బిజినెస్

ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కొత్త బిఐఎస్ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దేశ ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) చట్టం ఈ నెల 12వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఉత్పత్తిదారులు తప్పనిసరిగా పాటించాల్సిన ఈ నాణ్యతా ప్రమాణాల చట్టం పరిధిలోకి మరిన్ని సేవలతో పాటు ఆభరణాల్లాంటి కొన్ని ఉత్పత్తులను అదనంగా చేర్చారు. 1986లో రూపొందించిన పాత బిఐఎస్ చట్టాన్ని తొలగించేందుకు రూపొందించిన కొత్త బిఐఎస్ చట్టాన్ని పార్లమెంట్ గత ఏడాది మార్చి నెలలోనే ఆమోదించింది. అయితే ఈ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత వారమే ఖరారు చేసింది. కేవలం వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకే కాకుండా దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు కూడా ఈ కొత్త చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమానికి ఊతమివ్వడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సేవలను అందుబాటులో ఉండేలా ఈ చట్టం వీలుకల్పిస్తుందని ఆయన తెలిపారు. మానవాళితో పాటు జంతువులు, వృక్షాల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, జాతీయ భద్రతకు, దేశంలో అక్రమ వ్యాపార ధోరణులు తలెత్తకుండా అడ్డుకునేందుకు అవసరమని భావించిన ఎటువంటి వస్తువులు, సేవలనైనా విధిగా బిఐఎస్ సర్ట్ఫికేషన్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ కొత్త చట్టంలోని నిబంధనలు ప్రభుత్వానికి వీలుకల్పిస్తున్నాయి. అలాగే బంగారం లాంటి విలువైన లోహాలు, ఆభరణాలు, వస్తువులను తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ చేసేందుకు వీలుకల్పించే నిబంధనలను కూడా కొత్త చట్టంలో పొందుపర్చినట్లు పాశ్వాన్ వివరించారు.