బిజినెస్

అటవీ ఉత్పత్తులతో మద్యం తయారీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 9: అటవీ ఉత్పత్తుల నుంచి మద్యం తయారీ కానుంది. దీనికి గిరిజన సహకార సంస్థ (జిసిసి) ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తొలిసారిగా జరిగే ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే దీనిని సదరు మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కూడా సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. అటవీ ఉత్పత్తులైన పనస, తేనె, కాఫీ వంటి వాటి నుంచి మద్యం తయారు చేసి దీనిని మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తోంది. ఇందులోభాగంగా గత సంవత్సర కాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇందుకు అవసరమైన ముడిసరుకు, ఇందులో మిశ్రమాలు, ఏ విధంగా దీనిని అందుబాటులోకి తీసుకురావాలి? ఎక్కడ దీనిని తయారు చేయాలి? అనే అంశాలను జిసిసి పరిశీలిస్తోంది కూడా. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలనూ పంపింది. జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రకాష్ ఆదేశాలపై సంబంధితాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతి ఏడాది మే నుంచి కొన్నాళ్ళపాటు లభించే పనస తొనల నుంచి మద్యం తయారు చేయనున్నారు. వివిధ మిశ్రమాలతో తయారయ్యే దీనిని సేవించడం వలన ఆరోగ్యపరమైన అంశాలను సంస్థ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆరోగ్యపరమైన ప్రయోజనాలతోపాటు, సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే విధంగా పనస తొనల నుంచి మద్యాన్ని తయారు చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తొన నుంచి ద్రవాన్ని సేకరించి దానికి వివిధ మిశ్రమాలను కలపడం ద్వారా తయారయ్యే మద్యాన్ని ‘జిసిసి బ్రాండ్’తో విక్రయించాలని చూస్తున్నా రు. దీన్ని త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేసేలా అధికారులు చర్యలను సైతం చేపడుతున్నారు. అలాగే అటవీ ప్రాంతాల నుంచి లభించే తేనె, కాఫీ ఉత్పత్తుల నుంచి మద్యాన్ని తయారు చేసే అంశాన్ని కూడా సంస్థ తీవ్రంగా పరిశీలిస్తోంది. దీనికంటే ముందుగా ఏపీలో విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, తెలంగాణ లోని ఖమ్మం తదితర జిల్లాల్లో అటవీ ప్రాంతాల నుంచి పనస, తేనె వంటివి సేకరించాలని సంస్థ నిర్ణయించింది. పనస నుంచి సేకరించిన దవ్రాన్ని చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఉండే పరిశ్రమలకు తీసుకువెళ్ళి అక్కడ శుభ్రపరిచి, దాన్ని మద్యంగా మార్చనుండగా, దానికి జిసిసి బ్రాండ్‌ను తగిలించడం, తదుపరి ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో జిసిసి బ్రాండ్‌తో కూడిన సదరు మద్యాన్ని విక్రయించాలని సంస్థ యాజమాన్యం ఆలోచన చేస్తోంది. దీంతో ఈ సీజన్‌లోనే పనస, కాఫీ నుంచి మద్యం తయారు చేసే విధానంపై సంస్థ దృష్టిపెట్టింది. ఆరోగ్యపరంగా ప్రయోజనం కలిగించే విధంగా ఇది తయారు కానుంది. దీనివల్ల సంస్థకు ఆదాయాన్ని పెంచుకోవడం, మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడటం వంటివి జరుగుతాయని సంస్థ వర్గాలు భావిస్తున్నాయి. అయతే ముందుగా పనస తొన నుంచి మద్యాన్ని తయారు చేసే అంశంపై తాము దృష్టి సారించామని సంస్థ ఎండి ఏవిఎస్ రవిప్రకాష్ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.
ఇప్పటికే ప్రవేశపెట్టిన, అమలు చేస్తోన్న పెట్రోల్ బంక్‌లు, వీటికి అనుసంధానం చేస్తూ నిర్వహించే జిసిసి సూపర్ మార్కెట్‌లు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రాలకు జిసిసి కుంకుమను ఎగుమతి చేస్తున్నామని, ఇందులో శ్రీశైలం, శ్రీకాశహస్తి, సింహాచలం, అన్నవరం వంటివి ఉన్నాయని, మరికొన్నింటికి ఇదే తరహాలో అందజేసే కార్యక్రమం జరుగనుందన్నారు. కాగా, వేసవి సీజన్‌లో అమ్ముడుపోతోన్న నన్నారి, బిల్వ షర్బత్‌లకు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉందన్నారు. త్వరలో త్రిఫల షర్బత్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే త్రిఫల షర్బత్ 750 ఎంఎల్ సీసాను కేవలం 160 రూపాయలకే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవిగాకుండా వార్షిక ఆదాయాన్ని దాదాపుగా 400 కోట్ల రూపాయలకు పెంచుకునేందుకు వీలుగా అరుదైన అటవీ ఉత్పత్తులతో తయారు చేసే సబ్బులు, మరిన్ని ఉత్పత్తులను రానున్న రోజుల్లో మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ ఎండి రవిప్రకాశ్ తెలిపారు.