బిజినెస్

మామిడి వ్యాపారుల సిండికేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 9: చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వస్తోంది. వ్యాపారులు రింగ్ అవుతూ రోజుకో ధర నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో మంచి ధరలు వస్తాయని ఆశించిన రైతులకు ఆశించినంత స్థాయిలో ధరలు దక్కక పోవడంతో నష్టాలకు గురికావాల్సి వస్తోంది. ప్రధానంగా మండీలలో వ్యాపారులు రింగ్ అవుతూ ధరలను నిర్ణయిస్తుండడంతో మామిడి రైతులు అయిన కాడికి కాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మామిడి పంటకు పెట్టింది పేరు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5లక్షల హెక్టార్లలో మామిడి సాగవుతుండగా అందులో అత్యధికంగా 83 హెక్టార్లలో ఈ జిల్లాలోనే సాగవుతోంది. రాష్ట్రంలో 25శాతం పంట దిగుబడి ఈ జిల్లాలోనే ఉంటుంది. అలాగే ఎక్కడా లేని విధంగా ఈజిల్లాలోనే అత్యధికంగా మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణంలో నెలకొన్న మార్పుల కారణంగా పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. విపరీతమైన ఎండలతో 30శాతానికి పంట దిగుబడి పడిపోయింది. ఈ దిగుబడితో మంచి ధరలు వస్తాయని ఆశించిన రైతులకు వ్యాపారులు దగా చేస్తున్నారు. దీంతో మామిడి రైతుల్లో నిరాశ నిస్పృహలు చోటుచేసుకున్నాయి. అయితే సీజన్ ప్రారంభంలో మంచి ధరలు లభించినా క్రమేణా ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇటీవల కురిసిన గాలి, వానకు కూడా పంటకు నష్టం అనివార్యమైంది. అయితే దిగుబడి తగ్గిన తరుణంలో ఆశించిన ధరలు వస్తాయనుకున్న మామిడి రైతుకు వ్యాపారులు మొండి చేయి చూపిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండీలలో వ్యాపారులు రోజుకో ధరను నిర్ణయిస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో కొంత వరకు పంట నాశనం కావడంతో దీనే్న అదునుగా భావించిన వ్యాపారులు ధరలను గణనీయంగా తగ్గిస్తున్నారు. ఇది వరకు 35రూపాయల నుంచి 40రూపాయల వరకు పలికిన బేర్నీసా రకం నేడు 25-30రూపాయలకు వచ్చింది. ఇతర రకాలు కూడా ఇదే తరహాలో ధరలను తగ్గిస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఎగుమతులు లేవని మరోపక్క గుజ్జు పరిశ్రమ యజమానులు కాయలను కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు రైతులను పలు రకాలుగా నమ్మించి మోసం చేస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో మండీలకు తీసుకొచ్చిన కాయలను రైతులు అయినకాడికి అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ వేసవిలో ఎండ వేడిమికి పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు పండిన కాయలకు సైతం మంచి ధరలు దక్కక పోవడంతో కూలీ ఖర్చులు పంట సాగు చేసిన పెట్టుబడులకు సైతం వడ్డీలు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క మామిడి పంటకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక పోవడంతో వ్యాపారులు దీనిని ఆసరాగా తీసుకొని రైతులను తెలివిగా మోసం చేస్తున్నారు. గత 20రోజుల క్రితం ఆశించిన స్థాయిలో ధరలుదక్కినా నేడుమాత్రం సగానికి సగంధరలు తగ్గిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని మామిడి రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మామిడి రైతులు కోరుకుంటున్నారు.