రాష్ట్రీయం

విశాఖకా? అమరావతికా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 16: నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడటం, కొత్త ప్రభుత్వ పాలన మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా పాలనా నిర్వహణలో ఇంకా స్పష్టత లేనేలేదు. కీలకమైన గిరిజన సహకార సంస్థ (జిసిసి), ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ (ఏపీటిడిసి), ఏపీఆర్‌ఎస్‌ఆర్టీసీలు రాజధాని అమరావతికి తరలి వస్తాయా? లేదంటే స్మార్‌సిటీగా అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలోనే ఏర్పాటవుతాయా? అన్న సందిగ్ధం నెలకొంది. ఈ శాఖల వర్గాల్లోను ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో స్పష్టత లేకపోవడంతో వ్యాపార లక్ష్యాలు సాధనలో సాంకేతికపరమైన ఇబ్బందులు నెలకొంటున్నాయంటూ ఈ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వీటి నిర్వహణ వివాదాస్పదంగా మారుతోంది. నిధుల మంజూరులో ఏలాగూ వివక్షకు గురవుతున్న ఈ సంస్థలు పూర్తిస్థాయిలో ఎక్కడి నుంచి నిర్వహించాలో తేల్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 13 జిల్లాలతో కూడిన నవ్యాంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న గిరిజన సహకార సంస్థ (జిసిసి) వ్యాపారపరంగా ఏడాదిన్నర కిందటనే విడిపోయింది. సొంత వ్యాపారంతోనే లక్ష్యాలు సాధిస్తున్న జిసిసి ప్రధాన కార్యాలయాన్ని విశాఖలోనే ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం కొన్నాళ్ళ కిందటనే ప్రకటించింది. ఇప్పటి వరకు హైదరాబాద్ సంక్షేమ భవన్‌లోనే ఓ విభాగంగా నడిచే జిసిసిని నవ్యాంధ్రప్రదేశ్‌లోనైనా పూర్తిస్థాయిలో అభివృద్ధిపర్చాలనే లక్ష్యంతో అటవీ ఉత్పత్తులు అధిక దిగుబడికి అవకాశాలున్న విశాఖలోనే దీని ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.16 కోట్ల నిధుల మంజూరు చేస్తామన్న సర్కార్ 12 కోట్లతో సరిపెట్టింది. ఈ నిధుల్లో ఒక్కపైసా కూడా విదల్చకపోవడంపట్ల సంస్థ వర్గాలను నిరాశకు గురిచేస్తోంది. ఒకవైపు కాఫీ ప్రాజెక్టు, జిసిసి పెట్రోల్ బంక్‌లు, సూపర్‌బజార్లు నిర్వహణ ద్వారా వ్యాపారాన్ని అనూహ్యంగా పెంచుకున్న సంస్థ గిరిజన నిరుద్యోగులకు వీటిల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంలోను దేశంలోనే అత్యుత్తమ సంస్థగా ఎదిగింది. అలాగే షాపింగ్‌మాల్స్ ద్వారా అటవీ ఉత్పత్తుల అమ్మకాలు నిర్వహించగలుగుతోంది. ఈ విధంగా జిసిసిని మరింతగా ప్రోత్సహించడానికి బదులు నిధుల మంజూరులో తీవ్ర జాప్యం, ప్రధాన కార్యాలయ నిర్మాణంలో ఎటువంటి ఆదేశాలు లేకపోవడంపట్ల ఈ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే ఏపీ పర్యాటక అభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయాన్ని విశాఖలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. టూరిజం హబ్‌గా మార్చేస్తామనే ప్రచారానికే పరిమితమవుతున్న విశాఖ పర్యాటక అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉందనేది ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల మంజూరు కాకపోవడమే స్పష్టంచేస్తుంది. పర్యాటకంగా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించకపోగా, కొత్త వాటికీ అతీగతీలేదు. ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు, చిత్తూరు జిల్లాలకు పర్యాటకంగా ఇస్తున్న ప్రాధాన్యతను విశాఖకు ఇవ్వకపోవడంపట్ల నిరసన వ్యక్తమవుతోంది. కనీసం విశాఖ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించినట్టుగా అయినా ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే అపుడైనా పర్యాటక పథకాల అమలుకు అవకాశం ఉంటుందని పర్యాటకులు అంటున్నారు. ఇదే తరహాలో ఆర్టీసీ కార్యాలయం ఎక్కడనేది తేల్చలేకపోతున్నారు. ఆర్టీసీ ఆస్తులు హైదరాబాద్‌లో 25వేల కోట్ల వరకు ఉండగా, దీని ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తామనే ప్రభుత్వ ప్రకటన ఇపుడు వివాదస్పదంగా మారింది. ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ఆస్తులునైనా స్వాధీనం చేసుకుంటే బాగుంటుందని సంస్థ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది జరగకుండా కార్యాలయాన్ని మార్పు చేసి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ మూడు కార్పొరేషన్ల ప్రధాన కార్యాలయాల నిర్వహణ ఎక్కడ? ఏవిధంగా నిర్వహించాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో సంబంధిత వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.