బిజినెస్

రైతుల ఇంట సిరుల గెల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, అక్టోబర్ 19: రెండేళ్ల క్రితం ఉభయ గోదావరి జిల్లాల రైతులకు తీవ్ర నష్టాలు చవిచూపించిన అరటి ప్రస్తుతం లాభాలు కురిపిస్తోంది. ఏడాదికి సుమారు 60 నుండి 80 కోట్ల రూపాయల మేర అరటి అమ్మకాలు జరుగుతూ ఆసియాలోనే అతిపెద్ద అరటిమార్కెట్‌గా ఖ్యాతిగాంచిన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అరటి మార్కెట్‌యార్డులో పెరిగిన ధరలు గత నాలుగు నెలలుగా స్థిరంగా కొనసాగుతుండడంతో రైతులు గత నష్టాలను పూడ్చుకుని లాభాల బాట పడ్డారు. కోనసీమలోని అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి వేరుచేసి ఏర్పాటుచేసిన కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో రావులపాలెం మార్కెట్ యార్డు 1997లో ప్రారంభించారు. రావులపాలెం పంచాయతీ పరిధిలోని ఈయార్డులో అన్ని వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలు జరపడానికి వీలున్నా ప్రధానంగా అరటి అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే జరుగుతున్నాయి. కమిషన్ ఏజెంట్లు, మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా రైతులే వారు పండించిన గెలలను నేరుగా తెచ్చి విక్రయించుకుంటారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, పి గన్నవరం, పశ్చిమగోదావరి జిల్లా పెరవలి, పెనుగొండ తదితర మండలాల్లో ఈ యార్డుపై ఆధారపడి వందలాది మంది రైతులు సుమారు 20వేల ఎకరాల్లో ప్రతి ఏడాది అరటి సాగుచేస్తుంటారు. ప్రతి రోజు సుమారు 2000 నుండి 2500 సైకిళ్లు, మోటారుసైకిళ్లపై తోటల నుండి అరటి గెలలను అమ్మకం నిమిత్తం యార్డుకు తెస్తుంటారు. ఈ విధంగా రోజుకు 15 వేల నుండి 18వేల గెలలు యార్డుకు వస్తుంటాయి. వీటిలో కర్పూర, అమృతపాణి, తెలుపు చక్కెరకేళి రకాలు సుమారు 80 శాతం ఉంటుండగా, బుసావళి, ఎరుపు చక్రకేళి, బొంత (కూర అరటి) మిగిలిన 20శాతం ఉంటాయి. ఈవిధంగా ఏడాదికి సుమారు 55 లక్షల గెలలు యార్డుకు వస్తుండగా, రూ.80 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. సీజన్లను బట్టి ఈ యార్డులో ధరలు పెరగడం, తగ్గడం సాధారణమే అయినా 2015-16 ఆర్థిక సంవత్సరంలో మాత్రం యార్డు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ధరలు పతనమై రైతులు అయోమయానికి గురయ్యారు. అన్ని రకాల అరటి గెలలు రూ.200 నుండి రూ.400 ధర ఉంటే ఆ ఏడాది రూ.25 నుండి రూ.50కి పడిపోవడం అప్పట్లో మార్కెట్ వర్గాల్లో అలజడిరేపింది. కూలి ఖర్చులు కూడ రాక రైతులు ఏం చేయాలో తెలియక డీలాపడిపోయారు. కొనేవారు లేక జాతీయ రహదారిపై గెలలతో నిలబడి వచ్చిపోయే వారికి పిలిచి గెలలు అమ్ముకునే దీనస్థితిని ఎదుర్కొన్నారు. దీని ప్రభావం సుమారు రెండు వేల మంది రైతులు, కూలీలు, 200 మంది ఎగుమతి, ప్యాకింగ్ కూలీలపై పడడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక ప్రణాళిక లేకుండా ఎక్కువ విస్తీర్ణంలో అరటి సాగు చేయడం, ఒకేసారి దిగుబడి రావడంతో పాటు అదే సమయంలో ఇక్కడ నుండి అరటి ఎగుమతి అయ్యే రాష్ట్రాల్లో దిగుబడులు రావడం, శుభ కార్యాలు, పండుగలు లేకపోవడం వంటి కారణాలు అప్పట్లో మార్కెట్‌ను దెబ్బతీశాయి.
కోలుకుంటున్న అరటి రైతు
అయితే నేలతల్లిపై నమ్మకాన్ని కోల్పోని రైతన్న ఆశావహ దృక్పథంతో మళ్లీ అరటి సాగు చేపట్టాడు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దక్కించుకోవాలనే నానుడిని నిజంచేస్తూ గత ఏడాదిన్నర కాలంలో కాలం కలిసొచ్చి అరటి రైతులు ధరలు పెరిగి లాభాలు చవిచూస్తున్నారు. రావులపాలెం యార్డు నుండి ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక, అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలకు నిత్యం లారీల్లో అరటి గెలలు ఎగుమతి అవుతుంటాయి. కొద్ది నెలలుగా ఆషాఢం, శ్రావణ మాస సీజన్లు, వినాయక నవరాత్రులు వరుసగా రావడంతో పాటు ఒడిస్సాలో శుభకార్యాలు, పండుగలతో ఇక్కడ అరటికి డిమాండ్ ఏర్పడింది. అన్ని రకాల గెలలు గరిష్ఠంగా రూ.400 నుండి రూ.600 పలకుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. ఎకరాకు సుమారు 600 గెలలు దిగుబడి వస్తే ఖర్చులు పోను రూ.లక్ష నుండి రూ.మూడు లక్షల వరకు లాభాలు వచ్చినట్టు మార్కెట్ వర్గాల అంచనా. 2015-16 సంవత్సరంలో 67.65 లక్షలు, 2016-17లో 49.41 లక్షలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలాఖరుకు 23.52 లక్షలు గెలలు అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి అనంతరం చలికాలం కావడంతో అరటి వినియోగం తగ్గి, ధరలు కొంతమేర తగ్గుతాయని విశే్లషకులు చెబుతున్నారు. ఏదేమైప్పటికీ గత రెండేళ్లుగా అరటి పంట ఉభయ గోదావరి జిల్లా రైతులకు లాభాలు కురిపించింది. ప్రస్తుతం వివిధ రకాల అరటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
కర్పూర కనిష్ఠ ధర రూ.150 కాగా గరిష్ఠ ధర రూ.450 వరకు ఉంది. తెలుపు చక్కెర కేళి కనిష్ఠ ధర రూ.150 కాగా గరిష్ఠ ధర రూ.430, ఎరుపు చక్కెర కేళి కనిష్ఠ ధర రూ.250, గరిష్ఠ ధర రూ.600. బుసావళి కనిష్ఠ ధర రూ.200, గరిష్ఠ ధర రూ.280. అమృతపాణి కనిష్ఠ ధర రూ. 200, గరిష్ఠ ధర రూ.400. బొంత కనిష్ఠ ధర రూ.200 కాగా గరిష్ఠ ధర రూ.400.