బిజినెస్

ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫివ్రబరి 24: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలోని రెండవ అతిపెద్ద బ్యాంకు పీఎన్‌బీలో రూ.11,400 కోట్ల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుపరం చేయాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. ఢిల్లీలో శనివారం జరిగిన ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న జైట్లీ మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ డిమాండ్‌ను కొట్టిపారేశారు. ‘ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణ కూడా అవసరం. ఈ నిర్ణయానికి భారత రాజకీయ వ్యవస్థ అభిప్రాయం సానుకూలంగా ఉంటుందని నేను భావించడం లేదు. దీనిపై నిర్ణయం తీసుకోవడం అతిపెద్ద సవాలు’ అని జైట్లీ అన్నారు. ‘్ఫక్కీ’ అధ్యక్షుడు రషెష్ షా, ‘అసోచామ్’ ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను చేపట్టాలని జైట్లీని కోరిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ బ్యాంకులలో రెండు మూడింటిని మినహా మిగతావాటిని ప్రైవేటుపరం చేయాలన్నది వారి సూచన.
బ్యాంకు నియంత్రణ, నిర్వహణ వ్యవస్థ, ఆడిటింగ్ విభాగాల అలసత్వ వైఖరి, మొక్కుబడి ధోరణితోకూడిన పనితీరు వల్లే సకాలంలో అక్రమాలను పసిగట్ట లేకపోయారని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తీవ్ర విమర్శలు చేశారు. వేలాది కోట్ల కుంభకోణానికి పాల్పడిన వారిని శిక్షించేందుకు చట్టాన్ని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల రూపాయల కుంభకోణం ఒక్కరోజులో జరిగినది కాదని, ఏళ్ల తరబడి జరుగుతున్నా ఎందుకు కనిపెట్ట లేకపోయారని ఆడిటింగ్, బ్యాంకు నిర్వహణ యంత్రాగాలను ప్రశ్నించారు. ఆయా విభాగాల వైఫల్యంవల్లే ఇలాంటి కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన అన్నారు. పీఎన్‌బీ కుంభకోణంపై ఈవారంలో జైట్లీ స్పందించడం ఇది రెండోసారి. వ్యాపారుల్లో కొరవడిన నైతికత, బహుళ దశల్లో ఎక్కడో ఒకచోట లోపాలను గుర్తించాల్సిన ఆడిటింగ్ వ్యవస్థ అలా చేయలేకపోయిందని, మొక్కుబడి పనితీరు దీనికి కారణమని ఆయన అన్నారు. ఇంత పెద్ద మోసం ఏళ్ల తరబడి సాగుతూంటే ఏ ఒక్క దశలోనూ, ఏ ఒక్కరూ పసిగట్ట లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, నీరవ్‌మోదీ పేర్లను నేరుగా ప్రస్తావించని జైట్లీ విస్తృత యంత్రాంగం ఉన్న అతిపెద్ద బ్యాంకులో ఏం జరుగుతున్నదో తెలుసుకోలేకపోవడం బ్యాంకు నిర్వాహకుల అలసత్వాన్ని చాటుతోందని, పర్యవేక్షణపై దృష్టి నిలపకపోవడం మరోకారణమని ఆయన విమర్శించారు. బహుముఖ దశల్లో జరిగే ఆడిటింగ్ వ్యవస్థలో ఏదో ఒక దశలో, ఎలాగోలా లోపాలను, అవకతవకలను పసిగట్టాల్సి ఉంటుందని, అయితే అలా జరగలేదని ఆయన అన్నారు.నిజానికి బ్యాంకింగ్ రంగంలో నియంత్రణ వ్యవస్థ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని, విధివిధానాలను నిర్ణయించే వ్యవస్థ ఇదేనని, వీరు మూడో కన్నును తెరిచి అక్రమాలను పసిగట్టాల్సి ఉంటుందన్న జైట్లీ మనదేశంలో మాత్రం నియంత్రణాధికారుల జవాబుదారీగా వ్యవహరించరని, ఇక్కడ రాజకీయ నేతలు బాధ్యత వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విధానపరమైన లోపాలను సవరిస్తూ, వాటిని మరింత కఠినతరం చేయాలని, చట్టాన్ని మరింత పదునుపెట్టాలన్న జైట్లీ అవినీతి కేసుల్లో నిందితులు ఎక్కడున్నా వారిపై చట్టానికి అనుగుణంగా కఠినంగా చర్యలు తీసుకోక తప్పదని అన్నారు. నైతికతతో కూడిన వ్యాపారాలు చేయాల్సిన అవసరాన్ని భారత వ్యాపారరంగం గుర్తించాలని ఆయన సూచించారు. రుణదాత, రుణగ్రహీతల మధ్య అనైతిక సంబంధాలు సరికాదని అన్నారు. ఇలాంటి కుంభకోణాలు భారత ఆర్థికరంగంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయని, మనదేశంలో సులువుగా వ్యాపారాలు చేసుకునే వాతావరణం ఉందన్న ప్రచారంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. పీఎన్‌బీ కుంభకోణంపై గతవారం స్పందించిన జైట్లీ బ్యాంకింగ్ వ్యవస్థలో పర్యవేక్షణ విభాగాల వైఫల్యాన్ని ఎత్తిచూపారు. అవకతవకలను కనిపెట్టే సరికొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.