బిజినెస్

ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 22: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని, సరయిన దిశగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం స్వంత రాష్ట్రం గుజరాత్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రధాని దహేజ్‌లో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని అన్నారు. ‘కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉంది. సరయిన దిశలోనే సాగుతోంది. దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 300 బిలియన్ డాలర్ల నుంచి 400 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని అనేక మంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) గురించి ఆయన మాట్లాడుతూ, దీనివల్ల ఇప్పుడు ట్రక్కులను పన్ను బూత్‌ల వద్ద ఆపాల్సిన అవసరం లేకుండా పోయిందని, ఫలితంగా రవాణా ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా సాగుతోందని, వేలాది కోట్ల రూపాయలు ఆదా కావడానికి తోడ్పడుతోందని అన్నారు. గతంలో ఒక ట్రక్కు నిర్దేశించిన గమ్యం చేరడానికి అయిదు రోజులు పడితే, ఇప్పుడు అదే గమ్యాన్ని మూడు రోజుల్లోనే చేరుతోందని, ఫలితంగా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు అవినీతిపరుల చేతులు తడపాల్సిన అవసరం లేకుండా పోయిందని పేర్కొన్నారు. దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతోందని అన్నారు. ‘మీరు చెప్పండి, పాత పద్ధతిలో లబ్ధి పొందిన వారంతా మోదీపై ఆగ్రహంతో ఉన్నారా? లేదా?’ అని ఆయన సభికులను ప్రశ్నించారు. ప్రధానమంత్రి మరోసారి వ్యాపార వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. వ్యాపారులు చేస్తున్న వ్యాపారాలను తనిఖీ చేయాలన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. నిజాయితీతో జనజీవన స్రవంతిలోకి వస్తున్న వ్యాపార వర్గానికి తాను ఒక భరోసా ఇస్తున్నానని, వారిని వేధించే హక్కును ఏ అధికారికి ఇవ్వబోమని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ పేరిట అనేక ప్రాజెక్టులను స్తంభింప చేసిందని మోదీ ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.