో గ్యాస్ కనెక్షన్ కావాలంటే వినియోదారుడు ఐదు వేల రూపాయల రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉండేదని, వినియోగదారుల సౌకర్యార్థం ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ను సడలించినట్టు ప్రకటించారు. కాగా, గెయిల్, హెచ్‌పిసిఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఎల్‌పిజి కంటే తక్కువ ధరకు సిఎన్‌జిని వినియోగదారులకు అందజేయాలన్న ఆలోచనతో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బిజిఎల్)ను ఏర్పాటుచేశారు. ఎల్‌పిజి కంటే సురక్షితమైన, పర్యావరణహితమైన ఈ గ్యాస్‌ను కాకినాడ కేంద్రంగా వివిధ మున్సిపాలిటీలకు సరఫరా చేసేందుకు ఇక్కడ ప్లాంటు నిర్మించారు. 2009 సంవత్సరంలో ఈ ప్లాంట్ ద్వారా ఇంటింటికీ పైపులైన్‌తో వంట గ్యాస్ సరఫరా ప్రారంభమైం ది. ఇప్పటివరకు 3,725 మంది వినియోగదారులు కనెక్షన్లు పొందారు. కాకినాడ నగరంలోని 47 కాలనీల పరిధిలో సుమారు 180 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి, గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే సంస్థ కార్యకలాపాలు ప్రారంభమై సుమారు 8 సంవత్సరాలైనా ఆశించిన సంఖ్యలో కనెక్షన్లు ఇవ్వలేకపోవడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సేవలను విస్తరించాలన్న లక్ష్యంతో నజరానాలను సంస్థ ప్రకటించింది. 2017 సంవత్సరాంతానికి 20 వేల కనెక్షన్ల పంపిణీ లక్ష్యంగా నిర్ణయించారు.

చిత్రం.. అవగాహన సదస్సులో మాట్లాడుతున్న సంస్థ ఎండి దాస్