బిజినెస్

ఇన్ఫోసిస్ లాభం రూ. 3,483 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 14: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించిన లాభాలు దేశీయ స్టాక్ మార్కెట్లలోని మదుపరులను ఏమాత్రం కూడా ఆకట్టుకోలేకపోయాయి.
గతంతో పోల్చితే 1.3 శాతం మాత్రమే ఇన్ఫోసిస్ లాభం పెరిగింది. ఈసారి 3,483 కోట్ల రూపాయలుగా నమోదైతే, గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 3,436 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం ఈసారి 1.7 శాతం పెరిగి 17,078 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు 16,782 కోట్ల రూపాయలుగా ఉందని ఇన్ఫోసిస్ శుక్రవారం ఇక్కడ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సంస్థ షేర్ విలువ 0.44 శాతం, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో 0.51 శాతం మేర పడిపోయింది. మరోవైపు డాలర్లలో చూస్తే సంస్థ లాభం 5.8 శాతం వృద్ధితో 541 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆదాయం 6 శాతం పెరిగి 2.65 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇక జూన్ మాసాంతానికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య 1.98 లక్షలుగా ఉందని ఇన్ఫోసిస్ సిఎఫ్‌ఒ రంగనాథ్ చెప్పారు. కాగా, రంగనాథ్‌ను ఇన్ఫోసిస్.. అమెరికాకు పంపిస్తోంది. ఇక అక్కడి సంస్థ కార్యకలాపాలు ఆయన ఆధ్వర్యంలో జరగనున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా.. సంస్థ ఆర్థిక ఫలితాలను ప్రకటించే మీడియా సమావేశానికి ఓ ‘డ్రైవర్‌లెస్’ బండిలో వచ్చారు.
దీన్ని తమ మైసూర్ కేంద్రంలో ఇన్ఫోసిస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇకపోతే హెచ్-1బి వీసా నిబంధనల కఠినతరం నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో 10,000 మందిని అమెరికాలో ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఇన్ఫోసిస్ ఈ సందర్భంగా వెల్లడించింది. ఇదే సమయంలో భారత్‌లోనూ నియామకాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

చిత్రం..శుక్రవారం బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా (కుడి నుంచి మూడో వ్యక్తి), సిఎఫ్‌ఒ రంగనాథ్ (కుడి నుంచి రెండో వ్యక్తి), సిఒఒ ప్రవీణ్ రావు (ఎడమ నుంచి మూడో వ్యక్తి) ఇతర సీనియర్ ఉద్యోగుల బృంద చిత్రం