బిజినెస్

ఆ సాహసం.. అనవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, సెప్టెంబర్ 23: దేశంలో పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో తీసుకున్న నిర్ణయాన్ని ‘అనవసరమైన సాహసం’గా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఈ నిర్ణయం వల్లనే ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందని ఆయన ఆక్షేపించారు. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయాల్సిన ఆవశ్యకత లేదని, ఆర్థికంగా గానీ, సాంకేతికంగా గానీ ఈ పని చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాల్లో మినహా ప్రపంచంలోని మరే ఇతర దేశంలోనూ పెద్ద నోట్ల రద్దు విజయవంతం కాలేదని ఆయన అన్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తల్లో ఒకరుగా, మన దేశంలో ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పిగా పేరు పొందిన మన్మోహన్ సింగ్ మొహాలీలో శనివారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ, మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం వలన దేశంలో దాదాపు 86 శాతం కరెన్సీ చెలామణిలో లేకుండా పోయిందని, దీని వలన ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న విపత్కర పరిస్థితులను ఇప్పుడు మనం చూస్తున్నామని అన్నారు. ‘కొన్ని నెలల క్రితం నేను అంచనా వేసినట్లుగా పెద్ద నోట్లను రద్దు చేయడం వలన దేశ ఆర్థికాభివృద్ధి మందగించింది. పెద్ద నోట్ల రద్దు చేసిన వెంటనే ప్రభుత్వం వస్తు, సేవల పన్నును అమలులోకి తీసుకురావడం దీర్ఘ కాలికంగా మంచిదే అయినప్పటికీ, తాత్కాలికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం విఫలమవడం వల్లనే ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశలో పయనిస్తోంది’ అని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సర (2016-17) మొదటి త్రైమాసికంతో పోలిస్తే చివరి త్రైమాసికంలో ఎంతో ఎక్కువగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 5.7 శాతానికి పతనమై మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు దేశంలో పెట్టుబడుల రేటు 35 నుంచి 37 శాతం మధ్య ఉండేది. ప్రస్తుతం అది 30 శాతానికంటే తక్కువకు పడిపోయింది. ప్రత్యేకించి ఇప్పుడు ప్రైవేటు పెట్టుబడులు పెరగడం లేదు. ప్రభుత్వ రంగంలో దేశానికి ఎన్నో పెట్టుబడులు అవసరం. కానీ మన అభివృద్ధి కార్యక్రమాలను సాకారం చేసేందుకు ప్రభుత్వ రంగంపై ఎక్కువగా ఆధారపడలేము. ఇదే సమయంలో విదేశీ మారకద్రవ్య పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు కూడా మనం కృషి చేయాలి. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలతో పాటు ఇతరులకు రుణాలను సమకూర్చే విషయంలో బ్యాంకింగ్ వ్యవస్థ సరిగా పనిచేయలేకపోతే అధిక వృద్ధిరేటు నమోదు కాజాలదు’ అని మన్మోహన్ సింగ్ తేల్చిచెప్పారు.
దేశం ఎక్కువగా నిధులు వెచ్చించని రంగాల్లో వైద్య రంగం ఒకటని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ప్రభుత్వ రంగ వ్యయం కేవలం 30 శాతం మాత్రమేనని, ఇతర దేశాలతో పోలిస్తే ఇది మరీ అంత పెద్ద మొత్తమేమీ కాదని ఆయన అన్నారు. వైద్య, ఆరోగ్య రంగంతో పాటు వ్యవసాయ, వౌలిక వసతుల రంగాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మన్మోహన్ సింగ్ సూచించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (ఫైల్ ఫొటో)