బిజినెస్

పర్యాటక ప్రదేశంగా కృష్ణా, గోదావరి సంగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: కృష్ణానదీ పుష్కరాల సందర్భంగా ఇబ్రహీంపట్నం సమీపాన గోదావరి కృష్ణానదీ సంగమ ప్రదేశాన్ని అద్భుత పర్యాటక ప్రదేశంగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం రాత్రి సిఎంఓలో పదికిపైగా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పుష్కర ఏర్పాట్లను సమీక్షించారు. పుష్కర పనులు నత్తనకడన నడుస్తుండటంపై సమీక్ష ప్రారంభంలోనే ఇంజనీర్లపై సిఎం ఆగ్రహం చెందారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆక్వా రంగానికి నిదర్శనంగా సంగమ ప్రదేశానికి వచ్చే యాత్రికులను ఆకర్షించే విధంగా ఆక్వాటిక్ ఐకాన్‌ను తయారు చేయాలని, అది డాల్ఫిన్ ఆకృతి అయితే బాగుంటుందని అన్నారు. డాల్ఫిన్‌లు ఇక్కడ పెరుగుతాయా? అటువంటి ఏర్పాటు చేయగలుగుతామా? అని ముఖ్యమంత్రి అన్నప్పుడు సమావేశంలో నవ్వులు పూశాయి. సంగమ ప్రదేశంలో పుష్కరాలు నిర్వహించే రోజుల్లో ప్రతి సాయంత్రం హారతి ఉంటుందని, ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లు ఉండాలని సిఎం అధికారులను కోరారు. నది అనుసంధాన ప్రదేశంలో సందర్శకులు కూర్చుని కార్యక్రమాలను వీక్షించటానికి ఏర్పాట్లపై శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హారతి, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని తెలిపారు. గోదావరి పుష్కరాలను తొలిరోజు అపశృతి తప్ప అద్భుతంగా నిర్వహించామని, ట్రాఫిక్ రద్దీని నియంత్రించిన విధానం ప్రశంసలు పొందిందని, కృష్ణా పుష్కరాలను గోదావరి పుష్కరాలకు ధీటుగా నిర్వహించాలన్నారు. భక్తులు లక్షలాదిగా తరలివస్తారని, ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రహదారుల విస్తరణ, నిర్మాణం పనులు పూర్తికాకపోవడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల కోసం కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రూ. 1251.13 కోట్లతో చేపడుతున్న పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇదిలా ఉంటే పుష్కరాలకు కృష్ణా జిల్లాలో రూ. 531.61 కోట్లతో 657 పనులు, గుంటూరు జిల్లాలో రూ. 469.41 కోట్లతో 676 పనులు, కర్నూలు జిల్లాలో రూ. 250.11 కోట్లతో 162 పనులు చేపడుతున్నారు. సమావేశంలో మంత్రులు పి నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపి గల్లా జయదేవ్, డిజిపి జెవి రాముడు, సిఎంఓ ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, సిఎంఓ సహాయ కార్యదర్శి అడుసుమిల్లి రాజవౌళి, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దందే, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్, పర్యాటక శాఖ కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్టీసీ ఎండి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు