బిజినెస్

విపక్షాల చేతికి పత్తి అస్త్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 26: పత్తి సాగు తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతాంగంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత ప్రభుత్వంపై దాడికి ప్రతిపక్షాల చేతికి అస్త్రంగా మారింది. ఇప్పటికే రుణమాఫీ ప్రహసంగా మారి మాఫీ ప్రయోజనాలు తమకు ఉపయుక్తంగా లేవన్న అసంతృప్తితో ఉన్న రైతులు పత్తి సాగు నియంత్రించాలన్న ప్రభుత్వ యత్నాలపై మరింత అసహనంతో రగిలిపోతున్నారు. సుంకాల పెంపు, విదేశాల్లో దేశీయ పత్తి దిగుమతులకు డిమాండ్ లేకపోవడం, ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో అధికంగా పత్తి రైతులే ఉంటుండడం, పప్పు్ధన్యాల కొరతను అధిగమించడం వంటి కారణాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పత్తి సాగును తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతు చైతన్య యాత్రల్లోనూ దీనిపై ప్రచారం సాగించింది. అయితే గత దశాబ్దాంన్నర కాలంగా పత్తి సాగుకే అలవాటుపడిన జిల్లా రైతాంగం ఈ ఖరీఫ్‌లో పత్తి సాగు తగ్గించాలన్న ప్రభుత్వ ప్రచారాన్ని జీర్ణించుకోలేకపోతోంది. దీనికితోడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టిడిపి, వామపక్షాలు ప్రభుత్వ పత్తి వ్యతిరేక ప్రచారాన్ని తప్పుబడుతుండడం రైతులకు స్థైర్యాన్నిస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రభుత్వ పత్తి సాగు నియంత్రణ ప్రచారాలను తప్పుబడుతూ ఇప్పటికే బాహాటంగా ప్రభుత్వంపై విమర్శల దాడి ఆరంభించి పత్తి రైతులకు మద్దతుగా నిలిచారు. ఇక టిడిపి మినీ మహానాడులో పత్తి సాగుపై ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ఖండిస్తూ పత్తి రైతులకు అండగా ఆందోళనలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన పత్తి దిగుబడులకు పేరొందిన తెలంగాణ రైతులు పత్తి సాగు చేయవద్దనడం వెనుక కుట్ర ఉందంటూ టిడిపి ఆరోపిస్తోంది. వామపక్షాలు సైతం పత్తి సాగు తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శల దాడి కొనసాగిస్తున్నాయి.
వద్దన్నా.. వినని రైతులు!
రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో పత్తి సాగు జరుగుతోంది. జిల్లాలో సాగుభూములు 14 లక్షల 22 వేల హెక్టార్లు ఉండగా ఇందులో 8 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తున్నారు. 3 లక్షల 45 వేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారు. ఏటేటా పత్తి సాగు విసీర్ణం పెరుగుతూ వస్తుండగా 2007లో లక్షా 6 వేల హెక్టార్లుగా ఉన్న పత్తి సాగు 2015 నాటికి 3 లక్షల 42 వేల హెక్టార్లకు చేరుకోవడం గమనార్హం. ఎన్ని సమస్యలున్నా జిల్లా రైతాంగం పత్తి సాగును వీడడం లేదు. ఈ పరిస్థితుల్లో లక్ష హెక్టార్ల మేరకైనా ఈ ఏడాది పత్తి సాగును తగ్గించాలన్న జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఈ దిశగా ఇప్పటికే వ్యవసాయ శాఖ పత్తి విత్తన ప్యాకెట్ల పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలో ప్రేక్షక పాత్రకే పరిమితమైన రైతులు ఖరీఫ్ పంటల సీజన్‌కు పెద్ద ఎత్తున పత్తి సాగుకు దుక్కులు సిద్ధం చేస్తూ విత్తనాలు కొనుగోలు చేస్తుండడం చర్చనీయాంశమైంది. ఈ ఖరీఫ్‌లో 3 లక్షల 50 వేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారన్న అంచనాతో 17 లక్షల 50 వేల పత్తి ప్యాకెట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి సాగు తగ్గించాలన్న నిర్ణయంతో విత్తన ప్యాకెట్ల పర్యవేక్షణను వ్యవసాయ శాఖ పట్టించుకోకపోయినా డీలర్ల నుండి ఇప్పటికే 6 లక్షల మేరకు ప్యాకెట్లు కొనుగోలు జరిగిన వైనం పత్త సాగు పట్ల రైతుల మోజుకు నిదర్శనం. వర్షాలు పడి విత్తనాలు వేసే సమయానికి పత్తి విత్తనాలకు రైతులు మరింత ఎగబడే అవకాశముంది. దీంతో పత్తి సాగు నియంత్రణకు ప్రభుత్వం సాగిస్తున్న ప్రచారాన్ని రైతులు పట్టించుకోవడం లేదని తేలిపోతోంది. అటు పప్పు్ధన్యాల విత్తనాలను ఈ ఏడాది జిల్లా సాధారణ కోటా కంటే అదనంగా 47,777 క్వింటాళ్లను తెప్పించినప్పటికీ వాటి కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపడం లేదు.