బిజినెస్

త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 21: ప్రభుత్వం త్వరలో తీసుకు రానున్న కొత్త పారిశ్రామిక విధానం కొత్తగా పెట్టుబడులను తీసుకొస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. అలాగే ఈ విధానం వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వస్తు తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగం వాటా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించి ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలను జీఎస్‌టీ మండలి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ‘వాణిజ్య మంత్రిత్వ శాఖ కొత్త పారిశ్రామిక విధానాన్ని ఆమోదించింది. ప్రస్తుతం ఇది అంతర్ మంత్రిత్వ శాఖల చర్చల దశలో ఉంది. అతి త్వరలోనే క్యాబినెట్ దీనిని ఆమోదిస్తుందనే విశ్వాసం నాకు ఉంది’ అని సురేశ్ ప్రభు అన్నారు. మంత్రి శనివారం ఇక్కడ రసాయనాల ఎగుమతుల పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ‘కొత్త పారిశ్రామిక విధానం వల్ల పారిశ్రామిక రంగంలోకి కొత్తగా పెట్టుబడులు వస్తాయి. జీడీపీలో మాన్యుఫాక్చరింగ్ రంగం పాత్ర బాగా మెరుగుపడుతుంది’ అని ఆయన అన్నారు. రసాయన పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. అయితే, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడమనే లక్ష్యాన్ని సాధించడంపై పారిశ్రామిక రంగమే జాగ్రత్తతో కేంద్రీకరించాలని మంత్రి సూచించారు.
భారత్ రానున్న ఏడు, ఎనిమిది ఏళ్లలో అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అయితే, పేద దేశం కోసం రూపొందించిన వ్యాపార నియమాల ద్వారా పాలనను జాతి భరించజాలదని ఆయన పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త మార్కెట్ అవకాశాల సృష్టిపై పారిశ్రామిక రంగం తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జీఎస్‌టీ అనేది ఎంతో ప్రధానమయిన అంశమని పేర్కొంటూ ప్రభుత్వం ఇప్పటికే ఎగుమతి సంస్థలతో భేటీ అయిందని, అనేక సమస్యలను ఇప్పటికే పరిష్కారం చేసిందని మంత్రి తెలిపారు. ఇంకా పరిష్కారం కాకుండా మిగిలి ఉన్న సమస్యలను జీఎస్‌టీ మండలి దృష్టికి తీసుకెళ్లి, తగిన రీతిలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమస్యలను రాష్ట్రాలకు సంబంధించిన జీఎస్‌టీ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. ఎందుకంటే వారు కూడా జీఎస్‌టీ మండలిలో భాగస్వాములని పేర్కొన్నారు. దీనివల్ల సమస్యలను మెరుగయిన రీతిలో పరిష్కరించడానికి ప్రభుత్వానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. విదేశీ వాణిజ్యానికి సంబంధించిన లావాదేవీలను హ్యాండిల్ చేయడానికి ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని తాను భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. దేశ రసాయనాల రంగానికి ఎంతో వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ ఎగుమతి సామర్థ్యాలను పెంచుకోవాలని ఆయన సూచించారు.