బిజినెస్

బేగంపేట ఎయిర్‌పోర్టులో ‘ఎయిరో క్యాంపస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: బేగంపేట పాత ఎయిర్ పోర్టు స్ధలంలో ఎయిరో క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్‌పోర్టులో ఉన్న రెండు హేంగర్స్‌కు అదనంగా 100 ఎకరాలను కేంద్రాన్ని ఒప్పించి తీసుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. 690 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎయిర్‌పోర్టులో వంద ఎకరాల్లో ‘ఎయిరో క్యాంపస్’ను ఏర్పాటు చేసేందుకు యోచిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా విమానయాన రంగం, దాని అనుబంధ విభాగాలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న నేపధ్యంలో ఎయిరో క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. పౌర విమానయాన రంగంలోని వృత్తినిపుణులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు అత్యుత్తమ శిక్షణ సంస్థను ఎయిరో క్యాంపస్ పేరుతో ప్రారంభించాలని చూస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత 2008 నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టులో కమ్మర్షియల్ ఆపరేషన్స్‌ను నిలిపివేశారు. అప్పటి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు ఎయిర్ షోలకు, ప్రముఖుల రాకపోకలకు వినియోగిస్తూ, కట్టుదిట్టమైన భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎయిరో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఎయిర్‌పోర్టు భూమిలోని దక్షిణం వైపు ఉన్న భూమితో పాటు రెండు హేంగర్స్‌ను కేటాయించాలని తెలంగాణ వౌళిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కేంద్ర పౌరవిమానయాన శాఖకు ఇప్పటికే లేఖ రాసింది. రానున్న ఐదేళ్లలో విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉండడంతో పాటు కేంద్రం చిన్న చిన్న నగరాల్లో కూడా ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసి విమాన సౌకర్యాన్ని పౌరులకు కల్పించాలని భావిస్తున్న నేపధ్యంలో ఈ రంగానికి చెందిన నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విమానయాన రంగంలోని దిగ్గజ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించిందని తెలిపింది. ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్, విమానయాన భద్రత, క్యాబిన్ క్రూ వంటి విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి కలిగిన ఉద్యోగుల అవసరం ఉందని పేర్కొంది. ఈ ఎయిరో క్యాంపస్ ద్వారా ఆ శిక్షణ ఇచ్చేందుకు దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం బేగంపేట ఎయిర్‌పోర్టులో నాలుగు హేంగర్స్ ఉండగా, కనీసం రెండు హేంగర్స్‌ను కేటాయించాలని కోరింది. విమానయాన రంగానికి ఊతమిస్తూ ఇప్పటికే నగర శివారులోని ఆదిభట్ల వద్ద రెండు ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో విమాన పరికరాల తయారీ సంస్థలు రూపుదిద్దుకుంటున్నాయి.
కాగా ప్రభుత్వం తరఫున ఉన్న రెండు హేంగర్స్ మాత్రం 2012లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. ఇదిలావుంటే ఇప్పటికే రక్షణ మంత్రిత్వ శాఖ బేగంపేట ఎయిర్‌పోర్టులోని ఉత్తర దిశగా ఉన్న 500 ఎకరాలను తమకు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దక్షిణ దిశగా ఉన్న 100 ఎకరాలను నేరుగా తమకు కేటాయించడం గానీ, లేదా లీజుకు గానీ ఇవ్వాలని కేంద్రాన్ని ఆ లేఖలో అభ్యర్థించింది. దీంతో కేంద్ర అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేచిచూస్తోంది.