బిజినెస్

జియో ఫోన్లకు మళ్లీ బుకింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశీయ టెలికామ్ మార్కెట్‌లో పెను సంచలనాలను సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) దీపావళి పండుగ తర్వాత మళ్లీ జియోఫోన్ బుకింగ్‌లను ప్రారంభించనుంది. ఆగస్టులో తొలి విడతగా జియో ఫోన్లను బుక్ చేసుకున్న ప్రజలకు 60 లక్షల హ్యాండ్‌సెట్లను పంపిణీచేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత రిలయన్స్ రిటైల్ రెండో విడత బుకింగ్‌లను ప్రారంభిస్తుందని, బహుశా ఈ నెలాఖరులో గానీ లేక వచ్చే నెల మొదటి వారంలో గానీ రెండో విడత బుకింగ్‌లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని రిలయన్స్ రిటైల్ చానల్ భాగస్వామి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. నాలుగో తరం (4జి) ఫీచర్ ఫోన్ అయిన జియో హ్యాండ్‌సెట్ల కోసం ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభించిన తొలి విడత బుకింగ్‌లకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 60 లక్షల జియో ఫోన్లు బుక్ అయ్యాయి. వినియోగదారులకు ఈ ఫోన్లను ఉచితంగానే అందజేస్తున్నామని, అయితే ఇవి దుర్వినియోగం కాకుండా చూసేందుకు కొనుగోలు దారుల నుంచి ఒక్కో హ్యాండ్‌సెట్‌కు 1,500 రూపాయల చొప్పున డిపాజిట్‌ను స్వీకరిస్తున్నామని, మూడేళ్ల పాటు ఈ హ్యాండ్‌సెట్‌ను వినియోగించిన కొనుగోలుదారులకు డిపాజిట్ మొత్తాన్ని ఒకే విడతలో తిరిగి చెల్లిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ రిఫండ్ పథకానికి సంబంధించిన నియమ, నిబంధలను రిలయన్స్ మరింత సడలించింది. కొత్త నిబంధనల ప్రకారం జియోఫోన్ కొనుగోలుదారులు ఏడాది తర్వాత ఆ హ్యాండ్‌సెట్‌ను తిరిగి ఇచ్చేస్తే వారికి డిపాజిట్ మొత్తంలో రూ.500 వాపసు ఇస్తారు. అయితే ఈ ఏడాది కాలంలో వారు మొత్తం మీద 1,500 రూపాయలతో తమ ఖాతాలను రీచార్జి చేయించుకుని ఆ మొత్తాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం వినియోగదారుల సౌకర్యానికి అనుగుణంగా వివిధ రకాల టారిఫ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది.
ఇదేవిధంగా జియో ఫోన్‌ను రెండేళ్ల తర్వాత ఇచ్చిన వారికి 1000 రూపాయలు, మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చిన వారికి పూర్తిగా 1,500 రూపాయలు వాపసు ఇస్తారు. దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో నవరాత్రి పండుగ నాటి నుంచి ప్రారంభమైన జియో ఫోన్ల తొలి విడత పంపిణీ కార్యక్రమం ఆదివారం నుంచి మెట్రో నగరాల్లో కూడా ప్రారంభమైంది. దీపావళి నాటికి తొలి విడత హ్యాండ్‌సెట్ల పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు రిలయన్స్ రిటైల్ చానల్ భాగస్వామి వెల్లడించారు.