బిజినెస్

పడకేసిన పారిశ్రామిక ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి మార్చి నెలలో మళ్లీపడకేసింది. ఫిబ్రవరి నెలలో 2శాతం మేర వృద్ధి కనబరచిన పారిశ్రామిక ఉత్పత్తిసూచీ (ఐఐపి)మార్చి నెలలో కేవలం 0.1 శాతమే వృద్ధి చెందింది. వౌలిక వస్తువుల ఉత్పత్తి తగ్గడంతో పాటుగా ఉత్పాదక రంగ, మైనింగ్ రంగాల పని తీరు అధ్వాన్నంగా ఉండడం పారిశ్రామిక వృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపించింది. గురువారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చి నెలలో పారిశ్రామిక వృద్ధి 2.5 శాతం ఉండింది. మొత్తంమీద 2015-16 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో ఉండిన 2.8 శాతంనుంచి 2.4 శాతానికి పడిపోయింది. సూచీలో 75 శాతానికి ప్రాతినిధ్యం వహించే ఉత్పాదక రంగం వృద్ధి గత ఏడాది మార్చి నెలలో 2.7 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చిలో 1.2 శాతానికి పడిపోయింది. గత ఏడాది 2.3 శాతం వృద్ధి చెందిన ఈ రంగం 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతమే వృద్ధి చెందింది. గత ఏడాది 1.2 శాతం వృద్ధి చెందిన మైనింగ్ రంగం కూడా ఈ ఏడాది 0.1 శాతానికి పడిపోయింది. అయితే విద్యుత్ రంగం మాత్రం గణనీయమైన అభివృద్ధి సాధించింది. క్రితం ఏడాది మార్చి నెలలో కేవలం 2 శాతమే ఉండిన ఈ రంగం వృద్ధి ఈ ఏడాది మార్చిలో 11.3 శాతం వృద్ధి చెందింది. క్రితం సంవత్సరం 1.1 శాతం వృద్ధి చెందిన ఈ రంగం 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతం వృద్ధి చెందింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో8.4 శాతం పడిపోయిన ఈ రంగం ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.6 శాతం వృద్ధి చెందింది.
కాగా, పెట్టుబడులకు కొలమానమైన వౌలిక వస్తువుల రంగం గత ఏడాది మార్చి నెలలో 9.1 శాతం వృద్ధి చెందగా, ఈ ఏడాది మార్చిలో 15.4 శాతం మేర తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 6.3 శాతం వృద్ధి చెందిన ఈ రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో 2.9 శాతం మేర పడిపోయింది. అయితే పారిశ్రామిక రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 12 గ్రూపులు గత ఏడాదితో పోలిస్తే 2016 మార్చి నెలలో సానుకూల వృద్ధిని కనబర్చడం గమనార్హం. రేడియో, టీవీ, కమ్యూనికేషన్ పరికరాలు, విడినాగాల గ్రూపు అత్యధికంగా 36 శాతం వృద్ధిని కనబరిచింది. ఆ తర్వాతి స్థానంలో పొగాకు ఉత్పాదకాల రంగం ఉంది. కాగా, వినియోగ వస్తువుల రంగం వృద్ధి కూడా మార్చి నెలలో నిరాశాజనకంగానే ఉంది. క్రితం ఏడాది మార్చి నెలలో 0.6 శాతం వృద్ధి కనబరిచిన ఈ రంగం ఈ ఏడాది మార్చి నెలలో 0.4 శాతమే వృద్ధి చెందింది. అయితే టీవీలు, ఫ్రిజ్‌లు లాంటి గృహోపకరణాల గ్రూపు మాత్రం గణనీయంగా వృద్ధి చెందడం గమనార్హం.