బిజినెస్

‘ఆధార్’ అనుసంధానం గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: బ్యాంకు ఖాతాలు, పాన్‌తో ‘ఆధార్’ను అనుసంధానం చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పొడిగించింది. ఇప్పటి వరకూ బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు పాన్, ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి ఈ వెసలుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్నవారు, కొత్తగా ఖాతాలను తెరిచేవారు తప్పనిసరిగా 12 అంకెల ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. 50 వేల రూపాయలు, అంతకుమించి ఆర్థిక లావాదేవీలు జరిపేవారికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఆధార్ అనుసంధానానికి ఈ ఏడాది డిసెంబర్ 31 తుది గడువు అని గతంలో కేంద్రం పేర్కొంది. అయితే, ఈ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పొడిగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం ఇటీవల సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో గడువును పొడిగిస్తూ బుధవారం నాడు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖ కేటాయించే ‘పాన్’కు కూడా ఆధార్‌ను విధిగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. వివిధ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, బ్యాంకుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆధార్ అనుసంధానానికి గడువును పొడిగించాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. బ్యాంకులు, ‘పాన్’తో పాటు పలు సేవలకు, వివిధ సంక్షేమ పథకాల అమలుకు కూడా ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నేడు సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ
పలు సేవలు, అభివృద్ధి పథకాలకు ‘ఆధార్’ను అనుసంధానం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీం కోర్టులోని అయిదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ చేపడుతుంది. ‘ఆధార్ అనుసంధానం తప్పనిసరి’ అంటున్న ప్రభుత్వ ఉత్తర్వులపై మధ్యంతర ‘స్టే’ ఇవ్వాలని సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. ‘ఆధార్’ కేసులపై విచారించేందుకు ఏర్పాటైన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ అవుతుందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
పలు సేవలు, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకునే గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పొడిగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ నెల 7న కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి అంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని కేసులను విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమించాలని భావిస్తున్నట్లు గత నెల 27న సుప్రీం పేర్కొంది. కాగా, వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని తొమ్మిది మంది సభ్యులున్న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఆధార్’ వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని సర్వోన్నత న్యాయస్థానంలో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే, ఆధార్ కార్డులు లేనివారిపైన, వాటికోసం నమోదు చేసుకునేందుకు సుముఖత చూపని వారిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని అటార్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇలాంటి వారు సంక్షేమ పథకాలకు అనర్హులని భావించరాదని ఆయన స్పష్టం చేశారు.