బిజినెస్

ఒక శాతం మంది వద్దే 73 శాతం సంపద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 22: సమసమాజం స్థాపనకు ఘనమైన పథకాలను అమలు చేస్తున్నామని పాలకులు ఎంతగా గొప్పలు చెబుతున్నప్పటికీ భారత్‌లో ఆర్థిక అసమానతల తీరు ఆందోళనకరంగానే ఉంది. దేశంలో సంపద ఎక్కువ భాగం అత్యంత ధనవంతులైన కొద్దిమంది వద్దే కేంద్రీకృతమై ఉందని ‘ఆక్స్‌ఫామ్’ తాజా సర్వేలో తేటతెల్లమైంది. గత ఏడాది భారత్‌లో జరిగిన సంపద సృష్టిలో 73 శాతం కేవలం ఒక శాతం మంది వద్ద ఉందని ఆ సర్వేలో తేలింది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆర్థిక అసమానతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయనడానికి సర్వేలో వెలుగు చూసిన గణాంకాలే ప్రబల నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కేవలం ఒక్క శాతం మంది చేతుల్లో 73 శాతం సంపద కేంద్రీకృతం కావడం గమనార్హం. కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక నిపుణలు ఈ విపరిణామాలపై ఆందోళన చెందుతున్నారు.
గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన సంపద మొత్తంలో 82 శాతం ధనవంతులైన కేవలం ఒక శాతం మంది వద్దకు చేరుకుందని ‘ఆక్స్‌ఫామ్’ సర్వేలో వెల్లడైంది. కాగా, విశ్వవ్యాప్తంగా దాదాపు 3.7 బిలియన్ల మంది ప్రజలకు వారి సంపాదనలో ఎలాంటి వృద్ధి కానరావడం లేదని స్పష్టమైంది.
దావోస్‌లో జరిగే ‘ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు’లో ఆక్స్‌ఫామ్ సర్వే వివరాలపై కూలంకుషంగా చర్చించే అవకాశాలున్నాయి. ఈ సదస్సులో పాల్గొనే వివిధ దేశాల అధినేతలు తమ చర్చల సందర్భంగా ఆర్థిక, లింగ అసమానతలపై ప్రధానంగా తమ అభిప్రాయాలను బహిర్గతం చేసే అవకాశం ఉంది. 2016కు సంబంధించి ఆక్స్‌ఫామ్ సర్వేను విశే్లషిస్తే భారత్‌లో ఒక్క శాతం మంది ధనికుల వద్ద దేశంలోని సంపదలో 58 శాతం కేంద్రీకృతమైందని, ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం సంపద అతి కొద్దిమందికే పరిమితమై పోయిందని తేలింది. భారత్‌సహా అనేక దేశాల్లో ఇలా ధనవంతులు మరింత సంపన్నులవుతుండగా పేదవాళ్లు మరింత పేదరికంలో మగ్గుతున్నారు.
దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు’ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు ఆక్స్‌ఫామ్ సర్వే వివరాలు వివిధ దేశాధినేతలను ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఆ సర్వే ప్రకారం సంపద పంపిణీ తీరు భారత్‌లో ఏటా నిరాశాజనకంగానే ఉంది. తాజా సర్వే ప్రకారం భారత్‌లోని ఒక్క శాతం ధనికుల సంపద 2017లో 20.9 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సంఖ్య 2017-18 వార్షిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయించిన మొత్తంతో సమానం కావడం గమనార్హం. అన్ని దేశాల్లో సంపద వృద్ధి జోరుగా ఉన్నా పేదరికం కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. 2017లో భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2010 నుంచి చూస్తే భారత్‌లో కోటీశ్వరులు సంపద ఏడాదికి 13 శాతం సగటున వృద్ధి చెందింది. సాధారణ ఉద్యోగి సంపదతో పోల్చిచూస్తే ఇది ఆరురెట్లు ఎక్కువ అని సర్వేలో వెల్లడైన గణంకాలు చెబుతున్నాయి. భారత్‌లో ఓ ప్రముఖ కంపెనీలో అధిక జీతభత్యాలు తీసుకునే ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారి ఏడాదిపాటు సంపాదించిన మొత్తం గ్రామీణ ప్రాంతంలో కనీస వేతనం తీసుకునే ఓ చిన్న ఉద్యోగి సంపాదించడానికి కనీసం 941 ఏళ్లు పడుతుందట! వినడానికి వింతగా ఉన్నా ఇవన్నీ వాస్తవాలేనని ‘ఆక్స్‌ఫామ్’ సర్వేను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. అమెరికాలో అయితే ఓ ప్రముఖ కంపెనీ ముఖ్య కార్యనిర్వణాధికారి (సీఈవో) ఒక రోజుకు తీసుకునే జీతభత్యాన్ని అక్కడి సాధారణ ఉద్యోగి సంపాదించడానికి ఏడాది కాలం పడుతుందని తేలింది.
భారత్ సహా పది దేశాల్లో ఆక్స్‌ఫామ్ సర్వే సందర్భంగా 70వేల మంది నుంచి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. పేద, ధనిక వర్గాల మధ్య విస్తరిస్తున్న అంతరాన్ని తగ్గించాల్సిన సమయం ఆసన్నమైందని సర్వే నిర్వాహకులు తెలిపారు. ఇందుకు వివిధ దేశాల అధినేతలు సమగ్ర కార్యాచరణ పథకాన్ని అమలు చేయడం తక్షణ అవసరం అని ‘ఆక్స్‌ఫామ్’ తెలిపింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో పాల్గొంటున్నందున, భారతీయ ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాల వారికి మేలు చేసేలా దృష్టి సారించాలని ఆక్స్‌ఫామ్ విజ్ఞప్తి చేసింది. ఉపాధిని పెంచే ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలని, సామాజిక భద్రతా పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పన్నులు ఎగవేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అత్యంత సంపన్నులపై పన్నులను పెంచే అవకాశాలను కూడా పరిశీలించాలని ఆక్స్‌ఫామ్ సూచిస్తోంది. బ్రిటన్, అమెరికా, భారత్ వంటి దేశాల్లో సీఈవోలకు 60 శాతం వేతనాలను తగ్గించాలని సర్వేలో పాల్గొన్నవారిలో చాలామంది అభిప్రాయపడ్డారు.
కార్మికుల హక్కులను హరించడం, ఆర్థిక విధానాల రూపకల్పనలో కార్పొరేట్ శక్తుల, సంపన్నుల ప్రభావం తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని కూడా ఆక్స్‌ఫామ్ సూచించింది. దేశ ఆర్థిక ఫలాలు కొంతమంది చేతుల్లోకి వెళుతుండడం ప్రమాదకరమైన సంకేతమని ‘ఆక్స్‌ఫామ్ ఇండియా’ సీఈవో నిషా అగర్వాల్ అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ పతనానికి ఇదో ఉదాహరణ అన్నారు. కార్మికులు, కర్షకులు తమ పిల్లల చదువులకు, వైద్య అవసరాలకు నోచుకోవడం లేదని ఆమె అన్నారు. ఆర్థిక వ్యత్యాసాల కారణంగా అవినీతి పెరుగుతోందన్నారు. కోటీశ్వరుల జాబితాలో పురుషులదే ఆధిపత్యం కాగా, వంశపారంపర్యంగా మాత్రమే కొద్దిమంది మహిళలకు ఆ జాబితాలో చోటు లభించింది.