బిజినెస్

సాఫ్ట్‌వేర్‌లో జెడ్‌టిఇ రూ. 1,000 కోట్ల పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్‌వేర్ రంగంలో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు చైనాకు చెందిన అంతర్జాతీయ సంస్థ జెడ్‌టిఇ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి జెడ్‌టిఇ-ఎపి ప్రభుత్వాల మధ్య సోమవారం రాత్రి అంగీకారం (లెటర్ ఆఫ్ ఇంటెంట్-ఎల్‌ఓఐ) కుదిరింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 140 స్మార్ట్ సిటీల్లో జెడ్‌టిఇ భాగస్వామిగా ఉంది. ఈ-ప్రగతి, ఇంక్యుబేషన్ సెంటర్, స్మార్ట్ టెక్నాలజీస్ తదితర ప్రాజెక్టుల్లో జెడ్‌టిఇ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లోని హోటల్ ట్రైడంట్‌లో సోమవారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జెడ్‌టిఇ సాఫ్ట్‌వేర్ తరఫున సంస్థ ఎండి ఎస్‌హెచ్ ప్రసూన్ శర్మ-ఎపి ప్రభుత్వం తరఫున ఐటి స్పెషల్ సెక్రటరీ జిఎస్ ఫణికిషోర్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటి సలహాదారు జె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ బ్యాంక్ ఎండిగా జెకె గార్గ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ కార్పొరేషన్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా జెకె గార్గ్ వచ్చారు. ఎస్‌ఆర్ బన్సల్ పదవీ విరమణతో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం కార్పొరేషన్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ యూకో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా గార్గ్ పనిచేశారు. అయితే 1986లో కార్పొరేషన్ బ్యాంక్ నుంచే గార్గ్ తన కెరియర్‌ను ప్రారంభించారు. క్రెడిట్ మేనేజ్‌మెంట్, రికవరీ, ఫారెక్స్ ఆపరేషన్స్, రిటైల్ బ్యాంకింగ్, అడ్మినిస్ట్రేషన్‌లో గార్గ్‌కు విశేష అనుభవం ఉంది.

టెలికామ్ కార్యదర్శిగా జెఎస్ దీపక్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: టెలికామ్ కార్యదర్శిగా జెఎస్ దీపక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత వారం జరిగిన ప్రభుత్వ ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఆయన ఈ కొత్త బాధ్యతల్లోకి వచ్చారు. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1982 బ్యాచ్ ఐఎఎస్ అధికారి జెఎస్ దీపక్. త్వరలో స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమవుతున్న వేళ దీపక్ టెలికామ్ కార్యదర్శిగా రాగా, ఇంతకుముందు ఈ స్థానంలో ఉన్న రాకేశ్ గార్గ్ గత నెల జనవరి 29న మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. 2014 జూలై 17న టెలికామ్ కార్యదర్శిగా గార్గ్ వచ్చారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి, ఫిబ్రవరి 1: తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 45.86 పాయింట్లు పడిపోయి 24,824.83 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7.60 పాయింట్లు కోల్పోయి 7,555.95 వద్ద స్థిరపడింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష జరపనున్న క్రమంలో మదుపరులు కొనుగోళ్లు, అమ్మకాల మధ్య ఊగిసలాటకు గురయ్యారు. ఉదయం ప్రారంభంలో సూచీలు లాభాల్లో కొనసాగినప్పటికీ.. ముగింపునకల్లా నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, పవర్, యుటిలిటీస్, ఆటో, చమురు, గ్యాస్, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 1.40 శాతం నుంచి 0.14 శాతం వరకు దిగజారింది. అయితే టెలికామ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఇండస్ట్రీయల్స్ రంగాల షేర్ల విలువ 1.94 శాతం నుంచి 0.96 శాతం వరకు పెరిగింది. ఇక అంతర్జాతీయంగా చైనా, హాంకాంగ్, సింగపూర్ సూచీలు 0.45 శాతం నుంచి 1.78 శాతం వరకు పడిపోగా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.14 శాతం నుంచి 1.98 శాతం వరకు పెరిగాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.51 శాతం నుంచి 0.69 శాతం వరకు క్షీణించాయి.
....................