బిజినెస్

పసిడి ధరలు పరుగో.. పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. శనివారం బులియన్ మార్కెట్‌లో రెండేళ్ల గరిష్ఠాన్ని తాకాయి. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 225 రూపాయలు పెరిగి 30,350 రూపాయల వద్ద నిలిచింది. 2014 మే 10 తర్వాత పుత్తడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. పెళ్ళిళ్ల సీజన్ డిమాండ్‌ను అందుకోవడానికి ఆభరణాల వర్తకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో ధరలు క్రమేణా పుంజుకుంటున్నాయని మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నాయి. ఇక 99.5 స్వచ్ఛత బంగారం ధర 30,200 రూపాయలు పలికింది. మరోవైపు కిలో వెండి ధర కూడా శనివారం ట్రేడింగ్‌లో 510 రూపాయలు ఎగిసి 41,550 రూపాయల వద్ద నిలిచింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక రంగం నుంచి వచ్చిన డిమాండే దీనికి కారణం. కాగా, అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు అమితాసక్తిని కనబరచడం కూడా ధరల పెరుగుదలకు దోహదపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే భారతీయ మార్కెట్‌లో ధరలపై ప్రభావం చూపే న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 0.79 శాతం పెరిగి 1,287.70 డాలర్లకు చేరింది. అలాగే ఔన్స్ వెండి ధర 0.75 శాతం వృద్ధి చెంది 17.44 డాలర్లను తాకింది. ఇదిలావుంటే ఈసారి అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు నిరుడుతో పోల్చితే స్వల్పంగా వృద్ధి చెందవచ్చని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జిజెఎఫ్) చైర్మన్ శ్రీధర్ జివి అంచనా వేశారు. ధరల పెరుగుదలతోపాటు దేశవ్యాప్తంగా నెలకొన్న కరవు పరిస్థితులు దీనికి కారణంగా ఆయన అభివర్ణించారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో 10 గ్రాముల పుత్తడి ధర 26,930 రూపాయలుగా ఉంటే, ప్రస్తుతం 30,350 రూపాయలుగా ఉంది. మూడు నెలల్లో 3,420 రూపాయల మేర ధర పెరిగింది. గత సంవత్సరం అక్షయ తృతీయ రోజున పుత్తడి ధర 27,100 రూపాయలు పలికింది. దీంతో ఈసారి అమ్మకాలు స్వల్పంగా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ నెల 9న (సోమవారం) అక్షయ తృతీయను పాటిస్తున్నారు. ఈ రోజు బంగారం కొనుగోళ్ళు శుభప్రదమని అంతా భావిస్తారన్నది తెలిసిందే.