బిజినెస్

నాకొద్దీ గవర్నర్‌గిరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 18: ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా మళ్లీ నేను కొనసాగలేను. రెండో దఫా ఈ పదవిని ఆశించడం లేదు.’ అని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల మధ్య మునుపెన్నడూ లేనివిధంగా ఓ ఆర్‌బిఐ గవర్నర్ పదవి తీవ్ర చర్చనియాంశం కావడం ఇదే ప్రథమం. కేంద్ర ప్రభుత్వ వర్గాలు రాజన్‌కు వ్యతిరేకంగా, వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినది తెలిసిందే. ముఖ్యంగా బిజెపి నేత సుబ్రమణ్యన్ స్వామి తీవ్రస్థాయిలో రాజన్‌పై విరుచుకుపడుతున్నది విదితమే. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టలేకపోయారని, ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చేలా కీలక వడ్డీరేట్లను తగ్గించలేకపోయారని ఆరోపించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాజన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వానికో అభిప్రాయం, రాజన్‌కో అభిప్రాయం ఉండటమూ రాజన్‌పై రాజకీయ విమర్శలకు దారితీసింది. ఇటీవల భారత ఆర్థిక ప్రగతిని ‘గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికన్ను ఉన్నవాడే రాజు’తో పోల్చడం కేంద్ర ప్రభుత్వానికి అస్సలు రుచించడం లేదు. అంతకుముందు కూడా రాజన్‌తో ఎడమోహం-పెడమోహంగా ఉన్న సర్కారు ఈ వ్యాఖ్యలను భరించలేకపోయింది. వాస్తవాలను మరుగున పెట్టడం మంచిది కాదనే రాజన్‌ను మళ్లీ ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగిస్తే సరికాదని భావించిన మోదీ ప్రభుత్వం.. తమ భావనకు తగ్గట్లుగానే పావులు కదిపిందని రాజన్ తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. ఆర్‌బిఐ, ఆర్థిక శాఖ మధ్య సత్సంబంధాలే ఉన్నాయని పైకి చెబుతున్నా, లోపల మాత్రం అందుకు విరుద్ధంగానే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రాజన్ నాకొద్దీ గవర్నర్‌గిరీ అనేశారు. నిజానికి విదేశీ పర్యటనలో ‘మరోసారి ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగాలని ఉంది. చేయాల్సింది చాలా ఉంది.’ అని రాజన్ తన మనసులో మాటను బయటపెట్టారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆర్‌బిఐ గవర్నర్‌గా తానుండలేను అని ప్రకటించారంటే రాజకీయ విమర్శలు రాజన్‌ను ఎంత బాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్‌బిఐ గవర్నర్ బాధ్యతలను, అధికారాలను తక్కువ చేయాలని మోదీ సర్కారు చూడటం కూడా తాజా నిర్ణయానికి ఓ కారణమని పలువురు విశే్లషిస్తున్నారు. అయితే దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజన్ వంటి సమర్థులు ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉండి తీరాలన్న ఆకాంక్ష వ్యాపార, పారిశ్రామిక, ఆర్థిక రంగాల నుంచి బలంగా వ్యక్తమవుతోంది. కాగా, రాజన్ అమెరికా పౌరసత్వంపై చెలరేగు తున్న దుమారాన్ని ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా కొట్టిపారేశారు. అయినప్పటికీ శనివారం ఆర్‌బిఐ సిబ్బందికి పంపిన సందేశంలో ‘నేను తిరిగి అధ్యాపక వృత్తిలోకే వెళ్తున్నాను. ఈ ఏడాది సెప్టెంబర్ 4తో ఆర్‌బిఐ గవర్నర్‌గా నా పదవీకాలం ముగుస్తోంది. రెండోసారి ఈ పదవిలో కొనసాగదలుచుకోలేదు’ అన్నారు. 2008లో చోటుచేసుకున్న ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ముందే పసిగట్టిన ఘనుడు రఘురామ్ రాజన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) ఆర్థికవేత్తగా రాజన్ సామర్థ్యాన్ని ఐఎమ్‌ఎఫ్ చీఫ్ క్రిస్టినా లగార్డే కొనియాడిన సందర్భాలు కోకొల్లలు. రాజన్‌ను కాంగ్రెస్ నేతృత్వంలోని గత యుపిఎ ప్రభుత్వం 2013, సెప్టెంబర్ 4న ఆర్‌బిఐ గవర్నర్‌గా మూడేళ్ల పదవీకాలానికిగాను నియమించింది. దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఈయన వచ్చారు. కాగా, తన తర్వాత గవర్నర్‌గా పదవిని చేపట్టేవారు ఆర్‌బిఐని కొత్త శిఖరాలకు చేర్చాలని రాజన్ ఆకాంక్షించారు. రాజన్ తన మూడేళ్ల పదవీ కాలంలో ద్రవ్యోల్బణంపై తీవ్రంగా పోరాడిన చరిత్రను సొంతం చేసుకోగా, రెపో, రివర్స్ రెపో రేటును ప్రస్తుత సంవత్సరంలోనే భారీగా తగ్గించారు.
‘రెగ్జిట్’ ముగిసింది!
ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే అంశం (బ్రెగ్జిట్) కంటే కూడా భారత్‌లో ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ మరోసారి ఉంటారా? ఉండరా? అన్నదే (రెగ్జిట్) ఎక్కువ చర్చనియాంశమైంది. నెటిజన్లు కూడా ఈ విషయంలో పెద్ద ఎత్తునే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, రాజన్‌కు మద్దతుగానే మెజారిటీ ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఓట్లు ఆర్‌బిఐ గవర్నర్ ఎంపికకు ప్రాతిపదిక కాదని సుబ్రమణ్యన్ స్వామి అంటున్నారు. అయినప్పటికీ రాజన్ మాత్రం అందరి మదిలోనూ చెరగని ముద్ర వేశారు. మొత్తానికి ‘రెగ్జిట్’ కథ ముగిసింది.
అన్ని అంశాలపైనా స్పందన
రాజన్ కేవలం ఆర్థికపరమైన అంశాలపైనే కాకుండా ఇతర అన్ని అంశాలపైనా స్పందిచేవారు. అసహనం దగ్గర్నుంచి, పిల్లల విద్య, రుణాలు, జిడిపి విధానాలు, అంతర్జాతీయ పరిణామాలపై వెనువెంటనే స్పందించేవారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం విద్యార్థులతో గడపాలని కోరుకునేవారు. వారి ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిస్తూ, వారి విజ్ఞానానికి బాటలు వేసేవారు.
**
‘నేను ఓ విద్యావేత్తను. ఎల్లప్పుడు నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తాను. ఆర్‌బిఐ గవర్నర్‌గా నా మూడేళ్ల పదవీకాలం ముగుస్తోంది. ఇక మళ్లీ షికాగో విశ్వవిద్యాలయానికి వెళ్తాను. అక్కడ పాఠాలు చెబుతాను.’
- ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్
**