బిజినెస్

ఇపిఎఫ్‌ఒ ఖాతాదారులకు చౌక గృహాల పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) ఖాతాదారుల కోసం చౌక ధరల గృహ పథకాన్ని యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. ‘ఇపిఎఫ్‌ఒ ఖాతాదారులకు తగినట్లుగా ఓ చౌక ధరల హౌసింగ్ పథకాన్ని ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది ఇంకా ప్రాథమిక దశ చర్చల్లోనే ఉంది.’ అని సోమవారం లోక్‌సభకు కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. భవిష్య నిధి సొమ్ము సాయంతో ఖాతాదారులు తక్కువ ధరకు ఇళ్లను కొనుగోలు చేసేలా ప్రభుత్వంగానీ, ఇపిఎఫ్‌ఒగానీ ఏదైన పథకాన్ని పరిచయం లేదా ప్రతిపాదించనుందా? అన్న ప్రశ్నకు బదులుగా దత్తాత్రేయ సోమవారం ఓ లిఖితపూర్వక సమాధానం లోక్‌సభకు సమర్పించారు. నిజానికి నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన ఇపిఎఫ్‌ఒ ట్రస్టీల సమావేశంలోనూ ఈ హౌసింగ్ స్కీమ్‌ను అజెండాగా చేర్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం లో-కాస్ట్ హౌస్‌లను కొనుగోలు చేయడానికి ఖాతాదారులు తమ భవిష్య నిధి విరాళాలను ఆసరాగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నిపుణుల కమిటీ ఇపిఎఫ్‌ఒ ట్రస్టీలకు ఓ నివేదికను కూడా సమర్పించింది. తమ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) విరాళాల నుంచి ఇళ్ల కొనుగోలకు ఖాతాదారులు అడ్వాన్స్‌గా పొందవచ్చని నిపుణుల కమిటీ ఏకగ్రీవ అంగీకారం తెలిపింది. అంతేగాక నెలసరి చెల్లింపు (ఇఎమ్‌ఐ)గా కూడా పిఎఫ్ సొమ్మును మార్చుకోవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. కాగా, ప్రతిపాదిత హౌసింగ్ పథకం ప్రకారం పిఎఫ్ సొమ్మును ఇఎమ్‌ఐలోకి మార్చడానికి ఖాతాదారుడు, బ్యాంక్ లేదా గృహ రుణాల సంస్థ, ఇపిఎఫ్‌ఒల మధ్య త్రైపాక్షిక ఒప్పందం అవసరమని కూడా కమిటీ అభిప్రాయపడింది. ‘బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల రుణంతో ఇపిఎఫ్‌ఒ ఖాతాదారులు నివాస గృహాలను కొనుగోలు చేయవచ్చు.’ అని కమిటీ తమ నివేదికలో పేర్కొంది. గృహ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ పథకం ప్రయోజనాలనూ ఖాతాదారులకు వర్తింపజేయాలని సూచించింది. అయితే తక్కువ ఆదాయం కలిగిన, తమ మొత్తం ఉద్యోగ జీవితంలో పొందే సంపాదనతో కూడా ఇళ్లు కొనలేని పరిస్థితిలో ఉన్న పేద ఇపిఎఫ్‌ఒ ఖాతాదారులను మాత్రమే ఈ లో-కాస్ట్ హౌసింగ్ స్కీమ్‌కు అర్హులను చేయాలని నివేదికలో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఇపిఎఫ్‌ఒలో ఐదు కోట్లకుపైగా ఖాతాదారులున్నారు.
నిర్వహణలో లేని ఖాతాల్లో రూ. 43 వేల కోట్లు!
నిర్వహణలో లేని ఇపిఎఫ్‌ఒ ఖాతాల్లో 43 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆ ఖాతాలన్నింటిలో వడ్డీని కూడా జమ చేస్తున్నామని బండారు దత్తాత్రేయ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. అలాగే గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 118.66 లక్షల ఖాతాదారులకు ఇపిఎఫ్‌ఒ సంస్థ సెటిల్‌మెంట్ చేసిందని, కేవలం 20 రోజుల్లో 98 శాతం సెటిల్‌మెంట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే 2014-15లో 130.21 లక్షలు, 2013-14లో 123.36 లక్షల ఖతాలను సెటిల్ చేసినట్లు వెల్లడించారు. కాగా, 2015-16కుగాను 1.18 లక్షల ఖాతాల క్లయిమ్స్ వివిధ కారణాలతో ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. నిజానికి నిర్వహణలో లేని ఖాతాల్లో వడ్డీ జమ అయ్యేది కాదని, ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆ ఖాతాల్లోనూ వడ్డీని జమ చేస్తున్నామని అన్నారు. ఇలాంటి ఖాతాలను దృష్టిలో పెట్టుకునే ఒక వ్యక్తికి ఒక ఖాతా మాత్రమే ఉండాలని నిర్ణయించామని, అందుకుగాను యూనివర్సల్ అకౌంట్ నెంబరు (యుఏఎన్)ను కేటాయిస్తున్నామని చెప్పారు. నిర్మాణ రంగంలోని కార్మికులకు కూడా యుఏఎన్ పోర్టబిలిటీ నెంబర్‌ను కేటాయించి వారిని కూడా ఇపిఎఫ్‌ఒ ఖాతాదారులుగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆటో రిక్షా డ్రైవర్ల కోసం ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్లు వెల్లడించారు.