బిజినెస్

ప్రమాదంలో పొగాకు, మిర్చి సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 31: ప్రకాశం జిల్లా ప్రకృతి ప్రకోపానికి గురవుతూనే ఉంది. అతివృష్టి లేక అనావృష్టి కారణంగా రైతులు అన్నివిధాలా ఆర్థికంగా క్రుంగిపోతున్న పరిస్థితి. వర్షాభావ పరిస్థితుల మధ్య పొగాకు, మిర్చి సాగు ప్రమాదంలో పడింది. పంటలకు సరిపడా నీరు దొరక్క నానా కష్టాలు పడుతున్న రైతన్నను తెగుళ్లు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయ. ముఖ్యంగా పొగాకు సాగును నీటి కొరత వేధిస్తోంది. ఈ సీజన్‌లో పొగాకు రైతులు సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేశారు. కనిగిరి, పొదిలి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లోని రైతులు విరివిగా పొగాకు సాగు చేపట్టారు. అయతే వర్షాభావ పరిస్థితులు పొగాకు రైతాంగాన్ని దెబ్బతీశాయ. దీంతో పంటను కాపాడుకునేందుకు ఆయిల్ ఇంజన్లు, పట్టలపై ఆధారపడుతున్నారు. వాటి ద్వారా ప్రతిరోజు కాల్వలు, చెరువుల్లో నుండి నీటిని తరలిస్తూ రాత్రింబవళ్ళు రైతులు పొలాల్లోనే జాగరణ చేయాల్సిన దుస్థితి నెలకొంది. పట్టలను రోజుకు అడుగు 45 పైసల నుండి 50 పైసల వరకు అద్దెకు తీసుకొచ్చి పొలాలను తడుపుతున్న పరిస్థితి జిల్లాలో ఉంది. అదే విధంగా కొంతమంది రైతులు తమవద్ద ఉన్న ఆయిల్ ఇంజన్లతో నీటిని పంపింగ్ చేస్తుండగా, మరికొంతమంది ఆయిల్ ఇంజన్లను అద్దెకు తీసుకువచ్చి పొగాకు పంటను కాపాడుకునే భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎకరాకు అదనంగా పదివేల రూపాయల నుండి పదిహేనువేల రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు.
ఇదిలాఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడులు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. నిజానికి గత సంవత్సరంలోనే ఎకరాకు ఎనిమిది నుండి తొమ్మిది క్వింటాళ్ళ దిగుబడులు రావటంతో రైతులు ఆర్థికంగా చితికిపోయి కొంతమంది తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటిది ఈ సంవత్సరం ఎకరాకు నాలుగు నుండి ఐదు క్వింటాళ్ళ పొగాకు పంట దిగుబడి వచ్చే పరిస్థితి ఉందని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో పొగాకు రైతుల పరిస్థితి ఆర్థికంగా మరింత దిగజారనుంది. అదేవిధంగా మిర్చి రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టి మిర్చి పంటను రైతులు సాగు చేశారు. జిల్లాలో ఎక్కువుగా నాగులుప్పలపాడు, ఇంకొల్లు, మార్టూరు తదితర ప్రాంతాల్లో మిర్చి పంటను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం మిర్చి పంటలకు రెండు సమస్యలు వచ్చిపడ్డాయి. ఒకపక్క వర్షాభావ పరిస్థితులు, మరొకపక్క తెగుళ్ల బెడద ఉంది. మిర్చి పంటకు ప్రస్తుతం బొబ్బర్ల తెగులు వ్యాపించంతో దిగుబడులు గణనీయంగా తగ్గనున్నాయి. పూత, కాయ దశలోనే ఈ తెగుళ్ళు సోకడం రైతులకు ఆశనిపాతంగా మారిందనే చెప్పవచ్చు. మొత్తం మీద జిల్లాలోని పొగాకు, మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.