బిజినెస్

చక్కెర కార్మికులకు చేదు మెతుకులేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, నవంబర్ 18: ఎన్నో సంవత్సరాల తరబడి శ్రమిస్తూ ఎంతో మందికి తీపిని పంచిన చక్కెర కర్మాగారం కార్మికులు నేడు చేదు మెతుకులతో కాలం వెల్లదీయాల్సి వస్తోంది. రెండేళ్లుగా చేయడానికి ఉద్యోగం లేక, చేతిలో పైసా లేక ఆర్థిక ఇబ్బందులతో పస్తులుంటున్నారు. తమను ఎవ్వరైనా ఆదుకుంటారేమో కనీసం విఆర్‌ఎస్ నోటిఫికేషనైనా వస్తుందా అని నిలువెల్లా ఎదిరి చూస్తున్నారు. సమైఖ్య రాష్ట్రంలో ప్రైవేటుపరమైన నిజాంచక్కెర కర్మాగారం స్వరాష్ట్రంలో పూర్వ వైభవం సంగతెలా ఉన్నప్పటికీ ప్రైవేటు యాజమాన్యం తీరుతో లేఆఫ్ అయిపోయింది. దాంతో ఈ కర్మాగారంలో పనిచేస్తున్న 150 మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ కర్మాగారంలో లే ఆఫ్ ఎత్తివేయాలన్ని ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సమైఖ్య రాష్ట్రంలో ప్రైవేటుపరమైన నిజాం చక్కెర కర్మాగారాల దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందగా ఉండిపోయింది. కర్మాగారాలకు పూర్వ వైభవం వస్తుందని కలలు కన్న కార్మికులు నేడు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యమ సమయంలో కన్న కలలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందా అని వారు నిలువెల్లా ఎదిరి చూస్తున్నారు. మూలన పడిన ఈ కర్మాగారాలను కనీసం సహకార రంగంలోనైనా నడిపించాలని యోచించిన సర్కారు అందుకు అనుగుణంగా కూడా చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. సహకార రంగానికి మొదట్లో చకచకా అడుగులేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, రైతులతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కర్మాగారాల స్థితిగతులను తెలుసుకునేందుకు స్టడీటూర్‌ను నిర్వహించిన సంగతి విధితమే. సహకారం విషయంలో రైతులు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేయడంతో సర్కారు ఈ కర్మాగారాల వ్యవహారంలో స్తబ్దతగా ఉండిపోయింది. దీనికి తోడు ప్రైవేటు యాజమాన్యం ఏకంగా లే ఆఫ్ ప్రకటించి కర్మాగారాలను మూసివేయడంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విఆర్‌ఎస్ వేస్తే కనీసం ఆర్థిక ఇబ్బందుల నుండైనా బయటపడవచ్చని ఆశతో ఉన్న కార్మికులు తమ గోడును కలిసిన వారికల్లా వెళ్లబోసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ సుగర్ ఫ్యాక్టరీ, కరీంనగర్ జిల్లా ముత్యంపేట చక్కెర కర్మాగారం, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి చక్కెర కర్మాగారాలను గత సమైఖ్య రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ప్రైవేటు పరం చేసిన సంగతి తెలిసిందే. ఎంతో సుధీర్ఘ చరిత్ర కలిగిన ఈ కర్మాగారాలను ప్రైవేటుపరం చేయవద్దని కార్మికులు, కర్షకులు ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. స్వరాష్ట్రం వస్తే తమ బతుకులు మారుతాయన్న ఆశతో చక్కెర కార్మికులు ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు. ఈ కర్మాగారాలలో దాదాపు 200 మంది కార్మికులు పనిచేయడం జరుగుతోంది. వారంతా నేడు లే ఆఫ్ వలన ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఉద్యమ సమయంలో ప్రైవేటు యాజమాన్యాన్ని ఎదిరించి అనేక సార్లు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్మికుల పక్షాన నిలిచిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మొదటి నుండీ కార్మికులకు అండగా ఉంటూ స్వరాష్ట్రం సిద్ధించి తెరాస అధికారంలోనికి వస్తే చక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకువస్తామంటూ స్పష్టమైన హామీలు కూడా ఇచ్చారు. ఈ హామీ ప్రకారం ఎంపీ నిజాంచక్కెర కర్మాగారాల వ్యవహారంలో ఎంపీ మొదట్లో తనవంతు కృషి చేశారు. సహకార రంగం విషయంలో మెట్‌పల్లి రైతులు ముందుకు వచ్చినా బోధన్, మెదక్ రైతులు అనాసక్తి చూపడంతో ఎంపీ సైతం ఏమి చేయలేక స్తబ్తంగా ఉండిపోయారు. గతంలో ఈ చక్కెర కర్మాగారాల అంశం శాసనసభా సమావేశాలలో చర్చకు రాగా ముఖ్యమంత్రి కెసీఆర్ స్పందిస్తూ నిజాంసుగర్స్ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపే పరిస్థితిలో లేదని తేల్చిచెప్పారు. దాంతో ఈ కర్మాగారాలు కనీసం సహకార రంగంలో నడిపేందుకు సర్కారు చర్యలు చేపడుతుందన్న సంకేతాలు వచ్చాయి. కానీ అది కూడా ఆచరణలో సాధ్యం కాకపోవడంతో కర్మాగారాల భవితవ్యం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. ఈ చక్కెర కర్మాగారాలలో ప్రైవేటు యాజమాన్యం లేఆఫ్ ప్రకటించి వచ్చే డిసెంబర్ నాటికి రెండేళ్లు పూర్తి కావస్తుంది. లేఆఫ్ సంగతెలా ఉన్నప్పటికీ కనీసం విఆర్‌ఎస్ వేసినా తమకు రావాల్సిన వేతన బకాయిలు చేతికందుతాయని కార్మికులు ఆశతో ఎదిరిచూస్తున్నారు. కానీ అందుకనుగుణంగా కూడా చర్యలు కనిపించడం లేదు. సహకార రంగం విషయంలో సర్కారు స్తబ్దంగా ఉండటం, లేఆఫ్ ఎత్తివేతకు చర్యలు కనిపించక పోవడంతో నిజాంసుగర్స్ కర్మాగారాల భవితవ్యం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. స్తబ్దంగా ఉన్నటువంటి ప్రభుత్వం లేఆఫ్‌ను ఎత్తివేయించి విఆర్‌ఎస్ నోటిఫికేషన్ వేయించేందుకు చొరవ చూపితే తాము ఆర్థిక ఇబ్బందుల నుండైనా బయటపడవచ్చని కార్మికులు అభిప్రాయ పడుతున్నారు. కార్మికుల దుస్థితిని దృష్టిలో పెట్టుకుని కనీసం లే ఆఫ్ ఎత్తివేసేందుకైనా ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
చిత్రం..బోధన్‌లో వెలవెలబోతున్న నిజాం చక్కెర కర్మాగారం