బిజినెస్

వెలవెలబోతున్న సగటు ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: దేశీయ సంస్థల్లో సిఇఒకు సగటు ఉద్యోగికి మధ్య వేతనాల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. అగ్రశ్రేణి సంస్థల్లో ఈ వ్యత్యాసం గరిష్ఠంగా 1,200 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. స్టాక్ మార్కెట్లలో చేరిన పెద్ద సంస్థల్లో ఉన్నతోద్యోగుల వేతనాలతో క్రిందిస్థాయి ఉద్యోగుల వేతనాలు ఏమాత్రం సరితూగడం లేదు.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో సిఇఒ, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తదితర సీనియర్, ఉన్నతోద్యోగులకు ఆయా సంస్థలు పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించాయి.
ప్రైవేట్‌రంగ సంస్థల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఔషధ రంగ దిగ్గజం లుపిన్ సంస్థ చైర్మన్ వేతనం.. ఆ సంస్థలోని ఇతర సగటు ఉద్యోగుల వేతనాలతో పోల్చితే 1,263 రెట్లు అధికంగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) ఇది 1,317 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఇక నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి) సంస్థలో ఇది 1,004 రెట్లు ఉంది.
కాగా, దేశీయ ఆటో రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్‌లో ఉన్నతోద్యోగికి చెల్లించే జీతం.. అక్కడి సగటు ఉద్యోగికి ఇస్తున్న జీతంతో పోల్చితే 731 రెట్లు ఎక్కువ. అలాగే దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో ఉన్నతోద్యోగికి చెల్లించే వేతనం.. సగటు ఉద్యోగికి ఇచ్చే జీతం కంటే 515 రెట్లు అధికం. ఐటిసి చైర్మన్ వైసి దేవేశ్వర్‌కు ఇస్తున్నది అక్కడి సగటు ఉద్యోగి కంటే 427 రెట్లు ఎక్కువే.
ఇలా చెప్పుకుంటూపోతే బజాజ్ ఆటో (522 రెట్లు), సిప్లా (416 రెట్లు), భారతీ ఎయిర్‌టెల్ (366 రెట్లు), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (187 రెట్లు), హిందుస్థాన్ యునిలివర్ (138 రెట్లు), మహీంద్ర అండ్ మహీంద్ర (108 రెట్లు), ఐసిఐసిఐ బ్యాంక్ (102 రెట్లు)లలో అక్కడి ఉన్నతస్థాయి ఉద్యోగులు అందుకుంటున్న జీతభత్యాలు.. తమ క్రిందిస్థాయి ఉద్యోగులు తీసుకుంటున్న వేతనాలతో పోల్చితే ఎంతో ఎక్కువగా ఉంటున్నాయి. ఇదిలావుంటే 2015-16తో పోల్చితే 2016-17లో విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హీరో మోటోకార్ప్, లుపిన్, అదానీ పోర్ట్స్ సంస్థల్లో వేతనాల్లో తేడాలు తగ్గాయి. అయితే టిసిఎస్, బజాజ్ ఆటో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, ఐటిసి, భారతీ ఎయిర్‌టెల్, సిప్లా, మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా స్టీల్, హెచ్‌యుఎల్ సంస్థల్లో జీతాల మధ్య తేడాలు పెరిగాయి.
ఇకపోతే దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా ఉన్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వివరాలు తెలియరాలేదు. ముకేశ్ వార్షిక వేతనం 15 కోట్ల రూపాయలుగా ఉన్నది తెలిసిందే.