బిజినెస్

రైతులకు బాసట.. పాత పంటల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 13: సంప్రదాయంగా సాగు చేసే ఆహార పంటలు అంతరించిపోకుండా పరిరక్షించేందుకు డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) 18 సంవత్సరాలుగా నిరంతర కృషి కొనసాగిస్తోంది. పాత పంటల జాతర పేరిట ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన ప్రారంభించి ఫిబ్రవరి 10వ తేదీన అట్టహాసంగా పాత పంటల జాతరను ముగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఝరాసంగం మండలం పొటిపల్లి గ్రామంలో పాతపంటల జాతర ప్రారంభించనున్నారు. జీవవైవిధ్యం, సేంద్రియ పంటల పరిరక్షణకోసం సుదీర్ఘ కాలంపాటు నిర్వహిస్తున్న పాతపంటల జాతర దేశంలోనే మొట్టమొదటిదని చెప్పవచ్చు. గ్రామీణ ప్రజలను ప్రధానంగా రైతులను చైతన్య పర్చడంలో జాతర నిర్వహిస్తున్న సంస్థల్లో డెక్కన్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రథమ స్థానం దక్కించుకుంటుంది. జాతర సందర్భంగా పర్యావరణం, పశువులు, ప్రజారోగ్యానికి సంబంధించిన జొన్న, సజ్జ, కొర్ర, రాగులు, పచ్చజొన్న, పెసర, మినుము, అవుశలు, కుసుమలు, ఉలువలు తదితర పాతపంటల పరిరిక్షణపై విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే ఈ జాతర ఉత్సవాల్లో నెల రోజులపాటు వివిధ గ్రామాల్లో నిర్వహిస్తారు. ఈ యేడాది 38 గ్రామాల్లో ఈ జాతర ఉత్సవాలను నిర్వహించేందుకు డీడీఎస్ మహిళలు కార్యక్రమాలకు రూపకల్పన చేసారు. జాతర సందర్భంగా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి సంప్రదాయ, ఆధునిక పద్దతుల్లో పంటల సాగులో వ్యత్యాసాలపై సుధీర్గంగా చర్చించి నివేదికలు రూపొందించుకుంటారు. గ్రామీణ రైతుల అభిప్రాయాలను నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. డీడీఎస్ కృషి ఫలితంగానే పార్లమెంట్‌లో ఆహార భద్రత బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందన్న అభిప్రాయం సంస్థ సభ్యులో నెలకొంది. పత్తి, సోయా లాంటి పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించడం, పాత పంటల సాగును నిర్లక్ష్యం చేస్తూ పరోక్షంగా జొన్న, సజ్జ, కొర్ర, రాగులు తదితర పంటలను నిరాదరణకు గురి చేస్తున్న వైనంపై రైతులతో తాజా జాతరలో చర్చకు పెట్టబోతున్నారు. జాతర సందర్భంగా 16 ఎడ్ల బండ్లను ఏర్పాటుచేస్తారు. బండ్లపై గ్రామ దేవత చిత్రపటం, చిరుధాన్యాలు అలంకరించడం, వంటకాలు అమర్చిన బండ్లు దర్శనమిస్తాయి. అలంకరించిన బండ్లను జాతర సందర్భంగా గ్రామాల్లో ఊరేగిస్తారు. బండ్ల ముందు కోలాటం, చెక్క భజన (చిటికెలు), సంఘం మహిళల ఆట, పాటలు లాంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే స్థాయిలో నిర్వహిస్తారు. బండ్లపై సుమారు 50 నుంచి 60 వరకు చిరుధాన్య విత్తనాలను అమర్చి ఊరేగిస్తారు. అదేవిధంగా ఎకరాలో 15నుంచి 20 రకాల పంటలను పండించే జీవవైవిధ్య సంప్రదాయాన్ని అవిశ్రాంతంగా కొనసాగిస్తున్న చిన్న, సన్నకారు మహిళా రైతులను ప్రత్యేకంగా సత్కరించి గౌరవించడం విశేషం. వారు చేపట్టిన సాగు సంబంధిత కార్యక్రమాలకు లఘు చిత్రాల ద్వారా ప్రదర్శిస్తారు. అవగాహన రాహిత్యంతో రైతులు సాగు చేస్తున్న పత్తి, సోయాలతో మానవాళికి, పర్యావరణానికి, పశువులకు కలుగుతున్న నష్టాలపై చర్చించి ప్రచారం నిర్వహించనున్నారు. జాతర బండ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. బండ్లకు వివిధ రంగుల చీరలతో ఆకర్షణీయంగా అమర్చి, ఎడ్లను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తారు. మహిళా సంఘాల సభ్యులు సంప్రదాయ పాటలు పాడుతూ ఊరేగింపును అనుసరిస్తారు. జాతర సందర్భంగా వివిధ స్టాళ్లు ఏర్పాటుచేస్తారు. వాటిలో సేంద్రియ ఎరువులు, విత్తన బ్యాంకులకు సంబంధించిన ఏర్పాట్లు, ఆయుర్వేద వైద్య మూలికలు, చిరుధాన్య వంటకాలకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. 18 సంవత్సరాల కాలంలో డీడీఎస్ గ్రామీణ ప్రజల ద్వారా అనేక సత్ఫలితాలను రాబట్టిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

చిత్రం..డీడీఎస్ ఆధ్వర్యంలో పాత పంటల జాతరకు ముస్తాబైన ఎడ్లబండ్లు