బిజినెస్

ఉపాధికి ఊతం.. కాకతీయ టెక్స్‌టైల్ పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 21: ఇరవై వేలమందికి ప్రత్యక్షంగా, మరో లక్షమందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం శంకుస్థాపన చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఫైబర్ టు ఫ్యాబ్రిక్ విధానంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టెక్స్‌టైల్ పార్కుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దశ, దిశ మారిపోయేందుకు అవకాశం ఉంటుంది. సంగెం, గీసుకొండ మండలాల పరిధిలోని చింతల్‌పల్లి-శాయంపేట గ్రామాల మధ్య ఈ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసారు. దశాబ్దాల కిందట వరంగల్ నగరంలో ఏర్పాటుచేసిన ఆజంజాహి మిల్లు అప్పట్లోనే వేలాదిమందికి ఉపాధి కల్పించింది. కానీ నిర్వహణ లోపం, ప్రభుత్వ ప్రోత్సాహం లోపించిన కారణంగా దశల వారీగా మిల్లు మూతపడడంతో ఆజంజాహి మిల్లు కార్మికులు రోడ్డున పడ్డారు.
ఈ మిల్లు తిరిగి తెరిపించాలని కార్మికులు డిమాండ్ చేస్త్తూ ఆందోళనలకు దిగడం, తమ పార్టీ అధికారంలోకి వస్తే మిల్లును తిరిగి తెరిపిస్తామని అన్ని పార్టీలు హామీ ఇవ్వటం తప్ప ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. మిల్లుకు సంబంధించిన కొన్ని యంత్రాలను ఇతర ప్రాంతాలకు తరలించడం, మరికొన్ని విక్రయించడం, మిగిలినవి తుప్పుపట్టడం జరగగా, ఉపాధి కోల్పోయిన కార్మికులు చేనేత వృత్తి తప్ప మరే వృత్తి చేయలేని స్థితిలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, మరికొందరు ఇతర వృత్తులను ఆశ్రయించక తప్పలేదు. గత ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులు వలస వెళ్లకుండా, ఆకలి చావులకు గురికాకుండా చూసే చర్యలో భాగంగా భారీ టెక్స్‌టైల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ మేరకు మొదట్లో టెక్స్‌టైల్ పార్కును స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఏర్పాటుకు నిర్ణయించగా, అవసరమైన స్థలం విషయంలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో ఈ పార్కు ఏర్పాటుకు గీసుకొండ, సంగెం మండల పరిధిలోని వివిధ గ్రామాల భూములను ఎంపిక చేసారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి సుమారు రెండువేల ఎకరాల భూమి అవసరంకాగా, ప్రస్తుతం సుమారు 12 వందల ఎకరాల భూమిని వరంగల్ రూరల్ జిల్లా యంత్రాంగం సేకరించింది. ఐదు దశలలో మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం జరపాలని నిర్ణయించగా మొదటి విడతలో సుమారు ఏడువందల కోట్ల వ్యయంతో పార్కు నిర్మాణానికి రంగం సిద్ధం చేసారు. కొత్తగా నిర్మించే టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ఐటి, చేనేత, జౌళిశాఖల మంత్రి కెటిఆర్ జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి ఒప్పించారు. ఆదివారం శంకుస్థాపన జరిగిన అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలోనే కొందరు పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయులపై సంతకాలు జరిపేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు వలసపోయిన చేనేత కార్మికులను ఇక్కడకు రప్పించి చేనేత రంగంలో అధునాత మెళకువలపై శిక్షణ ఇప్పించి కొత్తగా నిర్మిస్తున్న టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి భూములు ఇచ్చిన కుటుంబాలలోని యువకులకు కూడా అర్హత ఆధారంగా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాలు ఇస్తామని మంత్రి కెటిఆర్ హామీ కూడా ఇచ్చారు.
కాగా, వరంగల్ నగరం చుట్టూ నిర్మించే ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి కూడా టెక్స్‌టైల్ మిల్లు నిర్మించే ప్రాంతంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ నగరం మహానగర పాలక సంస్థగా అప్‌గ్రేడ్ కావడం, నగర జనాభా, విస్తీర్ణం పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలతో నగరంలో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నగరంలో ప్రస్తుతం ఉన్న వంద ఫీట్ల రోడ్డు, హంటర్ రోడ్లతో పెద్దగా ప్రయోజనం లేకపోవటంతో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం, ఖమ్మం, నర్సంపేట మార్గాలలో వెళ్లే భారీ వాహనాలు, ఇతర వాహనాలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగురోడ్డు నుంచి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే నగరంలోని కాజీపేట-్ఫతిమానగర్ వద్ద కొత్తగా నిర్మించే రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జికి కూడా టెక్స్‌టైల్ పార్కు ప్రాంతంలోనే ముఖ్యమంత్రి లాంఛనంగా శంకుస్థాపన చేస్తున్నారు. ఆదివారం జరిగే ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

చిత్రం..కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు