బిజినెస్

మరింత వేగంగా అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్.. దేశంలోనే తమ అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఏర్పాటు చేసింది. నానాటికీ ఆన్‌లైన్ మార్కెటింగ్ గణనీయంగా పుంజుకుంటున్న నేపథ్యంలో వినియోగదారులకు మరింత వేగంగా సేవలను అందించాలనే లక్ష్యంతో వెళ్తోంది అమెజాన్. ఇందులో భాగంగానే శంషాబాద్ వద్ద భారీ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పగా, దీనితో తెలంగాణలో అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల సంఖ్య ఐదుకు చేరింది. అలాగే అమెజాన్ నిల్వ సామర్థ్యం కూడా 3.3 మిలియన్ ఘనపుటడుగులకు పెరిగింది. ఒక్క శంషాబాద్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ సామర్థ్యమే 2.1 మిలియన్ ఘనపుటడుగులు. కాగా, రాబోయే పండగ సీజన్‌లో జోరుగా సాగే ఆన్‌లైన్ అమ్మకాలను దృష్టిలో పెట్టుకునే అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల విస్తరణకు నడుం బిగించింది. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఉత్పత్తులను త్వరగా వారి వద్దకు చేర్చేందుకు ఇది దోహదపడగలదని అమెజాన్ అంటోంది. ఈ-కామర్స్ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని తట్టుకోవాలంటే వేగం చాలా ముఖ్యమని అమెజాన్ చెబుతోంది. ఇకపై బుక్ చేసుకున్న ఒకటి, రెండు రోజుల్లోనే కస్టమర్లకు తాము కోరుకున్న ఉత్పత్తులను అందించగలుగుతామన్న విశ్వాసాన్ని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు (ఇండియా కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్) అఖిల్ సక్సేనా వెలిబుచ్చారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్, మొబైల్స్ తదితర గృహోపకరణాలతోపాటు నిత్యావసర సరకుల అమ్మకాలనూ అమెజాన్ జరుపుతున్నది తెలిసిందే. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో అమెజాన్‌కు మొత్తం 41 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లుండగా, వాటి నిల్వ సామర్థ్యం 13 మిలియన్ చదరపు అడుగులు. ఇకపోతే ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ శంషాబాద్ వద్ద అమెజాన్ దేశంలోనే తమ అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, దీనిపై అమెజాన్ ఇండియా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు కనబరుస్తున్న ఆసక్తికి ఇది నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ప్యాకేజింగ్, రవాణా, లాజిస్టిక్స్, ఆతిథ్యం వంటి రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో బోలెడు అవకాశాలున్నాయని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వివరించారు. ఇదిలావుంటే రిటైల్, లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక విధానాలను తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన జయేశ్ రంజన్.. ఈ-కామర్స్ సంస్థలకు తెలంగాణ ఓ గొప్ప వరంగా అభివర్ణించారు. పెట్టుబడులకు, మార్కెటింగ్‌కు విసృత అవకాశాలున్నాయని తెలిపారు.
ఇవాంకా ట్రంప్ ప్రసంగం?
హైదరాబాద్ వేదికగా నవంబర్‌లో జరిగే మూడు రోజుల గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ ప్రసంగించే వీలుందని జయేశ్ రంజన్ తెలిపారు. నవంబర్ 28న ఆమె విచ్చేస్తున్నారని, 29న సదస్సులో పాల్గొంటారని, అనంతరం ఆమె తిరిగి అమెరికాకు వెళ్లిపోతారని ఇవాంకా పర్యటన వివరాలను రంజన్ మీడియాకు వివరించారు.

చిత్రం..శంషాబాద్ వద్ద ప్రారంభించిన అమెజాన్ భారీ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్