బిజినెస్

ఉల్లి ఘాటుపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లిపాయల ధరలకు కళ్లెం వేసి, స్థానికంగా సరఫరాలను మెరుగుపర్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఉల్లిపాయల కనీస ఎగుమతి ధర (ఎంఇపి)ను టన్నుకు 850 డాలర్లుగా నిర్ణయించామని, కనుక దీనికంటే తక్కువ ధరకు ఉల్లి ఎగుమతులను అనుమతించేది లేదని ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించింది. 2015 డిసెంబర్‌లో ఉల్లిపాయలపై ఎంఈపీని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు దేశీయ మార్కెట్లలో వాటి ధరలు ఆకాశాన్నంటడంతో ఈ చర్య చేపట్టింది. దీంతో వచ్చే నెల 31వ తేదీ వరకు అన్ని రకాల ఉల్లి ఎగుమతులను టన్నుకు 850 డాలర్ల కనీస ఎగుమతి ధరతో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీ)పై మాత్రమే అనుమతించడం జరుగుతుందని డీజీఎఫ్‌టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) తమ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. దేశంలో ఉల్లి ధరలు నానాటికీ పెరుగుతుండటం పట్ల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటి ఎగుమతులకు కనీస ధరను నిర్ణయించాలని ఆగస్టు నెలలో కేంద్ర వాణిజ్య శాఖను కోరారు. అంతేకాకుండా ఉల్లి ఎగుమతులకు ప్రస్తుతం ఇస్తున్న ప్రోత్సాహకాలన్నింటినీ రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశీయంగా ఉల్లి సరఫరాలు తగ్గడంతో దాదాపు అన్ని నగరాల్లో ప్రస్తుతం కిలో ఉల్లి ధర 50 నుంచి 65 రూపాయలకు పెరిగి వినియోగదారులకు ‘మంట’ పుట్టిస్తోంది. దీంతో కేంద్రం తక్షణమే 2 వేల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేయాల్సిందిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంఎంటీసీలను ఆదేశించడంతో పాటు స్థానికంగా ఉల్లిపాయలను కొనుగోలుచేసి మార్కెట్లకు తరలించాలని నాఫెడ్, ఎస్‌ఎఫ్‌ఏసీ తదితర సంస్థలకు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి నాలుగు నెలల్లో దేశం నుంచి భారీగా 1.2 మిలియన్ టన్నుల ఉల్లి ఎగుమతులు జరగడంతో స్థానికంగా సరఫరాలు తగ్గాయి. గత ఏడాది ఏప్రిల్-జూలై మధ్య కాలంలో జరిగిన ఉల్లి ఎగుమతుల కంటే ఇవి 56 శాతం ఎక్కువ. అలాగే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి పంట విస్తీర్ణం తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.