బిజినెస్

స్పెక్ట్రమ్ వినియోగ చార్జీపై రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: స్పెక్ట్రమ్ వినియోగ చార్జీ (ఎస్‌యుసి)పై టెలికామ్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడా టెలికామ్ సంస్థలు ఒకే తరహా స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ (ఎస్‌యుసి)కి మద్దతు పలుకుతుండగా, ఇలా చేస్తే తమకు నష్టం వాటిల్లుతుందని చిన్న సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అన్ని రకాల స్పెక్ట్రమ్ తరంగాల వినియోగానికి ఒకే రకమైన చార్జీని వసూలు చేయాలని భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర బడా సంస్థల సంఘం సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఒఎఐ) అంటోంది. అయితే దీనివల్ల తక్కువ రకం స్పెక్ట్రమ్‌తో టెలికామ్ సేవలు అందించే చిన్న సంస్థలపై మోయలేనంత చార్జీల భారం పడుతుందని చిన్న సంస్థలకు చెందిన అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (ఎయుఎస్‌పిఐ) వ్యతిరేకిస్తోంది. కాగా, టెలికామ్ శాఖ టెక్నికల్ కమిటీ సూచించిన 4.5 శాతం ఒకే తరహా ఎస్‌యుసి లెవీ.. పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని సిఒఎఐ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని తగ్గించాలని కోరుతోంది. ఒక శాతం తగ్గిస్తే జిడిపి విలువ దాదాపు 1.76 లక్షల కోట్ల రూపాయలు పెరుగుతుందని, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య కూడా 4.7 శాతం తగ్గుతుందని సిఒఎఐ చెప్పింది. టెలికామ్ రంగంలోకి కొత్తగా దాదాపు 58,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, పన్ను ఆదాయం కూడా 28,000 కోట్ల రూపాయల వరకు పెరుగుతుందని డెలాయిట్ సర్వేలో సిఒఎఐ వివరించింది. అయితే అన్ని రకాల స్పెక్ట్రమ్‌కు ఒకే తరహా ఎస్‌యుసిని అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి 1.65 లక్షల కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లుతుందని ఎయుఎస్‌పిఐ చెబుతోంది. అలాకాకుండా ఎగువ శ్రేణి స్పెక్ట్రమ్‌కు ఎక్కువగా, దిగువ శ్రేణి స్పెక్ట్రమ్‌కు తక్కువగా ఎస్‌యుసిని వసూలు చేయాలంటోంది. ఈ మేరకు టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, టెలికామ్ శాఖ కార్యదర్శి జెఎస్ దీపక్‌కు ఎయుఎస్‌పిఐ ప్రధాన కార్యదర్శి అశోక్ సూద్ ఓ లేఖ కూడా రాశారు. 4జి సేవలు అందించే సంస్థల ఆదాయం, అది అందించని సంస్థల ఆదాయం ఒకే రకంగా ఉండదని, కాబట్టి ఎస్‌యుసి చార్జీలు స్పెక్ట్రమ్‌ను బట్టి వేర్వేరుగా ఉండాలని కోరారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ సేవల నుంచి టెలికామ్ సంస్థలు పొందుతున్న ఆదాయంలో దాదాపు 4.9 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం ఎస్‌యుసిగా వసూలు చేస్తోంది. ఈ క్రమంలో టెలికామ్ శాఖ టెక్నికల్ కమిటీ దీన్ని 4.5 శాతంగా తగ్గించి ప్రతిపాదించింది. అయినప్పటికీ ఇది పరిశ్రమపై అదనపు భారాన్ని మోపుతుందని, 3 శాతానికి తగ్గించాలని టెలికామ్ శాఖ కార్యదర్శి జెఎస్ దీపక్‌కు రాసిన ఓ లేఖలో సిఒఎఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ పేర్కొన్నారు. 800 మెగాహెట్జ్ (2జి,4జి), 900 మెగాహెట్జ్ (2జి,3జి,4జి), 1800 మెగాహెట్జ్ (2జి,4జి), 2100 మెగాహెట్జ్ (3జి), 2300 మెగాహెట్జ్ (4జి), 2500 మెగాహెట్జ్ (4జి) శ్రేణి స్పెక్ట్రమ్ తరంగాలను టెలికామ్ సంస్థలు మొబైల్ సేవలకు వినియోగించుకుంటున్నాయి. కాగా, సిఒఎఐలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు కూడా సభ్యత్వమున్నప్పటికీ ఒకే తరహా ఎస్‌యుసిపై తన నిర్ణయాన్ని తెలియపరచకపోవడం గమనార్హం.