బిజినెస్

సన్నగిల్లిన ఉపాధి..ఆపై శ్రమ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 3: బీడీ కట్టలపై 80 శాతం వరకు క్యాన్సర్ గుర్తు బొమ్మలను ముద్రించాలనే ఆంక్షలు...నెలల తరబడి వెంటాడిన పెద్ద నోట్ల రద్దు ప్రభావం...జీఎస్‌టీ పరిధి నుండి అసలేమాత్రం మినహాయింపు ఇవ్వకపోవడం వంటి కారణాలతో బీడీ పరిశ్రమ అంతకంతకూ కుచించుకుపోయి కార్మికులకు ఉపాధి సన్నగిల్లుతోంది. ఇప్పటికే పై కారణాలతో అనేక చిన్న కంపెనీలు మూతబడగా, పెద్ద కంపెనీలు సైతం పని దినాలను తగ్గించివేశాయి. నెలలో కనీసం 20 రోజుల పాటు కార్మికులకు బీడీలు చుట్టే పని లభించడం గగనకుసుమంగా మారింది. దశాబ్దాల కాలం నుండి ఇదే వృత్తిపై ఆధారపడి జీవనాలు వెళ్లదీస్తున్న లక్షలాది కుటుంబాలు ప్రస్తుత విపత్కర పరిస్థితులను అధిగమించి పొట్ట పోసుకునేందుకు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఇంటి పట్టునే ఉంటూ రోజుకు సేరు బీడీలు చేస్తూ ఇంటిల్లిపాదినీ పోషించినవారు, ప్రస్తుతం చేసేందుకు పని లభించక శరీరం సహకరించని స్థితిలోనూ గత్యంతరం లేక ఉపాధి హామీ, ఇతరాత్ర కూలీ పనుల కోసం పరితపించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని బీడీ కంపెనీల యాజమాన్యాలు తమ ధన దాహాన్ని మాత్రం వీడలేకపోతున్నాయి. అడ్డదారుల్లో పయనిస్తూ కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తున్నాయి. ఇటు కార్మికులనే కాకుండా, అటు ప్రభుత్వ ఖజానాకు సెస్సు రూపంలో చెల్లించాల్సిన ఆదాయానికి కూడా భారీ మొత్తంలో గండి కొడుతున్నారు. ‘వర్దీ’ బీడీల తయారీని పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ అక్రమ మార్గంలో ధనార్జనను సాగిస్తున్నారు.
రాష్ట్రంలో బీడీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న నిజామాబాద్‌తో పాటు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాలలో ఈ వర్దీ దందా కారణంగా లక్షలాది మంది కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అసలే బీడీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి పనులు లభించడం మృగ్యంగా మారడంతో అనేక మంది తమ కుటుంబ పోషణ కోసం నానా అగచాట్లకు గురవుతున్నారు. ఇదే అదనుగా ఇటీవలి కాలంలో వర్దీ బీడీల తయారీని జోరుగా సాగిస్తున్నారు.
ప్రభుత్వం బీడీ కార్మికులకు జీవన భృతి కింద నెలకు వేయి రూపాయల పెన్షన్‌ను అందిస్తుండగా, వర్దీ బీడీలు చుట్టే కార్మికులు ఆ లబ్ధికి కూడా నోచుకోలేకపోతున్నారు. వీరికి పీఎఫ్ సదుపాయం వర్తించని కారణంగా పెన్షన్‌లకు అనర్హులుగా పరిగణిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికులుగా పేర్లు నమోదు చేసుకుని ఉంటే, వారు వర్దీ బీడీలు చుట్టే వారైనప్పటికీ పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని పేర్కొంటున్నప్పటికీ ఇంకా వేలాది మందికి పెన్షన్‌లు మంజూరు కాలేదు.
వర్దీ బీడీల రూపంలోనే పలు కంపెనీలే గుట్టుగా రోజుకు దాదాపు 4 కోట్ల వరకు బీడీలను తయారు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదివరకు బీడీ కార్మిక సంఘాల నాయకులు, కార్మిక శాఖ అధికారులు జిల్లాలో దాడులు చేసిన సందర్భంగా, ఓ బీడీ కంపెనీ వర్దీ తయారీని ప్రోత్సహిస్తున్న వైనం గుట్టు రట్టయింది. సదరు ఒక్క కంపెనీయే ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకుని రోజుకు రెండు కోట్ల బీడీలను వర్దీ రూపంలో చుట్టిస్తున్నట్టు తేటతెల్లమైంది. ఇలా వర్దీ పేరిట కార్మికులకు నిర్ణీత రుసుము చెల్లించకుండా అరకొర వేతనాలను అందిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. వేయి బీడీలకు అధికారికంగా కార్మికులకు అన్ని భత్యాలు కలుపుకుని సుమారు 180 రూపాయల వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలను యాజమాన్యాలు కల్పిస్తాయి. అందుకు భిన్నంగా వర్దీ బీడీలు చుట్టించడం ద్వారా కేవలం 120 రూపాయల వేతనంతోనే సరిపెడుతున్నారు. ఈ లెక్కన కార్మికులు 4 కోట్ల బీడీల తయారీపై వేతనం రూపంలోనే రోజుకు 40 లక్షల రూపాయల వరకు కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాకుండా పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలకు దూరమవుతున్నారు.
ప్రభుత్వానికి పన్ను రూపంలో వేయి బీడీలకు దాదాపు 18 రూపాయల చొప్పున లెక్కిస్తే 9 లక్షల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది.
ఒక్కరోజుకే ఇంత పెద్దఎత్తున బీడీ యాజమాన్యాలకు అడ్డదోవన ఆదాయం సమకూరుతుండగా, కార్మికులు మాత్రం శ్రమ దోపిడీకి గురికావాల్సి వస్తోంది. ఈ తతంగం అనునిత్యం కొనసాగుతున్నప్పటికీ, సంబంధిత సెంట్రల్ ఎక్సైజ్, కార్మిక శాఖల అధికారులెవరూ స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పకడ్బందీగా దృష్టిసారిస్తే అటు ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని పెద్ద మొత్తంలో రాబట్టుకోవడంతో పాటు బీడీ కార్మికులకు న్యాయం చేసినట్లవుతుందని పలువురు సూచిస్తున్నారు.